తెలంగాణ ప్రభుత్వానికి 'టాలీవుడ్' కన్ఫ్యూజన్.. పరిష్కారమే లేదా? | Telangana Govt Confusion About Tollywood Ticket Hikes | Sakshi
Sakshi News home page

Tollywood: ఇండస్ట్రీ-ప్రభుత్వం-హైకోర్ట్.. ఎందుకింత గందరగోళం?

Dec 13 2025 9:16 PM | Updated on Dec 13 2025 9:16 PM

Telangana Govt Confusion About Tollywood Ticket Hikes

టికెట్ రేట్ల పెంపు అనేది తెలంగాణలో పెద్ద జోక్ అయిపోయింది. ఎందుకంటే ఒకటి రెండుసార్లు జరిగితే ఏదో పొరపాటు అనుకోవచ్చు. కానీ పదేపదే జరగడం చూస్తుంటే తెలంగాణ ప్రభుత్వానికి టాలీవుడ్ విషయంలో ఎందుకింత కన్ఫ్యూజన్ అనే సందేహం వస్తోంది. అసలు ప్రస్తుతం ఏం జరుగుతోంది? దీనికి పరిష్కారం లేదా?

టాలీవుడ్‌లో టికెట్ రేట్ల పెంపు చాన్నాళ్లుగా ఉన్నదే. కానీ గత కొన్నాళ్ల నుంచి మాత్రం దీని గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. రీసెంట్ టైంలో జరుగుతున్న సంఘటనలే దీనికి నిదర్శనం. గతేడాది డిసెంబరులో 'పుష్ప 2' రిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరగడం మీకు తెలిసే ఉంటుంది. ఇది జరిగిన వెంటనే ఇకపై తెలంగాణలో ప్రీమియర్స్‌కి అనుమతి ఇవ్వబోం, టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వబోం అని ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేశారు.

కొన్నాళ్ల పాటు ప్రభుత్వం.. టికెట్ రేట్ల విషయంలో చెప్పిన మాటపై నిలబడింది. తర్వాతే మెల్లమెల్లగా సడలింపులు మొదలయ్యాయి. కొన్నాళ్ల ముందు పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశమిచ్చారు. ఈ విషయమై ఒకరు హైకోర్టుని ఆశ్రయించగా.. ప్రభుత్వంపై మొట్టికాయలు పడ్డాయి. సరే ఇకనైనా పాటిస్తారేమో అనుకుంటే.. తాజాగా 'అఖండ 2' విషయంలో ఏకంగా హైకోర్ట్ ఆదేశాల్నే ధిక్కరించారు.

ప్రీమియర్ల కోసం పెంచిన టికెట్ ధరల్ని పూర్తిగా తగ్గించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే నిర్మాతలు వీటిని పాటించలేదు. ఇదే విషయమై మరో పిటిషన్ వేయగా హైకోర్టు.. చిత్రబృందాన్ని ప్రశ్నించించింది. హైకోర్ట్ ఉత్తర్వులు అంటే లెక్కలేదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే నిర్మాతలు డివిజన్ బెంచ్‌ని ఆశ్రయించగా కాస్త ఊరట లభించింది.

'అఖండ 2' టికెట్ రేట్ల పెంపు గురించి తెలంగాణ సినిమాటోగ్రాఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే చిత్రమైన వ్యాఖ్యలు చేశారు. తనకు తెలియకుండా అధికారులు జీవో జారీ చేశారని, ఇకపై దర్శకనిర్మాతలు ఎవరూ తమ దగ్గరకు రావొద్దని అన్నారు. అయితే మంత్రికే తెలియకుండా జీవో జారీ చేసే అవకాశముందా? అనేది ఇక్కడ అర్థం కాని విషయం! ఇలా ప్రతిసారి 'టాలీవుడ్' విషయంలో తెలంగాణ ప్రభుత్వం కన్ఫ్యూజన్ అవుతూనే ఉంది.

సరే 'అఖండ 2' విషయంలో జరిగిందేదో జరిగిపోయిందని అనుకుందాం. రాబోయేది సంక్రాంతి సీజన్. చిరంజీవి, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరి మంత్రి కోమటిరెట్టి వెంకటరెడ్డి చెప్పినట్లు ఈ సినిమాలకు టికెట్ రేట్లు పెంచకుండా ఉంటారేమో చూడాలి? లేదంటే మళ్లీ జీవో జారీ చేసి హైకోర్టుతో చెప్పించుకుంటారా అనేది చూడాలి?

ఏదేమైనా టికెట్ రేట్ల పెంపు విషయమై ఇండస్ట్రీ, ప్రభుత్వం ఒకచోట కూర్చుని ఓ క్లారిటీ తెచ్చుకుంటే మంచిది. లేదంటే ప్రతిసారి ఇలా గందరగోళపడటమే అవుతుంది. టికెట్ రేట్ల పెంపు ఏమో గానీ ప్రేక్షకుడు క్రమక్రమంగా తెలుగు సినిమాకు దూరమవుతూనే ఉన్నాడు. థియేటర్లకు వచ్చి చూసే వాళ్లు రోజురోజుకీ తగ్గిపోతున్నారు. ఎవరు ఔనన్నా కాదన్నా ఇదే నిజం. దర్శకనిర్మాతలు హీరోలకు ఈ విషయం ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement