చిట్కాలున్నా... చికిత్సే ముఖ్యం! | Celebrities Promoting Alternative Cancer Treatments | Sakshi
Sakshi News home page

చిట్కాలున్నా... చికిత్సే ముఖ్యం!

Dec 14 2025 4:14 AM | Updated on Dec 14 2025 4:14 AM

Celebrities Promoting Alternative Cancer Treatments

సోషల్‌ మీడియా వచ్చాక ఓ ఉత్పాతమూ వచ్చిపడింది. ‘పాత పేషెంట్‌ కొత్త డాక్టర్‌తో సమాన’మంటూ అప్పట్లో ఓ సామెత లాంటి వాడుక ఉండేది. దాన్ని నిజం చేస్తూ పాత పేషెంట్లూ అంతకుమించి పాపులర్‌ సెలిబ్రిటీలైన సోనాలీ బెంద్రే, మనీషా కోయిరాలా, క్రికెట్‌ దిగ్గజం యువరాజ్‌ సింగ్, హాలీవుడ్‌ మోడల్‌ లీజా రే వంటి జనాల్లో మంచి క్రేజ్‌ ఉన్న వ్యక్తులు... ‘ఆటోఫేజీ’ అనే ఓ సైంటిఫిక్‌ పదాన్ని...  ఇటీవలి పాపులర్‌ చిట్కా మంత్రా పదమైన ‘వెల్‌నెస్‌ చికిత్స’తో కలగలిపి ‘వెల్‌నెస్‌’ అద్భుతాల తాలూకు ప్రభావాలను సోషల్‌ మీడియా ప్రచారం చేస్తున్నారు. ఉపవాసాలూ,

 డీటాక్స్‌ విధానాల్లాంటివే అద్భుత మాయా–మంత్రాలంటూ ప్రజలకు ఇంపుగా ప్రజెంట్‌ చేస్తున్నారు. అసలు అన్నం కంటే పక్కన అంచుకుపెట్టుకుని నంజుకునే చిరుతిండినే నిజభోజనంగా వర్ణిస్తున్నారు. వాళ్ల మాటల మాయల్లో పడుతున్న జనాలు... అసలు వాస్తవాల కంటే అద్భుతాలనే ఎక్కువగా నమ్ముతున్నారు. ఫలితంగా ఈ ‘మిరాకిల్స్‌ థెరపీ’లను ఎక్కువగా నమ్ముతూ ఉండే అదే క్యాన్సర్‌కు అద్భుత చికిత్సేమోనంటూ అమాయక ప్రజలు అసలుకే మోసం తెచ్చుకుంటున్నారు. ఈ విషయంపై క్యాన్సర్‌ నిపుణులైన డాక్టర్ల మాటేమిటో చూద్దాం.

వాళ్లు క్యాన్సర్‌ను జయించిన యోధులే. అద్భుత మనోబలంతో క్యాన్సర్‌ మహమ్మారిని ఎదుర్కొన్న మహామహులే. తాము క్యాన్సర్‌ను అధిగమించాక తాము అనుసరించిన చిట్కాలను వెల్లడిస్తూ వాళ్లు  చెబుతున్న కొన్ని మాటలేమిటో చూద్దాం. 

→ ఇంటర్‌మిట్టెంట్‌ ఫాస్టింగ్‌ (రోజుకు నియమిత వేళల్లోనే తిని... మిగతా సమయమంతా ఉపవాసంలో గడపడం), యాంటీ ఇన్‌ఫ్లమేషన్‌ డైట్‌ తీసుకోవడం, కొద్దిపాటి వ్యాయామంతో తాను క్యాన్సర్‌నుంచి బయటపడ్డానంటోంది ప్రముఖ బాలీవుడ్‌– టాలీవుడ్‌ ఫేమ్‌ సోనాలి బెంద్రే. 

→ క్లీన్‌ ఈటింగ్‌  ప్రాసెస్‌ చేయని, రిఫైన్‌ చేయని, పొట్టుతీయని ముడి ధాన్యాలతో వండిన భోజనం)తో పాటు యోగా, ప్రాణాయామం వంటి వాటితో క్యాన్సర్‌ను జయించానన్నది ప్రముఖ నటి మనీషా కోయిరాలా మాట. 

