అడవి నేపథ్యంలో సినిమాలు చేస్తున్న తెలుగు హీరోలు
అడవి నేపథ్యంలో సినిమాలు తీయాలంటే ఆషామాషీ కాదు. ఎన్నో సాహసాలు చేయాలి. ఎన్నో సవాళ్ళను స్వీకరించాలి. అయినా సరే... తగ్గేదేలే అంటూ ఫారెస్ట్ నేపథ్యంలో సినిమాలు చేసేస్తున్నారు మన తెలుగు హీరోలు. ‘ఫారెస్ట్‌పోదాం... షూటింగ్ చేద్దాం... చలో చలో...’ అంటూ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు చేస్తున్నారు. ఈ ఫారెస్ట్ సినిమాల వివరాలు, విశేషాలపై ఓ లుక్ వేయండి.
ఫారెస్ట్‌లో అడ్వెంచర్
కెన్యా అడవుల్లోకి వెళ్లొచ్చారు మహేశ్‌బాబు. ఒడిశా అడవుల్లోనూ సంచారం చేశారు. మహేశ్‌బాబు ఇలా అడవుల్లో తిరుగుతున్నది ‘వారణాసి’ సినిమా కోసమే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ మూవీ ‘వారణాసి’. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రుద్రగా మహేశ్‌బాబు, మందాకినిగా ప్రియాంకా చోప్రా, కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఆల్రెడీ వీరిపాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్‌పోస్టర్స్ విడుదల అయ్యాయి. అయితే ఈ సినిమాలోని మేజర్ సన్నివేశాలు ఫారెస్ట్ నేపథ్యంలోనే సాగుతున్నట్లుగా తెలుస్తోంది.
ఇటీవల ‘వారణాసి’ సినిమా గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేయగా, ఈ గ్లింప్స్‌లోనూ ఫారెస్ట్ విజువల్స్ స్పష్టంగా కనిపించాయి. ఇక తొలుత ఒడిశా ఫారెస్ట్ లొకేషన్స్, ఆ తర్వాత కెన్యా ఫారెస్ట్ లొకేషన్స్‌లో మహేశ్‌బాబు అండ్ రాజమౌళి టీమ్ కొంత చిత్రీకరణ జరిపిన సంగతి తెలిసిందే. సినిమాలోని మరికొన్ని కీలక సన్నివేశాల కోసం ‘వారణాసి’ చిత్ర యూనిట్ వచ్చే ఏడాదిప్రారంభంలో మరోసారి కెన్యా ఫారెస్ట్ లొకేషన్స్‌కు వెళ్లనుందని తెలిసింది. ఇంకా ఈ సినిమాలో మహేశ్‌బాబు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారని సమాచారం.
ఆల్రెడీ రుద్రగా మహేశ్‌బాబు ఫస్ట్ లుక్‌పోస్టర్ విడుదలైంది. రాముడిపాత్రలో మహేశ్‌బాబు కనిపిస్తారని స్వయంగా రాజమౌళియే కన్ఫార్మ్ చేశారు. మరో మూడు గెటప్స్‌లో కూడా మహేశ్‌బాబు కనిపిస్తారని, మొత్తంగా ‘వారణాసి’ సినిమాలో ఆయన ఐదు గెటప్స్‌లో కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంకా ఈ సినిమాలో విభిన్న యుగాల మధ్య టైమ్ ట్రావెల్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుందని భోగట్టా. కేఎల్ నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ ‘వారణాసి’ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.
ఫారెస్ట్‌లో డ్రాగన్
ఫారెస్ట్‌లో అదిరిపోయే చేజింగ్ యాక్షన్ సీక్వెన్స్ చేశారట ఎన్టీఆర్. ఈ చేజ్‌ని ‘ఎన్టీఆర్‌నీల్’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో చూడొచ్చు. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘ఎన్టీఆర్‌నీల్’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని కీలకపాత్రల్లో నటించనున్నారంటూ హీరోయిన్ రష్మికా మందన్నా, బాలీవుడ్ నటి కాజోల్, మలయాళ యువ నటుడు టోవినో థామస్, బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండనున్నట్లుగా తెలిసింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో కర్ణాటకలోని కొన్ని లొకేషన్స్‌లో ‘ఎన్టీఆర్‌నీల్’ సినిమా చిత్రీకరణ జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ షూటింగ్ షెడ్యూల్‌లోనే ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఓ చేజింగ్ సీన్‌ను చిత్రీకరించారట ప్రశాంత్ నీల్. ఈ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకే ఓ హైలైట్‌గా ఉంటుందట. అంతేకాదు... విదేశీ ఫారెస్ట్ లొకేషన్స్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరగనున్నట్లుగా తెలిసింది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నారు.
