వీధి కుక్కల బెడద కేసులో పిటిషనర్‌తో సుప్రీం వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) వీధి కుక్కలపట్ల అమానవీయంగా వ్యవహరిస్తోందంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ‘తదుపరి విచారణ సమయంలో ఒక వీడియో చూపిస్తాము, అమానవీయం ఏమిటో అప్పుడే మీరు చెబుదురుగాని అంటూ వ్యాఖ్యానించింది. దేశ రాజధాని ఢిల్లీలో కుక్క కాట్లతో చిన్నారులు రేబిస్ బారినపడుతున్నారంటూ వచి్చన కథనంపై సుమోటోగా విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం..నవంబర్ 7వ తేదీన విద్యాసంస్థలు, ఆస్పత్రులు, రైల్వే స్టేషన్లలో వీధికుక్కలు, ఇతర జంతువులు కనిపించరాదని, వీధికుక్కలను పట్టుకుని స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ చేయించాలని దేశవ్యాప్త ఆదేశాలివ్వడం తెల్సిందే.
అయితే, ఢిల్లీలోని అధికారులు అదనంగా మరికొన్ని నిబంధనలను చేర్చి, వీధి కుక్కలపై దయాదాక్షిణ్యం లేకుండా ప్రవర్తిస్తున్నారంటూ సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ గురువారం వాదించారు. అయితే, దీనిపై ఇప్పుడేమీ తాము విచారణ చేపట్టబోమని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం స్పష్టం చేసింది. జనవరి 7వ తేదీన జరిగే విచారణ సందర్భంగా తామొక వీడియో చూపిస్తామని, దాన్ని చూశాక మానవత్వం గురించి మాట్లాడుతామంటూ వ్యాఖ్యానించింది. కుక్కల పట్ల అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న వైఖరిపై తామూ ఒక వీడియో చూపుతామని కపిల్ సిబాల్ తెలిపారు.


