న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశాన్ని గడ్డకట్టించే చలి చుట్టుముట్టింది. హిమాలయాల నుంచి వీస్తున్న అతి శీతల గాలులతో ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్ వరకు జనజీవనం అస్తవ్యస్తమైంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా ప్రకారం, రానున్న 48 గంటల్లో ఈ చలి తీవ్రత మరింత పెరగనుంది. ముఖ్యంగా కశ్మీర్ లోయలో కనిష్ట ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోగా, హిమాచల్, ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతాల్లో కురుస్తున్న హిమపాతం మైదాన ప్రాంతాలను వణికిస్తోంది. పంజాబ్, హర్యానాలో తేమతో కూడిన చల్లని గాలుల వల్ల విజిబిలిటీ ‘సున్నా’కి పడిపోవడంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయంతో వణకుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాన్ని అటు చలి, ఇటు కాలుష్యం రెండు వైపుల నుండి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గురువారం ఉదయం నుంచే నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో విమాన, రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందే విమానయాన సంస్థల స్థితిగతులను తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచించారు. మరోవైపు, గాలి నాణ్యత (ఏక్యూఐ) క్షీణించడంతో నేటి (గురువారం)నుంచి కఠినమైన వాయు కాలుష్య నిరోధక నిబంధనలు అమలులోకి వచ్చాయి. బీఎస్-4 వాహనాలపై ఆంక్షలు విధిస్తూనే, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి కీలక నిర్ణయాలను ప్రభుత్వం అమలు చేస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితి మరీ ఆందోళనకరంగా ఉంది. వారణాసి, కాన్పూర్, లక్నో తదితర నగరాల్లో విజిబిలిటీ 50 మీటర్ల కంటే తక్కువగా ఉండటంతో ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్, చంబల్ డివిజన్లలో ఉష్ణోగ్రతలు 7 డిగ్రీలకు పడిపోయి ప్రజలను విపరీతంగా వణికిస్తున్నాయి. డిసెంబర్ 18 నుండి వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ యాక్టివేట్ కానుండటంతో అమృత్‌సర్, పఠాన్‌కోట్ తదితర ప్రాంతాల్లో తేలికపాటి చినుకులు పడే అవకాశం ఉంది. ఇది చలి తీవ్రతను మరింత పెంచి, సామాన్య ప్రజల కష్టాలను రెట్టింపు చేయనుంది.
పర్వత ప్రాంతాలైన కులు, లాహౌల్-స్పితి, చమోలిలో భారీగా మంచు కురిసే అవకాశం ఉన్నందున పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని హిమాచల్ టూరిజం హెచ్చరించింది. ఎత్తైన రహదారుల గుండా ప్రయాణాలు ప్రమాదకరమని సూచించింది. అటు కాశ్మీర్‌లో 'చిల్లై-కలాన్' (కఠినమైన శీతాకాలం) ప్రారంభం కాకముందే శ్రీనగర్‌లో ఉష్ణోగ్రతలు -2.0 డిగ్రీలకు పడిపోయాయి.
ఇది కూడా చదవండి: ‘కిస్’ విద్యార్థి మృతి కేసు.. పప్పు కోసం ప్రాణం తీశారా?


