సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. తిరిగి సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే సంక్రాంతితో ఈ ధనుర్మాసం ముగుస్తుంది. ధనుర్మాసంప్రారంభాన్నే గ్రామీణ ప్రాంతాల్లో పండుగ నెల పెట్టడం అంటారు. భక్తవత్సలుడైన శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికమైన ఈ ధనుర్మాసం (Dhanurmasam) 16, మంగళవారం ప్రారంభమైన సందర్భంగా ఆ మాస విశిష్టతలను తెలుసుకుందాం...
ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం ఇంటిని శుభ్రం చేసి రెండు పూటలా దీపారాధన చేయడం వల్ల శ్రీమహాలక్ష్మి కరుణా, కటాక్షాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే సంక్రాంతి పండుగ రోజు ఉత్తరాయణం పెట్టే వరకు విష్ణు ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది.
ఆధ్యాత్మిక ప్రయోజనాలకు ఆవాసం
ధనుర్మాసం విశేషమైన ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన మాసం. ధనుర్మాసంలో స్నానం, దానం, హోమం, వ్రతం పూజలు చేయడం అత్యంత శుభప్రదం.
సుప్రభాతానికి బదులు తిరుప్పావై
ధనుర్మాసం విష్ణు పూజకు అత్యంత విశేషమైనదిగా భావిస్తారు. తిరుమలలో అయితే ఈ ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై (tiruppavai) గానం చేస్తారు. అలాగే మిగిలిన విష్ణు ఆలయాల్లో కూడా ఉదయం అర్చనలు చేసి నివేదనలు సమర్పించి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా పిల్లలకు ప్రసాదం పంచడాన్ని బాలభోగం అంటారు. అలాగే ధనుర్మాసం అనేది దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం లాంటిదని పండితులు చెబుతారు.
అలక్ష్మిని ఆవలకు నెట్టే లక్ష్మీ పూజ
పవిత్రమైన ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో దరిద్రాలన్నీ దూరమవుతాయని విశ్వాసం. ముఖ్యంగా గురు, శుక్రవారాల్లో శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజిస్తారు. ధనుర్మాసంలో ప్రతి ఇంటి ముందు తెల్లవారుజామునే అందమైన ముగ్గులు వేసి ఆ ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు, గుమ్మడి పూలు ఉంచి.. వాటిని బియ్యపు పిండి, పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించి పూజిస్తారు. మహాలక్ష్మీ రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించడం సకల శుభదాయకం.
చదవండి: నెలగంట కట్టడం అంటే.. ఎంటే తెలుసా?
గోదా రంగనాథుల కల్యాణం
గోదా కళ్యాణం అనేది వైష్ణవ దేవాలయాల్లో ధనుర్మాసం సమయంలో నిర్వహించే అతి ముఖ్యమైన ఆచారం. సాధారణంగా శ్రీ గోదాదేవి శ్రీ రంగనాథ స్వామి వారి వివాహం ధనుర్మాసం చివరి రోజున అంటే భోగి నాడు జరుగుతుంది. ధనుర్మాస వ్రతాన్ని ఆచరించే వారు గోదాదేవి, శ్రీ కృష్ణుడు లేదా శ్రీరంగనాథ స్వామి వారిని పూజించాలి. తిరుప్పావై పాశురాలను రోజుకు ఒక్కటి గానం చేయాలి. స్వామివారికి, అమ్మవారికి పొంగలి నివేదించాలి. ధనుర్మాసంలో ఒక్కపూట భోజనం, బ్రహ్మచర్యం పాటించడం అత్యంత శ్రేష్ఠం. గోదాదేవి, శ్రీరంగనాథుల కల్యాణం చేయడం పరమ విశిష్టం. మనసు, వాక్కు, శరీరం ఈ త్రికరణాలను అత్యంత పరిశుద్ధంగా ఉంచుకున్న వారికి లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో సకల సంపదలూ చేకూరతాయని శాస్త్ర వచనం.