తాజా షెడ్యూల్ షూటింగ్ కోసం ఎన్టీఆర్ సన్నబడిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ మళ్లీప్రారంభం కానుంది. నందమూరి కల్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.
గుహలో ఫైట్
‘విరూపాక్ష’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెరకెక్కిస్తున్న అడ్వెంచరస్ అండ్ మైథలాజికల్ యాక్షన్ డ్రామా ‘వృషకర్మ’. ఈ చిత్రంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్నారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా కనిపిస్తారు. బాలీవుడ్ నటుడు స్పర్‡్ష శ్రీవాస్తవ ఈ చిత్రంలోని విలన్ రోల్ చేస్తున్నారని తెలిసింది. ఈ మిథికల్ థ్రిల్లర్ సినిమాలో కొన్ని మేజర్ సన్నివేశాలు ఫారెస్ట్ నేపథ్యంలో ఉంటాయని తెలిసింది.
కొన్ని సన్నివేశాలను రియల్ లొకేషన్స్‌లో, మరికొన్ని సన్నివేశాలను అడవిని తలపించేలా వేసిన సెట్స్‌లో చిత్రీకరిస్తున్నారట. ఆల్రెడీ ఓ పెద్ద గుహ సెట్ వేసి, అక్కడ కొన్ని సీన్స్‌ను చిత్రీకరించారు. ఈ గుహ నేపథ్యంలో సాగే సీన్స్ ఈ సినిమాలో మేజర్ హైలైట్‌గా ఉంటాయట. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోందని తెలిసింది. బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ .బి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుందని తెలిసింది.
భోగి
ఈ ఏడాది వేసవిలో ఉత్తర తెలంగాణలో ‘భోగి’ సినిమాను ఆరంభించారు శర్వానంద్. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. అనుపమా పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 1960 నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ మూవీ ప్రధానంగా ఉత్తర తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దుల్లో జరుగుతుందని తెలిసింది. ఈ సినిమా చిత్రీకరణ కోసం మేకర్స్ ఇరవై ఎకరాల్లో ఓ భారీ సెట్‌ను కూడా క్రియేట్ చేశారు. అయితే కథ రీత్యా ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు అడివి నేపథ్యంలో సాగుతాయని తెలిసింది.
అడివి నేపథ్యంలో కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఉంటాయట. ప్రస్తుతం ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా చిత్రీకరణతో శర్వానంద్ బిజీగా ఉన్నారు. జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే శర్వానంద్ హీరోగా నటించి, షూటింగ్ పూర్తి చేసుకున్న ‘బైకర్’ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ‘భోగి’ సినిమా కూడా వచ్చే ఏడాదే రిలీజ్ అయ్యే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తుంది. ఇదే నిజమైతే శర్వానంద్ వచ్చే ఏడాది మూడుసార్లు థియేటర్స్‌లో సందడి చేస్తారు.
కామ్రేడ్ కళ్యాణ్
శ్రీవిష్ణు టైటిల్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘కామ్రేడ్ కల్యాణ్’. టైటిల్‌ని బట్టి ఈ సినిమాకు నక్సలిజమ్ బ్యాక్‌డ్రాప్ ఉంటుందని ఊహించవచ్చు. ఈ సినిమా ప్రధానంగా ఫారెస్ట్ నేపథ్యంలోనే సాగుతుందని, ఇటీవల విడుదలైన ‘కామ్రేడ్ కల్యాణ్’ ఫస్ట్ లుక్‌పోస్టర్, గ్లింప్స్ స్పష్టం చేస్తున్నాయి. 1992లో ఆంధ్ర – ఒడిశా సరిహద్దులోని విశాఖ జిల్లా మాడుగుల గ్రామం నేపథ్యంలో ఈ సినిమా ప్రధాన కథాంశం ఉంటుందని తెలిసింది.
అలాగే ఈ సినిమాలో శ్రీవిష్ణు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఓపాత్రలో నక్సలైట్ లీడర్ కామ్రేడ్ కల్యాణ్‌గా శ్రీ విష్ణు కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ సగానికి పైగా పూర్తయింది. మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.
పురాతన ఆలయం
దట్టమైన అడవిలో ఉన్న ఓ పవిత్రమైన పురాతన దశావతార ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు కొంతమంది దుండగులు సాహసించారు. ఈ దుశ్చర్యను అడ్డుకునేందుకు హీరో బరిలోకి దిగాడు. మరి... ఇందులో ఈ హీరో సక్సెస్ అయ్యాడా? ఈ హీరోకు దైవం నుంచి ఎలాంటి సహాయం లభించింది? అనే విషయాలను వెండితెరపై చూడాలంటే ‘హైందవ’ సినిమా చూడాల్సిందే. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా, సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా ‘హైందవ’. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో మహేశ్ చందు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.
