దేశంలో వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఉరుకుల పరుగుల జీవితంలో బస్సులో సేదదీరుతూ గమ్యం చేరాలనుకునే సుదూర ప్రయాణికులు ఊహించని ప్రమాదాల్లో శాశ్వత నిద్రలోకి వెళ్లడం ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తోంది. ఈ ఏడాది(2025) భారీ సంఖ్యలో వరుస బస్సు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. వందల సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందారు.
కార్లు, బైకులు, ఇతర ప్రైవేటు వాహనాలతో పోలిస్తే బస్సుల్లో ప్రయాణం సురక్షితం. బస్సులు రోడ్డు ప్రమాదానికి గురైనా ప్రాణ నష్టం అత్యంత స్వల్పంగా ఉంటుంది. కానీ, అదే అగ్ని ప్రమాదానికి గురైన సమయాల్లో ప్రాణ నష్టం ఊహకు అందడం లేదు. ప్రయాణికులు తేరుకునేలోగానే అగ్ని కీలలు వారిని ఎలా ముంచెత్తుతాయి. తాజాగా కర్ణాటకలో జరిగిన మరో బస్సు ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. ఈ ఏడాది జరిగిన బస్సు ప్రమాదాల వివరాలు ఇలా ఉన్నాయి.
మేజర్ ప్రమాదాలు..
సెప్టెంబర్ 14న రాజస్థాన్‌లో దగ్దమైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు. జైసల్మేర్ నుంచి జోధ్‌పూర్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో భారీగా మంటలు చెలరేగి 20 మంది సజీవదహనమయ్యారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 57 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు వెనక భాగంలో చెలరేగిన మంటలు క్షణాల్లోనే వ్యాపించాయి.
సెప్టెంబర్ 23న తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెన్నేపల్లి వద్ద పెళ్లి బృందం బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. 35మంది నెల్లూరు నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన అందరూ కిందకు దిగిన తర్వాత బస్సు దగ్ధమైంది.
సెప్టెంబర్ 26న హైదరాబాద్‌లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. మియాపూర్ నుంచి బయల్దేరిన బస్సు ఎస్సార్ నగర్ చౌరస్తాలో ఉమేశ్ చంద్ర విగ్రహం వద్దకు రాగానే ఏసీ నుంచి మంటలు వ్యాపించాయి.
అక్టోబర్ 24న కర్నూలులో ట్రావెల్స్ బస్సు ప్రమాదం. అర్ధరాత్రి బైక్‌ను బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో 19 మంది మృతి చెందారు.
అక్టోబర్ 26న యూపీలో స్లీపర్ బస్సులో చెలరేగిన మంటలు.
అక్టోబర్ 29న మహారాష్ట్రలోని సమృద్ది హైవేపై బస్సులో మంటలు.
నవంబర్ 3న చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది దుర్మరణం.
డిసెంబర్ 12న మారేడుమిల్లి వద్ద లోయలో పడిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు. తొమ్మిది మంది మృతి, పలువురికి గాయాలు.
ఈనెల 16న యూపీలోని మథుర వద్ద ఎక్స్‌ప్రెస్ హైవేపై ప్రమాదం. పొగ మంచు కారణంగా ఢీకొన్న బస్సులు, కార్లు. వాహనాల్లో మంటలు చెలరేగి 13 మంది మృతి, దాదాపు 60 మందికి గాయాలు.
డిసెంబర్ 24న తమిళనాడులో రెండు కార్లను ఢీకొన్న బస్సు తొమ్మిది మంది మృతి.
డిసెంబర్ 25(ఈరోజు) కర్ణాటకలో బస్సు ప్రమాదం. దాదాపు 13 మంది మృతి, పలువురికి గాయాలు.


