చిక్కుల్లో ఆసిమ్ మునీర్.. పాక్-అమెరికా స్నేహానికి చెల్లు | Special Story On America And Pakistan Friendship | Sakshi
Sakshi News home page

చిక్కుల్లో ఆసిమ్ మునీర్.. పాక్-అమెరికా స్నేహానికి చెల్లు

Dec 18 2025 8:35 PM | Updated on Dec 18 2025 8:41 PM

Special Story On America And Pakistan Friendship

అమెరికా-పాకిస్థాన్..! ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ ఈ రెండు దేశాల మైత్రి పైనే..! ముందెన్నడూ లేనివిధంగా అమెరికా అధ్యక్షుడు పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడిని వైట్‌హౌస్‌కు ఆహ్వానించడం మొదలు.. పాకిస్థాన్‌పై అమెరికా వరాల జల్లులు కురిపించడం వరకు అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇప్పుడు ఇదే చర్చనీయాంశం..! ఇప్పటికే రెండు సార్లు అమెరికాకు వెళ్లి.. ట్రంప్‌తో భేటీ అయిన పాకిస్థాన్ సర్వ సైన్యాధ్యక్షుడు, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వైట్‌హౌస్‌కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

అయితే.. అమెరికా-పాక్ బంధం త్వరలో విడిపోనుందా? ఇరుదేశాల మధ్య తల్లాక్ తప్పదా? అంటే.. అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు అవుననే సమాధానం చెబుతున్నారు. అందుకు గాజానే కారణమంటున్నారు. పాకిస్థాన్‌కు గాజాకు సంబంధమేంటి? అమెరికాతో తల్లాక్ వరకు వెళ్లేంతలా అందులో ఏముంది?

నోబెల్ శాంతి బహుమతి కోసం ఉవ్విళ్లూరుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశాల మధ్య యుద్ధాలను ఆపేందుకు తహతహలాడుతున్న విషయం తెలిసిందే..! ఈ క్రమంలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య పోరును ఆపేసి.. గాజాలో శాంతిని నెలకొల్పాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా.. గాజాలో ఇస్లామిక్ దేశాల సైన్యాలతో అక్కడ శాంతి దళాలను నెలకొల్పాలని భావించారు. దానికి ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ అని నామకరణం చేశారు. సరిగ్గా ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి అణ్వాయుధ దేశమైన పాకిస్థాన్ మద్దతు ట్రంప్‌కి అవసరమైంది. పైగా.. ట్రంప్‌కు నోబెల్ అవార్డు ఇవ్వాల్సిందేనని తొలుత ప్రతిపాదించింది కూడా పాకిస్థానే..! అంతే.. ట్రంప్ కూడా పాకిస్థాన్ సాయంతోనే గాజాలో శాంతిని స్థాపించాలని నిశ్చయించారు.

ట్రంప్‌ 20 సూత్రాల ప్రణాళికే కారణమా?
ాజాలో శాంతిని నెలకొల్పేందుకు ట్రంప్ 20 సూత్రాల ప్రణాళికను సిద్ధం చేశారు. దానికి ఐక్య రాజ్య సమితి నుంచి కూడా ఆమోదం తెచ్చుకున్నారు. అందులో ఆరో పాయింట్ అత్యంత కీలకమైనది. అదేంటంటే.. గాజా నుంచి ఇజ్రాయెల్ తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలి. అందుకు అనుగుణంగానే హమాస్ ఆయుధాలను వీడాలి. ఆ తర్వాత ఇరువైపులా యుద్ధం ముగుస్తుంది. అయితే.. మరోమారు కవ్వింపు చర్యలు లేకుండా ఉండేందుకు గాజాలో ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలి. అయితే.. ఇక్కడే ట్రంప్ ఓ రాజకీయ చతురతను, చాణక్య నీతిని ప్రదర్శించారు. ఆఫ్ఘానిస్థాన్, సిరియాలలో అనుభవాలను బేరీజు వేసుకున్నారు. 

మిలిటెంట్లు, ఉగ్రవాదులు స్టెబిలైజేషన్ ఫోర్స్‌ను టార్గెట్‌గా చేసుకునే ఉదంతాలను విశ్లేషించారు. దీంతో.. నాటో దళాలు లేదా అమెరికా బలగాలను గాజాలో దింపకుండా.. ఆ బాధ్యతను ఇస్లామిక్ దేశాలకు అప్పగించాలని తీర్మానించారు. అంటే.. గాజా శాంతికోసం తీవ్రంగా కృషి చేస్తున్న తుర్కియే, జోర్దాన్, ఈజిప్టుతోపాటు.. గల్ఫ్ దేశాలు, పాకిస్థాన్ ఆ బాధ్యతను తీసుకోవాలనేది ట్రంప్ ఆకాంక్ష..! ఈ దళాలు గాజాతోపాటు.. పాలస్తీనాలోని పోలీసు దళాలకు శిక్షణ ఇవ్వాలి. ఈ మేరకు ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ మధ్య ఒప్పందం జరగాలి. అది జరిగినప్పుడే ఇంతకాలం యుద్ధ నేరాలకు పాల్పడ్డ హమాస్ సభ్యులకు క్షమాభిక్ష ఉంటుంది. గాజాను వీడాలనుకునే హమాస్ సభ్యులు ఈజిప్ట్, జోర్దాన్, ఖతార్, ఇరాన్ వంటి దేశాలకు వలస వెళ్లేందుకు అమెరికా సహకరిస్తుంది. ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్న తర్వాతే.. ఆసిమ్ మునీర్‌ను వైట్‌హౌస్‌కు ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