→ కీమోతో పాటు... క్రమశిక్షణతో కూడిన జీవనమూ భోజనమూ, దేహంలోని విషాలను శుభ్రపరిచే డీ–టాక్స్‌ ఆహార విహారాలూ తననుంచి క్యాన్సర్‌ను దూరం చేశాయంటాడు క్రికెటర్‌ యూవీ (యువరాజ్‌ సింగ్‌). 

→ శాకాహారంతో కూడిన భోజనం, ధ్యానం (మెడిటేషన్‌), యోగా ఆయుర్వేద మార్గాల పయనం వల్లనే తనకు క్యాన్సర్‌ నయమయ్యిందంటోంది ప్రముఖ మోడల్, లీజా రే. 
ఇక్కడ ఈ ప్రముఖులు చెప్పిన చిట్కాలన్నీ ‘ఆటోఫేజీ’ అనే ప్రక్రియను వేగవంతం చేశాయనీ... అందువల్లనే తమకు క్యాన్సర్‌ వేగంగా, ప్రభావపూర్వకంగా నయమైందంటూ చెబుతున్న సోషల్‌ మీడియా వేదికగా చెబుతున్న మాటలు సాధారణ ప్రజల మెదళ్లలోకి తేలిగ్గా ఎక్కుతున్నాయి. వాళ్ల మనసుల్లోకి సులువుగా వెళ్తున్నాయి. 

అయితే జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులైన ఆ వెల్‌నెస్‌ మార్గాలు మంచివే. కానీ అవే క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయలేవని అంటున్నారు. ‘ఆటోఫేజీ’ అనే ఇటీవలి సైంటిఫిక్‌ పరిభాషకు చెందిన ఆ పదం అర్థం ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉందన్నది వైద్యప్రముఖుల మాట. దాంతోపాటు ‘అపాప్టోసిస్‌’, ‘ ప్రోటీయోజోమ్‌’ అనే పదాలకు అర్థాలు వాటి వెనక పరమార్థాలూ తెలుసుకుంటే కేవలం అద్భుతాలనిపించే చికిత్సప్రక్రియలు... (మిరాకిల్‌ రెమిడీలు) మాత్రమే కాకుండా వాస్తవ చికిత్సలకు తోడుగా... ఈ అనుబంధ మార్గాలూ జతగూడినప్పుడే అసలు ఫలితాలు వస్తాయంటున్న డాక్టర్ల మాటల ఆంతర్యాలను తెలుసుకుందాం...

అసలు ‘ఆటోఫేజీ’ అంటే ఏమిటి? 
దేహంలో ఎప్పటికప్పుడు కణాలు పుడుతూ, చనిపోతూ ఉంటాయి. అందులో చనిపోయిన కణాలతో పాటు కొన్ని నిరర్థకమైనవీ, వ్యర్థమైనవీ ఉంటాయి. మన దేహంలోని శుభ్రం చేసే వ్యవస్థ ఇలాంటి మృతకణాలూ, నిరర్థక, వ్యర్థకణాలను తొలగిస్తూ ఉంటుంది. ఇలా ఆరోగ్యకరమైన కణాల మనగడను సుగమం చేస్తూ, ఈ మృత, వ్యర్థ, నిరర్థక కణాలను తినేసే ప్రక్రియనే ‘ఆటోఫేజీ’ అంటారు. ఈ సెలిబ్రిటీల మాటేమిటంటే... పైన చెప్పిన ఉపవాసాలూ,  ప్రాణాయామ ధ్యానాలూ, డీటాక్స్‌ ప్రక్రియల వంటి వెల్‌నెస్‌ మార్గాల ద్వారా మన ఆరోగ్యకరమైన కణాలన్నీ ‘క్యాన్సర్‌ కణాలనే’ తినేస్తే? అప్పుడు క్యాన్సర్‌ హరించుకుపోయి ఆరోగ్యం దక్కుతుందనేలా వారి సోషల్‌ మీడియా సందేశాలు ప్రజలకు చేరుతున్నాయి. 

