ఆమె తానొక స్త్రీ అనే మర్చిపోయింది. పల్లెటూళ్లో ఒక గొడ్డులా కష్టపడి ఇద్దరు కొడుకులను సాకింది. పల్లెటూరి పలుకుబడి... పల్లెటూరి కట్టుబడి... ఇవి మాత్రమే ఆమెకు తెలుసు. కొడుకు ప్రయోజకుడై నగరం అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ తల్లికి ఒక కండిషన్ పెట్టాడు. ఆమె సంస్కృతిని తక్కువ చేస్తూ బట్టలు కట్టుకునే పద్ధతి మార్చుకోవాలన్నాడు. తమిళంలో తాజాగా విడుదలైన ‘అంగమ్మాల్’ ఆలోచనలు రేకెత్తిస్తోంది.
జీవితాంతం పంచె కట్టులో, భుజం మీద తుండుతో వ్యవసాయం చేస్తూ వచ్చిన తండ్రిని తన పెళ్లి కోసం ‘నువ్వు సూట్ వేసుకోవాల్సిందే నాన్నా’ అని కొడుకు పట్టుబడితే ఆ తండ్రికి ఊపిరి ఆడుతుందా? అసలు సూట్ వేసుకుని తిరగ్గలడా? బట్టలతోనా తండ్రికి గౌరవం? అయితే తండ్రి తొడుక్కునే బట్టలు ‘తక్కువ రకానివి’ అని నిర్ణయించేదెవరు?
అలాగే జీవితాంతం రవికంటే ఏమిటో ఎరగక బండ చాకిరీ చేస్తూ వచ్చిన తల్లిని మాత్రం ‘నువ్వు నా పెళ్లి సందర్భంగా రవిక తొడగాల్సిందే’ అని కొడుకు పట్టుబడితే?
ఆ తల్లి ఏం చేస్తుంది? ఏం చేయాలి? అటు కొడుకు మథనం... ఇటు తల్లి అంతర్మథనం. వెరసి ‘అంగమ్మాల్’ చిత్ర కథనం. తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ రాసిన ‘కొడు తుని’ అనే కథ ఆధారంగా దర్శకుడు విపిన్ రాధాకృష్ణన్ తెరకెక్కించిన చిత్రం ఇది. దిగ్దర్శకుడు కె.బాలచందర్ కోడలైన గీతా కైలాసం ఈ చిత్రంలో ప్రధాన పాత్ర ‘అంగమ్మాల్’గా నటించారు. ఆమె పెద్దకొడుకుగా భరణి, చిన్నకొడుకుగా శరన్ శక్తి నటించారు.
భర్త పోయిన తర్వాత ఇద్దరు కొడుకుల్ని కడుపులో దాచుకుని సాక్కున్న తల్లి అంగమ్మాల్ జీవిత పద్ధతి వేరే, ఆమె తీరు వేరే. భర్త లేని స్త్రీ ఊళ్లో బతకడం కష్టం కనుక ఆమె బండగా మారిపోయింది. మగరాయుడిలా తనను తాను మలుచుకుంది. జాకెట్ వేసుకోవడం ఆమె ఎరుగదు. బీడీ తాగుతూ, అందర్నీ అదిలిస్తూ, కుటుంబాన్ని అధీనంలో ఉంచుకొని బతకడం అలవాటైన మనిషి. కోపధారి, రోషనారి. ఇటువంటి మనిషికి ఇప్పుడు చిన్నకొడుకు వల్ల కలిగిన సంకటమే ఈ కథలోని మూలాంశం. కొడుకు పట్నానికి వెళ్లి చదువుకుంటూ ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయి ఇంట్లోవాళ్లు పెళ్లికి ఒప్పుకున్నారు. సంబంధం మాట్లాడటానికి అతని ఊరొస్తామంటున్నారు.
వాళ్లు పట్నవాసపు మనుషులు. హైక్లాసులో పెరిగినవారు. వారు వచ్చి, తన అమ్మ పద్ధతి, ప్రవర్తన చూస్తే ఏమనుకుంటారు? పెళ్లి విషయంలో పేచీ పెట్టరా? రవిక లేకుండా ఆమెను చూసి హవ్వా అనుకోరా? ఇదంతా ఆలోచించిన చిన్నకొడుకు రవిక వేసుకోమని పట్టుబట్టాడు. ఆమెతో పంతానికి పోయాడు. తల్లికి కొడుకు మీద ప్రేమ, అతని బతుకు మీద ఆరాటం. కానీ తన అస్థిత్వాన్ని తానెలా వదులుకోగలదు?
ఆమె భుజం మీద ఒక అడవి పువ్వు పచ్చబొట్టు ఉంటుంది. అది ఆ ప్రాంతంలో కొండల్లో పాతికేళ్లకు ఒకసారి పూస్తుంది. భలే సువాసన. ఆ పువ్వు ఆమె భుజం మీదఆమెకో అస్తిత్వంలా ఉంటుంది. ఆ అడవి పువ్వు పాతికేళ్లకు ఒకసారే ఎందుకు పూస్తుంది అనంటే ఏం చెప్పగలం? అది దాని స్వభావం. దానిని ప్రతి సంవత్సరం పూయమంటే పూస్తుందా? అంగమ్మాల్ రవిక వేసుకోకుండా ఎందుకుంది అనంటే ఆమెకు అలా అలవాటైంది. చీరను ఒంటికి కప్పుకుని ఇన్నాళ్లు బతికింది. ఊరికి కూడా అదే అలవాటైంది. వారికి లేని ఇబ్బంది. అంగమ్మాల్‌కు లేని చింత ఇప్పుడు కొడుక్కు వచ్చింది– అదీ పట్నం నుంచి వచ్చే ఎవరి కోసమో. ఆమె బాగా ఆలోచించింది.
చివరకు ఆమె తీసుకున్న నిర్ణయం ఆమెకూ, ఆమె కుటుంబంలోని వారికీ ఎలాంటి పరిస్థితులను కల్పించిందనేది చిత్రకథ. తమిళనాడులోని ఓ పల్లెలో కెమెరాను పాతి, చుట్టూ జరుగుతున్న అంశాలను చూపించిన సినిమా ఇది. అంత సహజమైన లొకేషన్లు, అక్కడి మనుషులు, వారి మనస్తత్వాలను ఈ చిత్రంలో చూపించారు. వారికి తగ్గ భాషనే డైలాగుల్లో వాడారు. గతంలో నిర్మాతగా వ్యవహరించిన గీతాౖ కెలాసం అనంతరం నటిగా మారారు. ఆమె కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోదగ్గ సినిమా ఇది. ఈ సినిమా మొత్తానికి ఆమె నటన అద్భుతం అనిపిస్తుంది. కుటుంబం కోసం రాయిలా మారిన మనిషి పద్ధతి చివరకు ఆ కుటుంబానికే ఇబ్బందికరంగా మారిన పరిస్థితుల్లో ఆ అమ్మ ఏం చేయాలో ఈ చిత్రం చూసి ఆలోచనలో పడాలి.
పైకి ఎదిగిన పిల్లలు తమ తల్లిదండ్రుల సంస్కృతిని వెనుకబాటుగా చూడటం, వారిని నలుగురి ఎదుటకూ తేకపోవడం, వారిని ‘సంస్కరించాల’ని చూడటం మన సమాజంలో వినబడుతూనే ఉంది. మనల్ని కన్నవాళ్లను మనం ‘కరెక్ట్’ చేయాలనుకోవడం వారు ‘గాయపడే’ స్థాయిలో జరగాలా? వారిని వారిలా ఉండనివ్వండి అని చెప్పే సినిమా ‘అంగమ్మాల్’. త్వరలో ఓటీటీలో రావచ్చు.


