సాక్షి,ముంబై: తీవ్ర సంక్షోభం, గందరగోళం మధ్య విమానయాన సంస్థ ఇండిగో బాధిత ప్రయాణికుల స్వల్ప ఊరట నిచ్చింది. వరుస విమానాల రద్దు, ప్రయాణీకుల ఇక్కట్లు , డీజీసీఏ చీవాట్లు నేపథ్యంలో విమాన రద్దుతో ప్రభావితమైన ప్రయాణికులకు ఇండిగో రూ. 10,000 విలువైన ట్రావెల్ వోచర్‌లను అందించనుంది. ఈ మేరకు డిసెంబర్ 11 గురువారం ఇండిగో ఒక ప్రకటన విడుదల చేసింది.
డిసెంబర్ 3, 4 మరియు 5 తేదీలలో విమాన అంతరాయాల వల్ల తీవ్రంగా ప్రభావితమైన ప్రయాణికులకు ఇండిగో రూ. 10,000 విలువైన ట్రావెల్ వోచర్‌లను అందిస్తామని ఎయిర్‌లైన్ తెలిపింది. విమాన ఆలస్యాలు , రద్దుల కారణంగా ప్రయాణికులకు ఎయిర్‌లైన్ చెల్లించాల్సిన వాపసులు, ప్రభుత్వం నిర్దేశించిన పరిహారానికి ఇండిగో ప్రకటించిన ఈ ఆఫర్ అదనం. రాబోయే 12 నెలల్లో ఇండిగోతో భవిష్యత్తులో చేసే ఏదైనా ప్రయాణానికి వోచర్‌లను రీడీమ్ చేసుకోవచ్చని తెలిపింది.
రద్దు చేయబడిన అన్ని విమానాలకు రీఫండ్‌ల ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు ఇండిగో తెలిపింది. రీఫండ్‌లు ఇప్పుడు కస్టమర్ ఖాతాలో క్రెడిట్‌అయ్యాయనీ, మిగిలిన వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తున్నామని తెలిపింది. ట్రావెల్ ప్లాట్‌ఫామ్ భాగస్వాముల ద్వారా బుక్ చేసుకున్న టిక్కెట్ల రీఫండ్‌లు కూడా ప్రారంభమైనట్టు పేర్కొంది. మరోవైపు విమాన టికెట్ల చార్జీల రీఫండ్‌తోపాటు, ప్రస్తుత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, బయలుదేరే సమయం నుండి 24 గంటలలోపు విమానాలు రద్దు చేయబడిన వినియోగదారులకు, విమానం బ్లాక్ సమయం ఆధారంగా ఇండిగో రూ. 5,000 నుండి రూ. 10,000 వరకు పరిహారాన్ని అందిస్తుంది.
ఇదీ చదవండి: రూ. 9.1 కోట్లు ఉంటే ట్రంప్ గోల్డ్ కార్డ్ మీదే! ఎలా అప్లయ్ చేయాలి?