ఫారెస్ట్‌లో ప్రేమ
తన ప్రేమ కోసం 30 మందిని అడవిలో పరిగెత్తించాడు ఓ కుర్రాడు. ప్రేమ కోసం ఎంతటికైనా తెగించే అతని సాహసాలను ‘మోగ్లీ 2025’ సినిమాలో వెండితెరపై చూడొచ్చు. రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘మోగ్లీ 2025’. ఈ చిత్రంలో బండి సరోజ్‌కుమార్ విలన్‌గా నటించగా, ‘వైవా’ హర్ష మరో కీలకపాత్రలో నటించారు. ఈ సినిమా అంతా ఫారెస్ట్ నేపథ్యంలోనే సాగుతుందని ఇటీవల విడుదలైన ట్రైలర్ స్పష్టం చేస్తోంది.
అంతేకాదు... ఈ సినిమాలో బదిర యువతిపాత్రలో సాక్షి మడోల్కర్ ఓ చాలెంజింగ్ రోల్ చేశారు. సందీప్ రాజ్ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 12న విడుదల చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేశారు. కానీ బాలకృష్ణ ‘అఖండ 2’ చిత్రం ఈ తేదీకి థియేటర్స్‌లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో ‘మోగ్లీ– 2025’ సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అడవిలో డిష్యుం... డిష్యుం...
‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్‌తో వీక్షకులను అలరించారు దర్శకుడు తేజ కాకమాను. ఇప్పుడు ఫారెస్ట్ నేపథ్యంలో ఓ సినిమా తీసేందుకు తేజ కాకమాను ఓ కథను రెడీ చేశారని తెలిసింది. ఈ సినిమా కథను సాయిధరమ్ తేజ్‌కు వినిపించగా ఈ హీరో ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఈ సినిమాలోని మేజర్ యాక్షన్ సీక్వెన్స్‌లు అడవి నేపథ్యంలోనే ఉంటాయని తెలిసింది. ప్రస్తుతం ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు సాయిధరమ్ తేజ్. ఈ సినిమా పూర్తయిన తర్వాత తేజ కాకుమాను దర్శకత్వంలోని చిత్రాన్ని సాయిధరమ్ తేజ్ స్టార్ట్ చేస్తారని ఊహించవచ్చు.
నాగబంధం
భారతదేశంలోనిప్రాచీన విష్ణు ఆలయాల నేపథ్యం, శతాబ్దాలుగా రహస్యంగా కొనసాగుతున్న ‘నాగబంధం’ అనే ఆధ్యాత్మిక సంప్రదాయం, అనంత పద్మనాభ స్వామి దేవాలయం – పూరి జగన్నాథ్ దేవాలయాల్లోని మిస్టరీల స్ఫూర్తి... ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో రూపొందుతున్న సినిమా ‘నాగబంధం’. ఈ చిత్రంలో విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఫారెస్ట్ నేపథ్యంలో కూడిన సన్నివేశాలు ఉంటాయని తెలిసింది. ఇందుకోసం ప్రత్యేకమైన సెట్స్‌ను వేశారట మేకర్స్. అంతేకాదు... ఈ సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశం కోసమే మేకర్స్ రూ. 20 కోట్ల భారీ బడ్జెట్‌తో సెట్‌ను వేశారు. ఈ సెట్‌లోనే ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అభిషేక్ నామా దర్శకత్వంలో కిశోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నభా నటేశ్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, జయప్రకాశ్, మురళీ శర్మ, బి.ఎస్. అవినాష్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం రిలీజ్ కానుంది.
పొలిమేర 3
అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలోని ‘పొలిమేర’ హారర్ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే వచ్చిన తొలి భాగం ‘మా ఊరి పొలిమేర, పొలిమేర 2’ చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. దీంతో ‘పొలిమేర 3’ సినిమాకు శ్రీకారం చూట్టారు దర్శకుడు అనిల్ విశ్వనాథ్. ఆల్రెడీ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ‘పొలిమేర 2’ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటాయని తెలిసిందే. ‘పొలిమేర 3’లో అంతకు మించి ఫారెస్ట్ సీన్స్ ఉంటాయని తెలిసింది. పైగా ఈ సినిమాకు పదో శతాబ్దం నేపథ్యం కూడా ఉంటుందని, ఈ చిత్రంలో మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న ‘సత్యం’ రాజేశ్, కామాక్షీ భాస్కర్లతోపాటు మరో హీరో కూడా ఓ కీ రోల్ చేయనున్నారని తెలిసింది. ఆల్రెడీ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ఈ సినిమాలే కాదు... ఫారెస్ట్ నేపథ్యంలో రూపొందుతున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు


