ఆగ్రా: ప్రపంచ వింతలలో ఒకటైన తాజ్ మహల్ అందాలను కనులారా వీక్షించాలని ఆశతో వచ్చిన వేలాది మంది పర్యాటకులకు తీవ్ర నిరాశ ఎదురవుతోంది. ఉత్తర భారతదేశాన్ని వణికిస్తున్న తీవ్రమైన చలిగాలులు, దట్టమైన పొగమంచు కారణంగా ఈ చారిత్రక కట్టడం పూర్తిగా అదృశ్యమైంది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం నిర్మించిన ఈ అపురూప స్మారక చిహ్నం, ప్రకృతి పరిచిన తెల్లని మంచు పొరల వెనుక దాక్కుంది.
ప్రతిరోజూ దేశ విదేశాల నుండి వేలాదిమంది పర్యాటకులు తాజ్ మహల్ సౌందర్యాన్ని చూడటానికి ఆగ్రాలోని ‘తాజ్ వ్యూ పాయింట్’ వద్దకు చేరుకుంటారు. అయితే, ప్రస్తుతం అక్కడ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. పొగమంచు తీవ్రత ఎంతలా ఉందంటే.. పర్యాటకులకు తాజ్ మహల్ కనిపించాల్సిన చోట కేవలం తెల్లని గోడ కనిపిస్తోంది. కనీసం ఆ స్మారక చిహ్నం యొక్క ఆకృతి కూడా కనిపించని రీతిలో దృశ్యమానత (Visibility) పడిపోవడంతో పర్యాటకులు నిరాశకు గురవుతున్నారు.
#WATCH | Agra, Uttar Pradesh: The Taj Mahal disappears as the dense fog covers the city.
(Visuals from Taj View Point) pic.twitter.com/TLRf6ObQyc— ANI (@ANI) December 18, 2025
ఈ పరిణామం సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య ఆసక్తికర చర్చకు దారితీసింది. తాజ్ మహల్ అదృశ్యం కావడంపై నెటిజన్లు రకరకాల మీమ్స్‌తో స్పందిస్తున్నారు. ప్రకృతి స్వయంగా తాజ్ మహల్‌పై "VFX" (విజువల్ ఎఫెక్ట్స్) ప్రయోగించిందని కొందరు చమత్కరిస్తుంటే, మరికొందరు దీనిని "ప్రకృతి మాయాజాలం" అని అభివర్ణిస్తున్నారు. ఉత్తర భారత శీతాకాలం ప్రపంచ అద్భుతాన్నే మాయం చేసిందని నెటిజన్లు చేస్తున్న కామెంట్లు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. మరోవైపు ప్రతికూల వాతావరణం పర్యాటక రంగంపై ప్రభావం చూపుతోంది. ఎంతో దూరం నుండి వ్యయప్రయాసలకోర్చి వచ్చిన సందర్శకులు, కేవలం తెల్లటి పొగమంచును మాత్రమే చూసి వెనుతిరగాల్సి వస్తోంది.
ఇది కూడా చదవండి: చలి చంపేస్తోంది.. గజగజ వణుకుతున్న రాష్ట్రాలివే..


