కోల్‌కతా, సాక్షి: ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్‌ఐఆర్) పై తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితా సమీక్ష సమయంలో తమ పేర్లు తొలగిస్తే వంటగది పనిముట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర మహిళలను కోరారు. ఓటర్ల జాబితా లక్ష్యంగా ఎస్‌ఐఆర్ సమీక్ష, రానున్న ఎన్నికల నేపథ్యంలో మమతా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
మొదటినుంచీ ఎస్‌ఐఆర్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మమత తాజా వ్యాఖ్యలు ఇక బీజేపీపై ప్రత్యక్ష పోరుకు సిద్ధమైపోయినట్టు కనిపిస్తోంది. కృష్ణానగర్‌లో జరిగిన ఒక ర్యాలీలో బీజేపీ తీసుకొచ్చిన ఎస్‌ఐఆర్ ప్రక్రియపై నిప్పులు చెరిగారు. ఎస్‌ఐఆర్ పేరుతో తల్లులు, సోదరీమణుల హక్కులను లాక్కుంటున్నారని ఆమె మండి పడ్డారు. ఎన్నికల వేళ ఢిల్లీ నుంచి పోలీసులను తీసుకువచ్చి మహిళల్ని బెదిరిస్తున్నారని విమర్శించారు. ‘‘తల్లులారా, సోదరీ మణులారా, మీ పేర్లు తొలగిస్తే, మీ దగ్గర పనిముట్లు ఉన్నాయి కదా? మీరు వంట చేయడానికి ఉపయోగించే పనిముట్లు. మీకు బలం ఉంది కదా? మీ పేర్లు తొలగిస్తే మీరు ఊరుకోరు కదా? మహిళలు ముందుండి పోరాడతారు’’ అన్నారు.
ఇదీ చదవండి: ఇండిగో బాధితులకు స్వల్ప ఊరట,ఆఫర్ ఏంటంటే..
మహిళలా? బీజేపీ? తేల్చుకుందాం
అంతేకాదు మహిళలు బలవంతులా లేక బీజేపీ బలమైనదా? తేల్చి చెప్పాలనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. తాను లౌకికవాదిననీ, ఏ మతతత్వాన్ని నమ్మనని చెప్పుకొచ్చారు. కానీ బీజేపీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా, డబ్బుతో ప్రజలను విభజించేందుకు ఇతర రాష్ట్రాల నుండి ప్రజలను తీసుకువస్తుందని ఆరోపించారు.
ఆదివారం కోల్‌కతాలో నిర్వహించిన సామూహిక భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని బెనర్జీ ప్రస్తావించారు. అవసరమైనప్పుడల్లా మనమందరం ఇంట్లోనే గీత పఠిస్తాం. దానికి బహిరంగ ప్రదర్శన ఎందుకు అని ప్రశ్నించారు. దేవుడనేవాడు మన హృదయాల్లో ఉంటాడు. అల్లాను ప్రార్థించేవారు హృదయాల్లోనే ప్రార్థిస్తారు. రంజాన్ సమయంలో, దుర్గా పూజ సమయంలో, ఇక్కడంతా కలిసి ప్రార్థనలు నిర్వహించుకుంటాం అని గుర్తు చేశారు. అలాగే ధర్మం అంటే పవిత్రత, మానవత్వం, శాంతి, హింస, వివక్ష, విభజన కాదు ఇదే కదా గీతారం, శ్రీకృష్ణుడు చెప్పింది ఇదే గదా అని ఆమె బీజీపీనుద్దేశించి ప్రవ్నించారు.
రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్ మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి గొప్ప వ్యక్తులెవరూ ప్రజలను విభజించే రాజకీయాలు చేయలేదని చెప్పారు. స్వాతంత్ర్యం కోసం పోరాడి, దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన బెంగాల్ ప్రజలు తాము భారతదేశ పౌరులమని నిరూపించుకోవాలా అని ముఖ్యమంత్రి అన్నారు. బీజేపీ మిమ్మల్ని ఏదీ తిననివ్వదు. చేపలు, మాంసం తినాలా వద్దా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి. ఎవరు శాకాహారం, ఎవరు మాంసాహారం తినాలనేది వ్యక్తిగత ఎంపిక, అంతేకానీ బీజేపీది కాదని స్పష్టం చేశారు. తన ప్రభుత్వం బెంగాల్ నుండి ఎవరినీ వెళ్లగొట్టడానికి అనుమతించదన్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని బీఎస్ఎఫ్ పోస్టుల దగ్గరకు ఎవరూ వెళ్లవద్దు ఇదొక్కటే తన విన్నపం అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
గాయపడిన పులి చాలా డేంజర్
గాయపడిన పులి ఆరోగ్యంగా ఉన్న పులి కంటే ఎక్కువ భయంకరంగా ఉంటుందని బెనర్జీ హెచ్చరించారు "మీరు మాపై దాడి చేస్తే, ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో మాకు తెలుసు. అన్యాయాన్ని ఎలా ఆపాలో మాకు తెలుసు," అని ఆమె అన్నారు. బీజేపీ తన ఐటీ సెల్ తయారుచేసిన జాబితాల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోందని ఆరోపించారు. బిహార్ చేయలేక పోవచ్చు, కానీ బెంగాల్ చేసి చూపిస్తుంది, మీరు ఏమి చేసినా సరే గుర్తుంచుకోండి అంటూ బీజేపీకి సవాల్ విసిరారు.
చదవండి: ఫస్ట్ నైటే చెప్పేశాడు...కొత్త పెళ్ళి కూతురి విడాకులు


