అక్టోబర్‌కు వాయిదాపడిన వీసా ఇంటర్వ్యూలు
వాషింగ్టన్: తెంపరి ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో అమెరికాకు వెళ్లాలనుకున్న భారతీయుల హెచ్–1బీ వీసా కష్టాలు మరింత పెరిగాయి. అమెరికా వ్యతిరేక, పాలస్తానా అనుకూల వ్యాఖ్యలు, వీడియోలు, పోస్ట్‌లు చేసే విదేశీయులను తమ గడ్డమీద అడుగుపెట్టకుండా, హెచ్–1బీ, హెచ్4 వీసాలు రాకుండా అడ్డుకునేందుకు ట్రంప్ సర్కార్ గత వారం ఆయా వీసా దరఖాస్తుదారుల సోషల్‌మీడియా ఖాతాల ముమ్మర పరిశీలన మొదలెట్టడం తెల్సిందే.
అన్ని ఖాతాల పరిశీలనకు సుదీర్ఘకాలం పట్టేనున్న నేపథ్యంలో అప్పటిదాకా హెచ్–1బీ వీసాల ఇంటర్వ్యూలను 2026 అక్టోబర్‌దాకా వాయిదావేస్తున్నట్లు చాలా మంది అభ్యర్థులకు సందేశాలు అందాయి. ఇప్పటికే అమెరికాలో ఉద్యోగం సంపాదించి వీసా కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిపుణులైన భారతీయులకు ఈ నిర్ణయం అశనిపాతమైంది.
అక్టోబర్‌కైనా తమ వీసా ఇంటర్వ్యూలకు మోక్షం లభిస్తుందో లేదంటే 2027 జనవరికి మరోసారి వాయిదాపడతాయా? అనే సందిగ్దావస్థ భయాందోళనలు భారతీయులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఈ ఏడాది జరగాల్సిన ఇంటర్వ్యూలను గతంలోనే 2026 ఫిబ్రవరి, మార్చికి రీషెడ్యూల్ చేయడం తెల్సిందే. జనవరి, ఫిబ్రవరిలో ఇంటర్వ్యూలు ఖరారైన వేరే దరఖాస్తుదారులు వాటిని రద్దుచేసుకుంటే వాళ్ల స్థానంలో తమకు అవకాశం లభిస్తుందేమోనన్న ఆశ ఈ అక్టోబర్‌కు రీషెడ్యూల్ అయిన దరఖాస్తు దారుల్లో కన్పిస్తోంది.


