భారత్- అమెరికా దౌత్య సంబంధాలపై అమెరికా మాజీ రక్షణ అధికారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఇరు దేశాల మధ్య మైత్రి దెబ్బతినడానికి పాకిస్థాన్ కారణమన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలే వల్లే భారత్ - రష్యా మధ్య స్నేహం మరింతగా చిగురిస్తుందని తెలిపారు.
భారత్- అమెరికాల మధ్య ప్రస్తుతం దౌత్య సంబంధాలు మెరుగ్గా లేవు. దానికి కారణం ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ తొందరపాటు నిర్ణయాలతో పాటు తలబిరుసు వ్యాఖ్యలు ఈ రెండింటి కారణంతో భారత్- యూఎస్ మధ్య గ్యాప్ పెరిగింది. అదే సమయంలో ఇండియా- రష్యా మధ్య ద్వైపాక్షిక బంధాలు మరింత బలపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ మాజీ రక్షణ అధికారి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.
అమెరికా రక్షణ శాఖ మాజీ అధికారి మిచెల్ రూబిన్ మాట్లాడుతూ "భారత్- అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను ట్రంప్ రివర్స్ చేసిన విషయం పట్ల చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ట్రంప్ ఇలా చేయడానికి కారణమేంటా అని? ఆలోచిస్తున్నారు. బహుశా పాకిస్థానీల పొగడ్తల వల్లనో లేక పాకిస్థాన్, టర్కీ, ఖతార్ దేశాలు ఆయనకు లంచం ఇచ్చి ఉండవచ్చు. ఈ లంచం అమెరికాను ద్రవ్యలోటులో ఉంచబోతుందని" ఆయన అన్నారు. రష్యాతో, అమెరికా వాణిజ్యం చేస్తూనే ఇండియాను ట్రేడ్ చేయద్దని అడ్డుకంటుందన్నారు.
భారత ప్రజలు వారి ప్రధాని మోదీని ఎన్నుకున్నది అక్కడి ప్రజల అవసరాలను తీర్చడానికే అన్న విషయం అమెరికన్లకు అర్థం కావడం లేదన్నారు. భారత్ అనేది చాలా పేరు గల దేశం త్వరలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఎకానమీగా అవతరిచబోతుంది. అటువంటి దేశానికి ఎనర్జీ అవసరం ఎంతో ఉంటుందన్నారు. ఒకవేళ రష్యా చమురు కొనకుండా భారత్ ను నియంత్రించాలనుకుంటే అమెరికా అంతకంటే తక్కువ ధరకు ఆ దేశానికి చమురు అందించాలని తెలిపారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే మౌనంగా ఉండడం ఉత్తమం అన్నారు. ఎందుకంటే ఏ దేశమైన వారి అవసరాలకు అనుగుణంగానే నడుచుకుంటుందని మిచెల్ రుబెన్ తెలిపారు.
యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ఆపరేషన్ సింధూర్ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్- పాక్ మధ్య యుద్ధం తానే ఆపానని అన్నారు. అంతే కాకుండా రష్యా చమురు కొంటే అధిక పన్నులు విధిస్తానని భారత్ ను హెచ్చరించారు. ఇండియా ట్రంప్ వ్యాఖ్యలని లెక్కచేయకపోవడంతో ఆగస్టులో భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై 50 శాతం పన్ను విధించారు.


