ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్‌పై కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ కొరడా ఝుళిపించింది. నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు భారీ మొత్తంలో జరిమానా విధించింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నిబంధనలు పాటించనందుకు గానూ రూ.61.95 లక్షలు జరిమానా చెల్లించాలని కొటక్ మహీంద్రా బ్యాంకుకు ఆర్బీఐ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఇదే విషయాన్ని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.
జరిమానా ఇందుకే..
‘బ్యాంకింగ్ సేవలు అందించడం - బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా’ 'బిజినెస్ కరస్పాండెంట్లు (బీసీ) చేపట్టాల్సిన కార్యకలాపాల పరిధి'పై ఆదేశాలను పాటించనందుకు అలాగే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ రూల్స్, 2006 నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించినట్లు ఆర్బీఐ తెలిపింది.
2024 మార్చి 31 నాటికి బ్యాంకు ఆర్థిక స్థితికి సంబంధించి బ్యాంక్ సూపర్వైజరీ మూల్యాంకనాన్ని (ISE 2024) తనిఖీ చేసిన ఆర్బీఐ.. ఇప్పటికే కనీస సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు కలిగి ఉన్న కొంతమంది కస్టమర్లకు అలాంటి మరో ఖాతాను తెరిచినట్లు గుర్తించింది. అలాగే అనుమతించిన పరిధికి మించిన కార్యకలాపాలను చేపట్టడానికి బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్లకు అవకాశం కల్పించినట్లు కూడా గమనించింది. అంతేకాకుండా కొంతమంది రుణగ్రహీతలకు సంబంధించి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు (సిఐసి) తప్పుడు సమాచారాన్ని అందించినట్లు తేల్చింది.


