టాటా క్యాపిటల్ నుంచి ఐస్ప్రౌట్‌కు రూ.60 కోట్లు
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆఫీస్ సొల్యూషన్స్ ప్రొవైడర్లలో ఒకటైన ఐస్ప్రౌట్ టాటా క్యాపిటల్ నుంచి డెట్ ఫండింగ్ ద్వారా రూ.60 కోట్లు సేకరించింది. తాజా మూలధనం ప్రధాన భారతీయ మెట్రోల్లో కంపెనీ వృద్ధి వ్యూహానికి తోడ్పడుతుందని కంపెనీ చెప్పింది. ఇది ఎంటర్ప్రైజ్ గ్రేడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేస్తుందని, వేగంగా విస్తరిస్తున్న మేనేజ్డ్ ఆఫీస్ పోర్ట్ఫోలియోను మెరుగుపరుస్తుందని కంపెనీ పేర్కొంది.
మేనేజ్డ్ ఆఫీస్ స్పేస్
మేనేజ్డ్ ఆఫీస్ స్పేస్ ఆపరేషన్ అనేది కార్యాలయాల సాంప్రదాయ లీజు, కో-వర్కింగ్ స్పేస్ లక్షణాలను మిళితం చేసే విధానం. ఒక కంపెనీ తరఫున థర్డ్ పార్టీ ఆపరేటర్ కార్యాలయ నిర్వహణకు బాధ్యత వహిస్తుంది. సాంప్రదాయ లీజు మాదిరిగా ఒప్పందాలు, రోజువారీ నిర్వహణ, యుటిలిటీ బిల్లులు వంటివి ఈ మేనేజ్డ్ ఆఫీస్ స్పేస్ ఆపరేటర్లు చూసుకుంటాయి. అద్దె, యుటిలిటీలు, ఫర్నిచర్, ఐటీ మౌలిక సదుపాయాలు, భద్రత, నిర్వహణతో సహా అన్ని సర్వీసుల కోసం ఒకేసారి ప్యాకేజీ తీసుకుంటాయి.
ఈ ఆపరేటర్లు కంపెనీ ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా వారి బ్రాండ్‌ను ప్రతిబింబించే ప్రైవేట్ కార్యాలయాన్ని అందిస్తాయి. అద్దె నుంచి మెయింటెనెన్స్ వరకు అన్నీ అందులో కవర్ అవుతాయి. ఇవి సాంప్రదాయ లీజుల కంటే తక్కువ కాలానికి (ఉదాహరణకు 6 నెలల నుంచి 2 సంవత్సరాలు) ఒప్పందాలు చేసుకోవచ్చు.
భారత్‌లో అభివృద్ధి
భారతదేశంలో మేనేజ్డ్ ఆఫీస్ స్పేస్ ఆపరేటింగ్ మార్కెట్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాణిజ్య రియల్ ఎస్టేట్ విభాగాలలో ఒకటి. ముఖ్యంగా 2021 నుంచి ఈ రంగం ఎంతో వృద్ధిని కనబరిచింది. కొవిడ్-19 అనంతర పరిణామాలతో కంపెనీలు హైబ్రిడ్ పని విధానాన్ని ఎక్కువగా అవలంబిస్తున్నాయి. దీనికి అనుగుణంగా సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్య పెరిగినా లేదా తగ్గినా సులభంగా సర్దుబాటు చేసుకోగలిగేలా ఫ్లెక్సిబుల్ స్పేస్‌ల కోసం చూస్తున్నాయి.
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్
బహుళజాతి సంస్థలకు చెందిన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (GCC) భారతదేశంలో విస్తరించడం ఈ డిమాండ్‌ను పెంచే ప్రధాన అంశం. బెంగళూరు, హైదరాబాద్, పుణె వంటి దక్షిణ భారతదేశ నగరాలు ఈ వృద్ధికి కీలకంగా ఉన్నాయి. ముఖ్యంగా స్టార్టప్‌లు, మధ్య తరహా సంస్థలు భారీ ప్రారంభ పెట్టుబడులు లేకుండా స్థిరమైన నిర్వహణ ఖర్చులతో కార్యాలయాలను ప్రారంభించడానికి ఈ మోడల్‌ను ఎంచుకుంటున్నాయి.
ఇదీ చదవండి: నైట్‌క్లబ్‌లు.. ఆర్థిక చిక్కులు.. నిర్వహణ సవాళ్లు