చిక్కుల్లో ఆసిమ్ మునీర్..!
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయమే ఇప్పుడు పాకిస్థాన్ సర్వ సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ పాలిట అశనిపాతంగా మారుతుందని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు చెబుతున్నారు. ఇస్లామిక్ దేశాలు ఇజ్రాయెల్‌ని బద్ధశత్రువుగా భావిస్తాయి. ఇప్పుడు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల పథకం ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ఉంటుంది. పైగా.. ట్రంప్ ఇజ్రాయెల్‌కు ఆప్తమిత్రుడనేది జగమెరిగిన సత్యం. ఇప్పటికే ఈ 20 సూత్రాల పథకంపై ఈజిప్ట్, ఖతార్‌లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

పాకిస్థాన్‌లో కూడా ఆసిమ్ మునీర్‌పై వ్యతిరేకతకు అంకురార్పణ జరగడానికి ఇదే కారణమవుతుందని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్‌తో త్వరలో జరగనున్న భేటీలో మునీర్ బేషరతుగా తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. ‘కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం’ అన్నట్లుగా మునీర్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా మారనుంది. ఒకవేళ ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్‌లో పాకిస్థాన్ సైన్యం ఉండదని మునీర్ చెబితే.. ట్రంప్‌కు నిస్సందేహంగా కోపం వస్తుంది. ఒకవేళ ట్రంప్ నిర్ణయానికి మునీర్ తలూపినా.. పాకిస్థాన్‌లో వ్యతిరేకత మొదలవుతుంది. ఇప్పటికే పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ ధార్ దీనిపై ఓ ప్రకటన చేశారు. గాజాలో శాంతిని నెలకొల్పడానికి పాకిస్థాన్ బలగాలను అక్కడ మోహరించినా.. హమాస్‌ను ఆయుధాలు వీడమని చెప్పడం, నిరాయుధీకరణకు సహకరించడం తమ బాధ్యత కాదని తేల్చిచెప్పారు..!

ట్రంప్ నిర్ణయానికి తలొగ్గితే.. 
జెన్-జీ ఉద్యమాలు ఇప్పుడు ప్రభుత్వాల పాలిట ముప్పుగా మారుతున్నాయి. బంగ్లాదేశ్, నేపాల్‌లో అధికార మార్పిడి ఇందుకు ఉదాహరణ..! బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వాన్ని కూల్చి, యూనస్ నేతృత్వంలో ఆపద్ధర్మ ప్రభుత్వ ఏర్పాటుకు దోహదపడింది విద్యార్థి ఉద్యమమే. నేపాల్‌లో కూడా యువత ఉద్యమించడంతో ప్రభుత్వం కూలిపోయింది. ఇప్పుడు మునీర్ గనక ట్రంప్ నిర్ణయానికి తలొగ్గితే.. పాకిస్థాన్‌లోనూ నిరసనలు మొదలవుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మునీర్ ఇటీవలి కాలంలో ఇండోనేషియా, మలేషియా, సౌదీ అరేబియా, తుర్కియే, జోర్దాన్, ఈజిప్ట్, ఖతార్ దేశాల రాజకీయ, సైన్య అధికారులతో సమావేశమయ్యారు. ఆ సమావేశాల సందర్భంగా గాజా శాంతి గురించి మాట్లాడారు. దీనికి ప్రతిగా ఇప్పటికే పాకిస్థాన్‌లో ఆగ్రహావేశాలు మొదలయ్యాయి. ఒకవేళ ట్రంప్ నిర్ణయాన్ని మునీర్ అమలు చేస్తే.. పాక్‌లో ఆందోళనలు పేట్రేగిపోతాయని దక్షిణ-మద్య ఆసియా వ్యవహారాల నిపుణుడు మైఖేల్ కుగెల్మాన్ స్పష్టం చేశారు. ఒకవేళ ట్రంప్ ప్రతిపాదనను మునీర్ సున్నితంగా తిరస్కరించినా.. అమెరికా అధ్యక్షుడి ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో.. మునీర్ రిస్క్‌లో పడక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 గాజాలో సైన్యాన్ని మోహరించాలని చూస్తే..!
పాకిస్థాన్‌లో పాలస్తీనాకు మద్దతిచ్చే పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు కోకొల్లలుగా ఉన్నాయి. గాజాలో సైన్యాన్ని మోహరించాలని మునీర్ నిర్ణయిస్తే.. పాకిస్థాన్‌లో అస్థిరత పెరిగే ముప్పు ఉంది. పాకిస్థాన్‌లో కరడుగట్టిన ఇస్లామిక్ ఎన్జీవోలు, సంస్థలు ఎన్నో ఉన్నాయి. పైగా.. ఉగ్రవాద సంస్థలన్నీ హార్డ్‌కోర్ ఇస్లామిక్ మైండ్ సెట్ ఉన్నవే..! ఈ సంస్థలు మూకుమ్మడిగా జెన్-జీ స్థాయిలో ఉద్యమించే అవకాశాలు లేకపోలేదు. 

దీన్ని గమనించే పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ ధార్ ఓ ప్రకటన చేస్తూ.. హమాస్ నిరాయుధీకరణ తమ బాధ్యత కాదని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో పీకల్లోతు చిక్కుల్లో కూరుకుపోయిన మునీర్.. ట్రంప్‌ను విభేదిస్తే.. పెద్దన్న ఆగ్రహానికి గురవ్వక తప్పదు. ట్రంప్ నిర్ణయాన్ని ఆమోదిస్తే.. దేశంలో అస్థిరత ఏర్పడి మునీర్ పదవికే గండం తప్పదు. ఏది ఏమైనా.. త్వరలో అమెరికా-పాక్ మధ్య తల్లాక్ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
- హెచ్.కమలాపతిరావు

ఇదీ చదవండి:
చైనా-పాకిస్థాన్‌కు మధ్య చెడింది ఇక్కడే..!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement