హైదరాబాద్ నగరంలో మరో ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వేదిక కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఎంట్రీలు ఆహ్వానించగా.. అతికొద్ది సమయంలోనే 704 ఎంట్రీలు వచ్చాయి. ఇందులో నుంచి పలువురు నిష్ణాతులైన జ్యూరీ సభ్యులు 60 లఘు చిత్రాలను, మరో 11 ఈశాన్య లఘు చిత్రాలను కలిపి మొత్తం 71 చిత్రాలను, వీటితోపాటు ప్రేక్షకులను అలరించడానికి ఐదు క్లాసిక్ సినిమాలను ఎంపిక చేశారు.
వీటిలో ఈజిప్ట్, స్పెయిన్, యూఎస్‌ఏ, టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, యూకే, శ్రీలంక, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, రష్యా, యూఏఈ దేశాలకు చెందిన ఉత్తమ చిత్రాలను ఈ నెల 19 నుండి 21వ తేదీ వరకు ఖైరతాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్‌లోని స్కీన్ నెంబర్ 4, 5లో ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్వహణ కమిటీ ప్యాట్రన్, అంకురం సినిమా (Ankuram movie) దర్శకులు, తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు జ్యూరీ కమిటీ సభ్యులు ఉమామహేవ్వరరావు వివరాలను వెల్లడించారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో, దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ దీనిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భావి చలనచిత్ర నిర్మాతలకు, చలనచిత్ర రంగంలోకి రావాలనుకునే వారికి ఈ ఫెస్టివల్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
చదవండి: ఆలోచింపచేసే.. అంగమ్మాల్ సినిమా
19న సాయంత్రం 5:30 గంటలకు ప్రసాద్స్ ఐమాక్స్‌లో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభిస్తారని, ఉత్తమ చిత్రాలకు 21న సాయంత్రం ఆరు గంటలకు అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని తెలిపారు. ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసేందుకు నాగేష్ కుమార్, నాజర్, మైథిలిరావు, లీమాదాస్, అలెగ్జాండర్ లియోపో, డాల్టన్, శశి కుమార్‌ను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో కెమెరామెన్ మధు మహంకాళి, జర్నలిస్టు వీరయ్య పాల్గొన్నారు.


