అయిదేళ్లలో ఆస్తుల పెరుగుదల 48%
అప్పులు మాత్రం ఏకంగా 104% జంప్
మ్యూచువల్ ఫండ్స్ మీద పెరిగిన మక్కువ
ఇదీ భారతీయ కుటుంబాల ఆర్థిక చిత్రం
భారతీయ కుటుంబాల అప్పులు పెరుగుతున్నాయి. ఎంతలా అంటే.. ఆస్తులను మించిన వేగంతో! రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తాజా గణాంకాల ప్రకారం.. 2019–20తో పోలిస్తే 2024–25 నాటికి కుటుంబాల వార్షిక ఆస్తులు దాదాపు 48% అధికం అయ్యాయి. ఇదే సమయంలో అప్పులు మాత్రం ఏకంగా 104% పెరగడం గమనార్హం. కుటుంబాల పొదుపు, పెట్టుబడుల్లోనూ మార్పులు వస్తున్నాయి. కొన్ని సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్స్ వాటా వేగంగా పెరుగుతోంది. – సాక్షి, స్పెషల్ డెస్క్
సగటు భారతీయ కుటుంబం గత ఐదేళ్లలో పొదుపు, మదుపు చేయడం కంటే.. అప్పు చేస్తున్న వేగం పెరిగింది. ఆర్థిక ఆస్తులకు 2019–20లో భారతీయ కుటుంబాలు రూ.24.1 లక్షల కోట్లు జోడించాయి. గత ఆర్థిక సంవత్సరం నాటికి ఇవి 48% వృద్ధి చెంది రూ.35.6 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
మరోవైపు 2024–25లో కుటుంబాలకు రూ.15.7 లక్షల కోట్ల విలువైన రుణాల వంటి ఇతర ఆర్థిక బాధ్యతలు పెరిగాయి. వీటి విలువ 2019–20లో రూ.7.7 లక్షల కోట్లు. అంటే 5 ఏళ్ల కిందటితో పోలిస్తే ఇవి రికార్డు స్థాయిలో 104% పెరిగిపోయాయన్నమాట.
జీడీపీలో ఆస్తులు 10.8%
2019–20లో జోడించిన ఆర్థిక ఆస్తులు దేశ జీడీపీలో 12%గా ఉన్నాయి. ఇది 2024–25 నాటికి 10.8%కి తగ్గింది. అలాగే కుటుంబాల రుణ బాధ్యతలు 2019–20లో జీడీపీలో 3.9%గా ఉన్నాయి. 2023–24లో ఇవి ఏకంగా 6.2%కి ఎగబాకాయి. గత ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా తగ్గి 4.7%కి చేరాయి.
మ్యూచువల్ ఫండ్స్‌లో..
కుటుంబాలు 2019–20లో జోడించిన మొత్తం ఆర్థిక ఆస్తుల్లో వాణిజ్య బ్యాంకుల్లో చేసిన డిపాజిట్ల వాటా 32 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం నాటికి ఇది స్వల్పంగా పెరిగి 33.3%కి చేరింది. 2019–20లో కుటుంబాల డిపాజిట్ల పరిమాణం రూ.7.7 లక్షల కోట్లు. 5 ఏళ్లలో ఇది 54% అధికమై రూ.11.8 లక్షల కోట్లకు చేరుకుంది.
ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. అప్పట్లో మొత్తం ఆస్తుల్లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల వాటా కేవలం 2.6% మాత్రమే. కానీ గత ఆర్థిక సంవత్సరం నాటికి ఇది ఏకంగా 13.1%కి ఎగిసింది. 2019–20లో రూ.61,686 కోట్లుగా ఉన్న కొత్త మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు.. 5 ఏళ్లలో రికార్డు స్థాయిలో 655% పెరిగి రూ.4.7 లక్షల కోట్లకు చేరుకున్నాయి.


