ఆహారం మన ప్రాణాలకు దివ్వౌషధమే కాదు..ప్రజందర్నీ ఒక చోటకు చేరుస్తుంది. భోజనం చేసే ప్రదేశమే(హోటల్ లేదా రెస్టారెంట్) మనకు కొత్త కొత్త వ్యక్తులను పరిచయం చేస్తుంది. అక్కడే మనకు తోడు, స్నేహం, ప్రేమ వంటివి దొరుకుతాయి కూడా. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన నానుడిలా ఆహారం..అన్నింటిని చెంతకు చేరుస్తుంది అనొచ్చు. ఒక్కోసారి ఆ భోజనశాలే మన ప్రాణాలకు రక్షగా కూడా మారుతుంది. అదెలాగో ఈ ఇంట్రస్టింగ్ స్టోరీ చకచక చదివి తెలుసుకోండి మరి..
అమెరికాలో జరిగి అరుదైన సందర్భం. 78 ఏళ్ల చార్లీ హిక్స్ ఫ్లోరిడాలోని పెన్సకోలాలోని ష్రిమ్ప్ బాస్కెట్ అనే రెస్టారెంట్‌లో రోజుకు రెండుసార్లు భోజనం చేసేవాడు. పదేళ్లుగా ఈ రెస్టారెంట్‌లోనే భోజనం చేస్తున్నాడు. ఆ రెస్టారెంట్ స్టాఫ్‌కి కూడా అతడు బాగా అలవాటైపోయాడు. వాళ్లంతా అతడి రాకకై తలుపులు తెరిచే ఉంచేవారు. అలాంటిది కొన్నిరోజుల నుంచి అనూహ్యంగా రెస్టారెంట్ రాలేకపోతాడు. ఇంతలా సడెన్‌గా ఆయన రాకపోవడానికి కారణం ఏంటని ఆ రెస్టారెంట్‌లోని 45 ఏళ్ల చెఫ్ డోనెల్ స్టాల్‌వర్త్ ఆరా తీశారు.
దశాబ్దకాలంగా అతనికి సర్వీస్ అందిస్తున్న ఆ చెఫ్ వృద్ధుడి గురించి ఆరా తీసి ఫోన్‌చేసి మరి కనుక్కోగా అనారోగ్యంగా ఉన్నట్లు తెలుస్తుంది. దాంతో వాళ్లు అతని ఆర్డర్‌ని అతని ఇంటి వద్దకే డెలివరీ చేస్తారు. అతడి డోర్ వద్ద పదేపదేఆహార డెలివరీ చేసినా..అతడు బయటకువచ్చితీసుకోవడం లేదని తెలుస్తుంది. దాంతో టెన్షన్‌తో ఆ చెఫ్ డోనెల్ స్టాల్‌వర్త్ అతని డోర్ వద్ద నిలబడి చాలాసేపు కొట్టినా..ఎలాంటి రెస్పాన్స్ రాదు.
దాంతో అతనిలో ఆందోళన పెరిగిపోతుంది. ఏం చేయాలో తెలియక అలానే డోర్ కొడుతూనే ఉండగా చిన్నగా లోగొంతుతో కూడిన కేక వినిపిస్తుంది. ఏదోలా డోర్ పగలు కొట్టి వెళ్లగా వృద్ధుడు చార్లీ హిక్స్ నేలపై పడి ఉండటం చూసి షాక్ తింటాడు చెఫ్ డోనెల్. అతని పక్కటెముకలు విరిగి, డీహైడ్రేషన్‌కి గురై ఉంటాడు. వెంటనే అతడిని చెఫ్ డోనెల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించి.. అక్కడికే ఆహారం డెలివరీ అయ్యేలా కేర్ తీసుకుంటారు.
ఆశ్చర్యకరంగా ఆ వృద్ధుడు చార్లీ వారి ప్రేమ, అప్యాయతలకు త్వరితగతిన కోలుకుని డిశ్చార్జ్ అవుతాడు. అంతేగాదు అతన్ని 24 గంటలూ పర్యవేక్షించడం కోసం రెస్టారెంట్ పక్క అపార్ట్‌మెంట్‌లోకే షిఫ్ట్ అయ్యేలా చేస్తారు సదరు రెస్టారెంట్ నిర్వాహకులు. నిజానికి ఇది ఆహారంతో ముడిపడిన బంధం అని ఆనందంగా చెబుతున్నాడు చార్లీ.
అయితే చెఫ్ డోనెల్ మాత్రం అతడే తన తాత, మావయ్యా అన్నీనూ అని ఆనందంగా చెబుతాడు. ప్రస్తుతం అతడి భోజనం దినచర్య ఆ రెస్టారెంట్‌లో యథావిధిగా సాగుతుంది. తనకు వడ్డించేది కూడా చెఫ్ డోనెల్. చెప్పాలంటే వ్యాపారానికి మించిన స్నేహం..ఆహారం కలిపిన బంధం కదూ..!. అందుకే "తినే అన్నంపై కోపగించుకోవడం, తినడం మానేయడం, వృధా చేయడం వంటివి అస్సలు చేయొద్దు సుమీ"..!.
(చదవండి: తొమ్మిది పదుల వయసులో 400 పుష్-అప్‌లు..! అతడి ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటంటే.)


