వలసవిధానం మొదలు టారిఫ్‌లతో రెవెన్యూపెంపు దాకా ఘనతలెన్నో సాధించానన్న ట్రంప్
2025 ముగింపు సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగం
న్యూయార్క్/వాషింగ్టన్: జో బైడెన్ ప్రభుత్వం వారసత్వంగా తనకు ఇచ్చిన సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించి దేశాన్ని అభివృద్ధిపథంలో ఉరకలెత్తిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. 2025 ఏడాది మరో రెండు వారాల్లో ముగుస్తున్న నేపథ్యంలో తన 11 నెలల పాలనపై ట్రంప్ 19 నిమిషాలపాటు గురువారం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తన విజయాల పరంపర ఇదేనంటూ పలు అంశాలను ప్రస్తావించారు.
‘‘ బైడెన్ తన పాలనలో ప్రపంచంలోనే అమెరికా సరిహద్దును అత్యంత దుర్భలంగా మార్చారు. నేను దుర్భేద్యంగా పటిష్టపరిచా. ఇలాంటి ఎన్నో సమస్యలతో అధ్వానస్థితిలో అమెరికా పరిపాలనా పగ్గాలను ఆయన నాకు వారసత్వంగా ఇచ్చారు. ఆ సమస్య లను నేను సమర్థవంతంగా సరిదిద్దు తున్నా. అమెరికాకు పూర్వవైభవం తీసుకొచ్చా. 10 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 8 ప్రధానమైన యుద్ధాలను నిలువరించా.
ఇరాన్ నుంచి పొంచి ఉన్న అణుఉపద్రవాన్ని అడ్డుకున్నా. 3,000 సంవత్సరాల్లో సాధ్యంకాని పశ్చిమా సియాలో శాంతిని స్థాపించా. హమాస్–ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపేసి గాజాలో శాంతి కపోతాలను ఎగరేశా. భారత్–పాకిస్తాన్, థాయిలాండ్–కాంబోడియా, అర్మేనియా–అజర్‌బైజాన్, కొసొవో, సెర్బియా, ఇజ్రాయెల్, ఇరాన్, ఈజిప్ట్, ఇథియో పియా, రువాండా, కాంగోల మధ్య సమరాలు సమసిపో యేలా చేశా. బైడెన్ హయాంలోనే అమెరికాలోకి లక్షలాదిగా అక్రమ చొరబాట్లు ఎక్కువయ్యాయి. వీళ్ల కోసం బైడెన్ సర్కార్ అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్మును అనవసరంగా ఖర్చుచేసింది’’ అని ట్రంప్ ఆరోపించారు.
వీళ్ల కారణంగానే ఇళ్ల అద్దెలు పెరిగాయి
‘‘విదేశీ వలసదారులు పోటెత్తడంతోనే ఇళ్ల అద్దెలు పెరిగాయి. రెంటల్ మార్కెట్ 60 శాతం పెరగడానికి బైడెన్ ప్రభుత్వ తప్పుడు విధానాలే కారణం. టారిఫ్ అనే పదం నాకెంతో ఇష్టం. టారిఫ్‌ల బెత్తం చూపించి అమెరికాలోకి మళ్లీ కర్మాగారాలు క్యూ కట్టేలా చేశా. అమెరికాకు 18 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు రప్పించా. దీంతో ఉద్యోగాలు, జీతభత్యాల పెంపు, ఆర్థికాభివృద్ధి, కొత్త ఫ్యాక్టరీల ఆరంభాలు, పటిష్టమైన జాతీయ భద్రతను సాకారంచేశా. ఉత్పత్తకేంద్రాలను అమెరికాలో నెలకొల్పితే టారిఫ్‌లు ఉండబోవని కంపెనీలకు ఇప్పుడు అర్థమైంది. డ్రగ్స్ భూతాన్ని దూరంగా తరమికొట్టా. అందుకే భూ, సముద్రమార్గాల ద్వారా అమెరికాలోకి విదేశీ మత్తుపదార్థాల రాక 94 శాతం తగ్గింది. గత అర్థశతాబ్దకాలంలో తొలిసారిగా దేశం నుంచి అక్రమవలసదారులు తిరిగి వెళ్లిపోతున్నారు. వాళ్లు వదిలేసిన ఇళ్లు, ఉద్యోగాలు అమెరికన్లకు దక్కుతున్నాయి ’’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు.


