ఆ రాత్రి నాకు ఏదో చప్పుడుకి మెలకువ వచ్చింది. లేచి లైట్ వేసి పడక గదిలోంచి హాల్లోకి వచ్చాను. ఓ కొత్త వ్యక్తి నాకు కనపడ్డాడు. అతను ఎవరో, అక్కడ ఎందుకు ఉన్నాడో నాకు అర్థమైంది. ఇంట్లోకి ఎలా ప్రవేశించాడా అని చూశాను. వంటగదిలోని వెంటిలేటర్‌కున్న రెండు ఇనప కడ్డీలు వంచబడ్డాయి. అతని చేతిలోని రెండున్నర అడుగుల పొడవున్న పంపు గొట్టంతోనే వాటిని వంచాడని ఊహించాను.
‘‘డబ్బు.’’ అతను చెప్పాడు.
‘‘డబ్బు?’’
‘‘డబ్బు, నగలు ఇస్తే హాని చేయకుండా వెళ్ళిపోతాను. లేదా...’’ చేతిలోని ఆయుధాన్ని ఝళిపించాడు.
గోడకి వేలాడే నా షోల్డర్ బేగ్‌ని అందుకుని జిప్పుని లాగాను. అందులోంచి తీసిన పర్స్ చూపించాను. దాన్ని తనవైపు విసిరేయమన్నట్లుగా సౌంజ్ఞ చేశాడు. ఆ పని చేశాను. వంగి దాన్ని అందుకుని అందులోని డబ్బుని చూసి మొహం చిట్లించాడు.
‘‘నేను అడిగింది బిచ్చం కాదు.’’ కోపంగా చెప్పాడు.
‘‘ఇంట్లో ఉన్నదంతే.’’
‘‘ఇంట్లో రెండు వందల ఏభై మాత్రమే ఉందంటే నమ్మను. నగలు ఎక్కడున్నాయి?’’ అడిగాడు.
‘‘నగలు లేవు. ఇంటి పైభాగం కొత్తగా కట్టించాను. నగలు బేంక్‌లో తాకట్టులో ఉన్నాయి. గోల్డ్ లోన్ తీసుకున్నాను.’’
అతని మొహంలో అసంతృప్తి కొట్టొచ్చినట్లుగా కనిపించింది.
‘‘ఈ ఇంట్లో నువ్వు, నేను తప్ప ఇంకెవరూ లేరని నాకు తెలుసు. నువ్వు మళ్ళీ నీ ఫేమిలీ ఫోటోలోని అందరినీ చూడాలనుకుంటే నేను అడిగింది ఇచ్చి పంపు.’’ కసురుతూ చెప్పాడు.
‘‘నేను అబద్ధం చెప్పలేదు.’’
‘‘బేంక్ గోల్డ్ లోన్ కాగితాలు చూపించు.’’ ఆ తెలివైన దొంగ కోరాడు.
‘‘అవి బేంక్ లాకర్‌లో ఉన్నాయి.’’
‘‘లాకర్ తాళం చెవి చూపించు.’’ రెట్టిస్తూ అడిగాడు.
నా భార్య బుర్రలా నాది చురుగ్గా ఆలోచించదు. అతన్ని భౌతికంగా ఓడించలేను. నా కష్టార్జితాన్ని అతనికి అప్పగించలేను.
‘‘ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? నువ్వు చెప్పింది కట్టు కథని నాకు తెలుసు. మీ పడక గదిలో బట్టల అలమర లోపల గోడకి ఫిక్స్ చేసిన ఐరన్ సేఫ్‌ని తెరు.’’ రుసరుసలాడుతూ ఆజ్ఞాపించాడు.
అందులోని నా భార్య నగల విలువ పాతిక లక్షలకి తక్కువ ఉండదు.
‘‘పద.’’
‘‘మా ఆవిడ దాని తాళంచెవి ఎక్కడ పెట్టిందో నాకు తెలీదు.’’
‘‘సరే. ఆవిడకి ఫోన్ చేసి అడుగు.’’
‘‘ఇప్పుడా?’’
‘‘భార్యకి భర్త ఏ సమయంలోనైనా ఫోన్ చేయొచ్చు. ముఖ్యంగా తన ప్రాణం మీదకి వచ్చిన సందర్భంలో. మీ ఆవిడతో తాళం చెవి గురించి తప్ప ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే తల పగులుతుంది. అందులో ముఖ్యమైన కాగితాలు ఉన్నాయని, రేపు వాటి అవసరం ఉందని గుర్తొచ్చిందని చెప్పు. నువ్వు చెప్పిందంతా నేను నమ్మానని అనుకోక. నీకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ మాత్రమే ఇస్తున్నాను. నేనీ ఇంట్లోంచి ఈ రాత్రి డబ్బు, బంగారంతో లేదా రక్తం తడిసిన చేతులతో వెళ్ళడం మాత్రం ఖాయం. స్పీకర్ ఫోన్ ఆన్ చేసి మాట్లాడు.’’ కఠినంగా చెప్పాడు.
నేను మా ఆవిడకి ఫోన్ చేశాను. ఆమె ఆన్సర్ చేసింది.
‘‘బేంక్‌లో తాకట్టు పెట్టిన బంగారం రసీదు అవసరమైంది. మన లాకర్ తాళంచెవి ఎక్కడుంది?’’ అడిగాను.
‘‘మర్చిపోయారా? అక్వేరియంలో కత్తి పక్కనే.’’
‘‘హాల్లో అక్వేరియంలో ఉంది.’’ లైన్ కట్ చేసి అతనివైపు తిరిగి చెప్పాను.
‘‘కత్తేమిటి?’’ అడిగాడు.
‘‘ఫిష్ టేంక్‌లోని చేపలకి ఐరన్ అందాలని ఓ కత్తిని ఉంచాం. అది ఎవరూ వెతకని చోటని అందులో లాకర్ తాళంచెవి ఉంచుతామన్న సంగతి మర్చిపోయాను.’’
అతను నా వెంట హాల్లోకి నడిచాడు. అక్వేరియంలో ఆరంజ్, నీలం రంగు చేపలు తిరుగుతున్నాయి. నేను నీళ్ళల్లో చేతిని ఉంచబోతే అరిచాడు.
‘‘ఆగు. కత్తిని తీద్దామనా? నేను తీస్తాను.’’
నన్ను పక్కకి నెట్టి అక్వేరియం నీళ్ళలో తన ఎడమ చేతిని ఉంచాడు.
అరగంట తర్వాత ఆ దొంగని అంబులెన్స్‌లోకి ఎక్కిస్తూంటే చెప్పాను.
‘‘అతనికి స్టింగ్ రే చేప ముల్లు గుచ్చుకుందని డాక్టర్‌కి చెప్పండి.’’
ఆ అక్వేరియంలోని చేపల్లో ఆ చేప ఖరీదైంది. కొరడాలా ఉండే దాని తోకతో కొడితే, దాని చివర ఉన్న విషపు ముల్లు ద్వారా శరీరంలోకి విషం ఎక్కి క్షణాల్లో మనిషికి స్పృహ తప్పుతుంది. మా ఆవిడ నాలా కాదు. ఏం జరుగుతోందో ఇట్టే ఊహించింది. అతనే అందులో చేతిని ఉంచాలని, కత్తిని ఉంచినట్లు అబద్ధం చెప్పింది. చెప్పాగా. ఆవిడ మెదడంత చురుగ్గా నా బుర్ర పని చేయదు.
ఆ లాకర్ తాళంచెవి మంచానికి ఉన్న చిన్న రహస్య అరలో ఉందని నాకు తెలుసని మా ఆవిడకి తెలుసు.
∙మల్లాది వెంకట కృష్ణమూర్తి