అంతకంటే సంక్లిష్టమైనది ఆటోఫేజీ...
నిజానికి ‘క్యాన్సర్‌ బయాలజీ’లో ఆటోఫేజీ ప్రక్రియ అంతకంటే చాలా సంక్లిష్టమైనది అంటున్నారు ఆధునిక వైద్యచికిత్సకులు. ఒకసారి అదేమిటో చూద్దాం. 
∙కణంలో మరిన్ని సూక్షమైన అంతర్గతమైన భాగాలు (ఆర్గనెల్స్‌) దెబ్బతిన్నప్పుడు ఆ కణం మనుగడ కష్టం. అది చనిపోయే ప్రక్రియలో దేహం దాన్ని శుభ్రం చేసి తొలగిస్తుంది. అందులోని ప్రోటీన్‌ శిథిలాలను ఒకచోట చేర్చి ఊడ్చేస్తుంది. అలా చనిపోయిన లేదా బలహీనపడి నిరర్థకం కాబోతున్న కణాలను దేహం తొలగించివేస్తుంది. దీన్నే ‘ఆటోఫేజీ’ అంటారు.

అదీ మరచిపోతున్న ముప్పు... ఇదీ చేస్తున్న తప్పు... 
ఇక్కడ సెలిబ్రిటీలు ఒక విషయం మరచిపోతున్నారు. తమకున్న పరిమితమైన వైద్యపరిజ్ఞానంతో అసలు విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఉపవాసాలు చేస్తున్నప్పుడు తన జీవక్రియల కోసం దేహంలోని కణాలు తమకు కావాల్సిన ఆహారం కోసం మృత/వ్యర్థకణాలనూ, క్యాన్సర్‌ కణాలనూ తినేస్తాయని భావిస్తున్నారు. కానీ ఇక్కడ వారు ఒక ముప్పును విస్మరిస్తున్నారు. క్యాన్సర్‌ కణం కూడా ఒక కణమే. దానికీ ఆహారం కావాలి. ఉపవాసం ద్వారా దానికి అవసరమైన ఆహారాలు అందనప్పుడు అది కూడా ఆరోగ్యకరమైన కణాలనూ తినేయడం మొదలుపెట్టేందుకు అవకాశాలు ఎక్కువ. 

అంతేకాదు... మామూలు కణం కంటే కూడా అది మరింత చురుగ్గా, మరింత వేగంగా ఆరోగ్యకరమైన కణాలను కబళించవచ్చు. పైగా ఆహారం అందకపోవడంతో దేహాన్ని రక్షించుకునే వ్యాధి నిరోధక వ్యవస్థ మరింత బలహీనపడితే క్యాన్సర్‌ కణజాలాలే మామూలు ఆరోగ్యవంతమైన కణాలను తినేయడం ప్రారంభిస్తే అది మొదటికే మోసం వచ్చే పరిస్థితి! అంటే ఉపవాసం వల్ల క్యాన్సర్‌ ఎండిపోవడానికి (ఫాస్టింగ్‌ స్టార్వ్స్‌ క్యాన్సర్‌) బదులుగా తామే ఆకలితో మాడాల్సి వస్తుందని తెలిసినప్పుడు క్యాన్సర్‌ కణాలు ఇంకా ఇంకా కుతంత్రాలతో (కన్నింగ్‌గా) ఆరోగ్యవంతమైన కణాలను తినేయడం మొదలుపెట్టే ప్రమాదలెన్నో పొంచి ఉంటాయి.

ఆటోఫేజీ లాంటిదే ఆటాప్టోసిస్‌...  
సెలిబ్రిటీలు ఆటోఫేజీ గురించి సోషల్‌ మీడియాలో మాట్లాడటం వల్ల దాని గురించి మామూలు ప్రజలకు తెలియరావచ్చు. కానీ... ఈ రంగంలో ఇలా ఆటోఫేజీలా పనిచేస్తూ క్యాన్సర్‌ కణాలను తినేసేందుకు దోహదపడే పరిశోధనలూ, అలాంటి పరిజ్ఞానాలూ, పరిభాషా... ఇలాంటివి వాళ్లకు తెలియని అంశాలెన్నో ఇంకా ఉన్నాయి. ఉదాహరణకు అటాప్టోసిస్, యూబిక్విటిన్‌– ప్రోటియోజోమ్‌ సిస్టమ్‌ వంటివి. ఉదాహరణకు అటాప్టోసిస్‌ అంటే ఏమిటో చూద్దాం. ఎవరినైనా బాగా కించపరిచి, కోలుకోలేనంతగా నిందిస్తే వాళ్లేం చేస్తారు? తట్టుకోలేక ఆత్మహత్యకూ ఒడిగట్టవచ్చు కదా! అచ్చం అపాప్టోసిస్‌ ప్రక్రియలో కూడా అలాంటిదే జరుగుతుంది.

