ధనుర్మాసం మొదలవ్వగానే అందరూ నెలగంట కడతారు అని అంటుంటారు. పైగా అప్పటి నుంచి ముంగిళ్ల అన్ని రంగవల్లులతో శోభాయమానంగా ఉంటాయి. అసలేంటి ఈ నెలగంట..అందులోని ఆంతర్యం గురించి సవివరంగా తెలుసుకుందామా..!
నెలగంట కట్టడం అంటే, సంక్రాంతి పండుగకు సరిగ్గా నెల రోజుల ముందు మొదలయ్యే ధనుర్మాసం (Dhanurmasam) ప్రారంభాన్ని సూచించే ఒక సంప్రదాయం. అందులో భాగంగా ఇళ్లలో ముగ్గులు వేసి, గుడిలో గంటలు మోగిస్తూ, పండగ వాతావరణాన్ని సృష్టిస్తారు. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడుఆలయంలో మోగే గంటల శబ్దమే "నెలగంట".
ఇవాళ (డిసెంబర్ 16 వ తేదీన) మధ్యాహ్నం (1. 23)ప్రాంతంలో ధనుస్సులో ప్రవేశిస్తాడు. దానినే మనం ధనుస్సంక్రమణం అంటాం! అలా ధనూరాశిలో ప్రవేశించిన సూర్యుడు - నెలంతా ఆ రాశిలోనే ఉంటాడు. ఇలా సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించగానే నెలగంట కట్టడం అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఆ తరువాత మకర రాశిలో ప్రవేశిస్తాడు. అది మకర సంక్రమణం!.
ఈ నెలగంట కట్టినది మొదలుకొని పెద్ద పండుగ అయ్యేంతవరకు ఊళ్ళో ఎవరూ ఏ శుభకార్యం చేయరు. అంటే ఈ నెలంతా ఈ దీక్షలోనే ఉంటారు. ఈ నెలగంట కట్టడంతో ధనుర్మాసం ప్రారంభం అవుతుంది కాబట్టి..తిరుప్పావై పాశురాలు - వేకువజాము పూజలు నిర్వహిస్తారు. అంతేగాదు అలాగే ఈ నెలలోనే విష్ణుమూర్తిని మధుసూదనుడుగా ఆరాధిస్తారు. 15 రోజులు చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి, ఆ తర్వాత 15 రోజులు దద్ధోజనాన్ని నైవేద్యంగా పెడతారు. అలా భోగి పండుగ నాడు ఈ మార్గళి వ్రతం లేదా తిరుప్పావై పూర్తవుతుంది. ఒకరకంగా ఈ నెలగంట మన సంక్రాంతి పండుగ రాకను సూచిస్తుందని చెప్పొచ్చు.
ఈ సమయంలో ఏం చేస్తారంటే..
పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటివి చేయకూడదు. అలాగే ఈ నెల రోజులు విష్ణువుని మాత్రమే ఆరాధించాలని అంటారు. నెలగంట సమయంలో పంచామృతాలతో విష్ణుమూర్తిని ఆరాధించాలి. అభిషేకానికి శంఖాన్ని ఉపయోగించాలి. విష్ణుకి తులసి దళాలు సమర్పించాలి. పువ్వులతో అష్టోత్తర, సహస్రనామాలతో ఆరాధించాలి. దీప, ధూప, నైవేద్యాలను సమర్పించాలి. విష్ణువు కథలను వినడం, తిరుప్పావై పఠించడం చాలా మంచిది. నెలరోజులు చేయడం వీలు కాని వారు కనీసం 15 రోజులు, 8 రోజులు లేదా ఒక్క రోజైనా ఆచరించవచ్చు.
(చదవండి: ఈశ్వరీ..జగదీశ్వరీ..)