యుబిక్విటిన్‌ – ప్రోటియోజోమ్‌ సిస్టమ్‌ అంటే... 
యుబిక్విటిన్‌ అనేది ఏ ప్రోటీన్‌కు అంటుకుంటుందో దాన్ని కాలపరిమితి ముగిసిపోయిన లేదా చెడిపోయిన / లోపభూయిష్టమైన ప్రోటీన్‌గా గుర్తించవచ్చు. అది కణంలో ఉన్నప్పుడు కణం సమతౌల్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే యుబిక్విటిన్‌ ప్రోటీన్‌ కణం నుంచి తొలగిపోవాలి. అప్పుడే కణం చురుగ్గా నార్మల్‌ కణంగా ఉంటుంది. అలా కణం నుంచి యుబిక్విటిన్‌ను తొలగించడానికి తోడ్పడేందుకు ఉద్దేశించిన వ్యవస్థ... అంటే యుబిక్విటిన్‌ ప్రోటీన్‌ను ధ్వంసం చేసేందుకు తోడ్పడే వ్యవస్థే ప్రోటియోజోమ్‌ వ్యవస్థ. అంటే ప్రోటియోజోమ్‌ అన్నది ప్రోటీన్‌ డిస్ట్రక్షన్‌ సిస్టమ్‌ అన్నమాట. ఈ యుబిక్విటిన్‌ అనేది అలాగే ఉంటే అది చెడిపోయిన కణానికి అమరత్వం ఇస్తుంది. ఒకవేళ ఆ చెడిపోయిన కణాలకు అమరత్వం ఉంటే అవి తొలగిపోవు. కాబట్టి ఈ ప్రోటియోజోమ్‌... తన డబుల్‌ నెగెటివ్‌ మార్గంలో వాటిని గుర్తించి ధ్వంసం చేస్తుంది. అలా చెడుకణాలూ లేదా దెబ్బతిన్న/లోపభూయిష్టమైన కణాలను తొలగిస్తుంది. ఇతి జరిగేందుకు దోహదపడేదే ‘యుబిక్విటిన్‌ – ప్రోటియోజోమ్‌ వ్యవస్థ’గా చెబుతారు.

కొన్ని మందులతో ప్రోటీయోజోమ్‌ ప్రక్రియను అడ్డుకుని క్యాన్సర్‌ను తగ్గించడం ఇలా... 
ఈ యుబిక్విటిన్‌– ప్రోటియోజోమ్‌ ప్రక్రియను గుర్తించిన వైద్య శాస్త్రవేత్తలు ‘బార్టెజోమిబ్‌’ అలాగే ‘కార్ఫిల్జోమిబ్‌’ వంటి ప్రోటియోజోమ్‌ ఇన్హిబిటర్లను తయారు చేసి ప్రయోగించారు. ఈ మందులతో ‘మైలోమా’ అనే క్యాన్సర్‌ నయం కావడం మొదలైంది. ఇలాంటి మందులను ( ప్రోటియోజోమ్‌ ఇన్హిబిటర్స్‌ను) మరిన్ని కనుగొనడం ద్వారా అనేక రకాల క్యాన్సర్లను తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా చూసినప్పుడు ఆటోఫేజీ, అపాప్టోసిస్, ప్రోటీయోజోమ్‌ అనేవి చాలా సంక్లిష్టమైన ప్రక్రియలు. 

అవి కొనసాగే మార్గాలను (పాత్‌ వేస్‌) అనేక మందుల సహాయంతో నిర్వహితమయ్యేలా చేయడం వల్ల క్యాన్సర్‌ కణం తనంతట తాను మటుమాయమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికి ఇది ‘మైలోమా’లోనే సఫలీకృతమైంది. కానీ ఇంకా కొన్ని క్యాన్సర్ల (సాలిడ్‌ ట్యూమర్స్‌) విషయంలోనూ, మరిన్ని క్యాన్సర్లలోనూ విజయవంతం కావాల్సి ఉంది. ఇందుకోసం రకరకాల కాంబినేషన్లలో అపాప్టోసిస్‌ మాడ్యులేటర్లు, ఇమ్యూనో, టార్గెట్‌ థెరపీ ప్రక్రియలూ, ప్రోటియోజోమ్‌ ఇన్హిబిటర్లు రూపొందించడంలో వైద్యశాస్త్రజ్ఞులు నిమగ్నమై ఉన్నారు.

ఆ అపోహలన్నీ అలా ఆవిర్భవించినవే... 
ఎన్నో ఏళ్లుగా అటాప్టోసిస్‌ ప్రక్రియను క్యాన్సర్‌ను జయించేందుకు ఒక ప్రత్యామ్నాయ ‘నేచర్‌ క్యూర్‌’ ప్రక్రియగా జనం అపోహపడుతున్నారు. కొన్ని ఆహారాల ద్వారా క్యాన్సర్‌ లాంటి లోపభూయిష్టమైన కణాలు తమంతట తామే తమ మరణశాసనం రాసుకునేలా చేయడం (యాక్టివేటెడ్‌ / ప్రోగ్రామ్‌డ్‌ సెల్‌ డెత్‌)గా చాలామంది పొరబడుతుంటారు. కానీ అది పొరబాటు. క్యాన్సర్‌ కణాలు ఎంత జిత్తులమారివి అంటే... అవి ‘అటాప్టోసిస్‌’నూ తప్పించుకోగలవు. అదెలాగంటే... సెల్‌ను అపాప్టోసిస్‌కు గురిచేసే ప్రక్రియలో క్యాన్సర్‌ కణంలోని పవర్‌హౌజ్‌ అయిన మైటోకాండ్రియాను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది. అదే సమయంలో ‘బీసీఎల్‌–2’ అనే కుటంబానికి చెందిన మరో ప్రోటీన్‌ విడుదలై అది యాంటీ అపాప్టోటిక్‌ ప్రక్రియ ద్వారా క్యాన్సర్‌ కణంలోని మైటోకాండ్రియాలోకి రసాయనాలు వెళ్లకుండా చేయడం ద్వారా తనను తాను రక్షించుకుంటుంది.

చివరగా... 
ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న ప్రభావవంతమైన క్యాన్సర్‌ చికిత్సలు రేడియోథెపీ, కీమోథెరపీ, శస్త్రచికిత్సలే. వీటి తర్వాతే ఉపవాసాలూ, యోగా, ధ్యానం, డీ–టాక్స్‌ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఆహారాలూ, పోషకాహారాలూ, నేచురోథెరపీలను అనుబంధంగా ఉపయోగించుకోవాలి. ఏ సెలిబ్రిటీలు చెప్పినా అవి ప్రత్యామ్నాయ చిట్కాలే తప్ప ప్రధాన చికిత్సలు కావని అందరూ తెలుసుకోవాలంటున్నారు డాక్టర్లు.


అపాప్టోసిస్‌ అంటే... 
క్యాన్సర్‌ అంటేనే అది చెడిపోయిన / నార్మల్‌గా ఉండని కణం అన్న విషయం తెలిసిందే. ఏవైనా రసాయనాల ద్వారా ఓ చెడిపోయి దెబ్బతిన్న కణాన్ని మరింతగా అవమానించేలా చేస్తే అది బాగా కుంగి కుచించుకుపోయి నశించిపోయే పరిస్థితే ‘అపాప్టోసిస్‌’ అని చెప్పవచ్చు. నిజానికి చాలా సంక్లిష్టమైన జీవరసాయన పద్ధతికి ఇక్కడ చెప్పినది మామూలు ప్రజానీకానికి అర్థమయ్యేలా చెప్పేందుకు ఇదో సింపుల్‌ వివరణ అనుకోవచ్చు. అంటే కొన్ని రసాయనాలను ఉపయోగించి ఓ కణాన్ని అవమానించడం ద్వారా దాని మరణాన్ని అదే తెచ్చుకునే ‘ ప్రోగ్రామ్‌డ్‌ సెల్‌ డెత్‌’ కార్యక్రమం ఈ అపాప్టోసిస్‌.

నిర్వహణ: యాసీన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement