ఉత్తర ప్రదేశ్ ఉన్నావ్‌లో సంచలనం సృష్టించిన అత్యాచార కేసులో పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. నిందితుడు కుల్దీప్ సింగ్ సెంగర్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వడం.. దీనిని నిరసిస్తూనే ప్రాణభయంతో బాధితురాలు, ఆమె తల్లి ఆందోళనకు దిగడం.. అందుకు అనుమతి లేదంటూ భద్రతా సిబ్బంది వాళ్లను ఈడ్చిపారేయడం.. యోగి ప్రభుత్వ నుంచి కనీస స్పందన లేకపోవడం.. బాధితుల సోనియా-రాహుల్ గాంధీలను కలవడంతో రాజకీయ రగడ నెలకొంది. ఈ తరుణంలో..
న్యూఢిల్లీ: ఉన్నావ్ కేసులో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు జరిపిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సెంగర్ బెయిల్‌ను సవాల్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని భావిస్తోంది. ఢిల్లీ హైకోర్టును సమీక్షించిన తర్వాత పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది.
2017లో నాడు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న కుల్దీప్ సింగ్ సెంగర్ మైనర్ అయిన బాధితురాలిని ఎత్తుకెళ్లి పలుమార్లు అత్యాచారం జరపడంతో పాటు ఆమెను అమ్మే ప్రయత్నమూ చేశారు. ఆ సమయంలో పోలీసుల చొరవతో ఆమె బయటపడగలిగింది. అయితే న్యాయం కోసం ఆమె పోరాడినా ఫలితం దక్కలేదు. దీంతో సీఎం యోగి ఆదిత్యానాథ్ నివాసం వద్ద బలవన్మరణం కోసం ప్రయత్నించడంతో ఈ కేసు దేశం దృష్టిని ఆకర్షించగలిగింది. ఈలోపు.. ఆమె తండ్రి హత్యకు గురికాగా.. ఆమె ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగింది కూడా.
ఈ కేసు తీవ్రత దృష్ట్యా యూపీ ప్రభుత్వం సీబీఐకి అప్పగించగా.. సుప్రీం కోర్టు చొరవతో విచారణను కూడా యూపీ నుంచి ఢిల్లీ కోర్టుకు మార్చారు. 2019లో విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు నిందితుడు కుల్దీప్ సెంగర్‌కు జీవితఖైదు విధించింది. అయితే.. తాజాగా(డిసెంబర్ 23, 2025) మంగళవారం ఢిల్లీ హైకోర్టు సెంగర్ జీవితఖైదును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
పోక్సో చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం.. అధికారం ఉన్న వ్యక్తి లైంగిక దాడి చేస్తే కనీసం 20 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది. సెంగార్ నాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ప్రభుత్వ అధికారి కిందకు రారని.. కాబట్టి ఆయపై పెట్టిన పోక్సో చట్టంలోని సెక్షన్-5 వర్తించదని ఢిల్లీ హైకోర్టు ద్విసభ ధర్మాసనం తీర్పు సందర్భంగా అభిప్రాయపడింది. కాబట్టి ఆ చట్టంలోని సెక్షన్ 4 మాత్రమే ఆయనకు వర్తిస్తుందని పేర్కొంది.
ఈ తీర్పును బాధితురాలి కుటుంబం తీవ్రంగా తప్పుబడుతోంది. సెంగార్ బయటకు రావడం అంటే.. తమ ప్రాణాలకు ముప్పు తప్పదని ఆందోళన చెందుతోంది. ఈ మేరకు సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ వేయబోతోంది. అయితే ఇప్పుడు సీబీఐ కూడా సుప్రీం కోర్టును ఆశ్రయిస్తుండడంతో కేసు ఎలాంటి మలుపు తిరగబోతోందా? అనే ఆసక్తి నెలకొంది.
‘‘ దారుణోదంతానికి ఒడిగట్టి దోషిగా తేలిన వ్యక్తికి హైకోర్టు మళ్లీ బెయిల్ మంజూరుచేయడమేంటి? ఇది నా కుటుంబానికి మరణశాసనం రాయడమే. బెయిల్ రద్దు డిమాండ్‌తో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా’’ అని ఆమె అన్నారు. బెయిల్‌ను తీవ్రంగా తప్పుబడుతూ బాధితురాలి తల్లితోపాటు మహిళా హక్కుల కార్యకర్త యోగితా భయానా మంగళవారం రాత్రి ఢిల్లీలోని ఇండియాగేట్ సమీప మండీ హౌస్ వద్ద బైఠాయించి ధర్నా చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు వెంటనే వారిని అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. ఈ క్రమంలో బాధితురాలికీ గాయాలయ్యాయని యోగిత చెప్పారు.
‘‘దోషికి ఇలాగే బెయిల్ ఇస్తూ పోతే దేశంలోని ఆడబిడ్డలకు రక్షణ అనేదిఉంటుందా? మా విషయంలో మాత్రం ఈ తీర్పు మరణశాసనమే. న్యాయం పొందటంలో ధనికులు లాభపడతారు. మాలాంటి పేదలు ఓడిపోతారు. తీర్పు తర్వాత మమ్మల్ని లాయర్లతోనూ కలవనివ్వట్లేరు. వాళ్లను కలిసేందుకు వెళ్తుంటే సీఆర్‌పీఎఫ్ జవాన్లు అడ్డుకుని తిరిగి ఇంటికి పంపేస్తున్నారు. నా కుటుంబసభ్యులు, లాయర్లు, సాక్షులకు గతంలో ఇచి్చన పోలీస్‌భద్రతనూ ఉపసంహరించారు. ఇప్పుడు మాకు ప్రాణహాని ఎక్కువైంది. మా గతేంటి? దోషిని బెయిల్‌పై విడుదలచేస్తే మమ్మల్ని అయినా జైలుకు పంపండి. అతడి మిగతా జైలుశిక్షను నేను అనుభవిస్తా. అక్కడయినా క్షేమంగా ఉంటాం. సరైన ఉపాధి లేదు. అక్కడయినా తినడానికి తిండి దొరుకుతుందేమో’’
:::ఉన్నావ్ బాధితురాలి ఆవేదన
సోనియా, రాహుల్‌లతో భేటీ
ధర్నా తర్వాత బాధితురాలు తన తల్లితో కలిసి 10, జన్‌పథ్‌లోని సోనియాగాంధీ అధికారిక నివాసంలో సోనియా, రాహుల్‌గాంధీలను కలిశారు. నైతిక మద్దతు ఇవ్వాలని కోరారు. సుప్రీంకోర్టులో నేరాన్ని నిరూపించి దోషిని బోనులో నిలబెట్టేలా అత్యంత ప్రతిభావంతులైన లాయర్ల బృందాన్ని ఇవ్వాలని ఆమె ఇరునేతలను కోరారు. పూర్తి సహాయసహకారాలు అందిస్తామని ఇరునేతలు బాధిత కుటంబానికి హామీ ఇచ్చారు. అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. ‘‘ న్యాయం కోసం పోరాడుతున్నా. ప్రధాని మోదీని కలవాలని నిర్ణయించుకున్నా. న్యాయపోరాటం చేస్తున్నందుకు రాహుల్ అభినందించారు’’ అని బాధితురాలు తర్వాత మీడియాతో చెప్పారు. ‘‘ అమలవుతున్న యావజ్జీవ కారాగారశిక్షను హఠాత్తుగా నిలుపుదలచేసి బెయిల్ ఇవ్వడం భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి అనుకుంటా. రేపిస్ట్‌లు అందరూ ఇలాగే విడుదలవుతారనే భయం ఇప్పుడు బాధితులందరి మనసుల్ని పురుగులా తొలిచేస్తోంది. ఇదే ప్రభుత్వం? ఇదేం పాలన?’’ అని బాధితురాలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదిలా ఉంటే.. సెంగర్ వర్గ ఓట్ల కోసమే కుల్దీప్‌ను యూపీ బీజేపీ సర్కార్ బయటకు రప్పించే ప్రయత్నం చేస్తోందని రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సిగ్గుచేటు
ఉన్నావ్‌లో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో దోషి కుల్దీప్ సెంగర్ జైలు నుంచి విడుదల కావడం దేశానికి సిగ్గు చేటు అని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు బుధవారం రాహుల్ తన సామాజికమాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘సామూహిక అత్యాచార బాధితురాలి విషయంలో ప్రభుత్వం ఇంత నిర్దయంగా వ్యవహరించడం ఏ విధంగా సమర్థనీయం?. న్యాయం కోసం గొంతు వినిపించడానికి ధైర్యం చేయడమే ఆమె చేసి తప్పా?. బాధితురాలు పదే పదే వేధింపులకు గురవుతూ ప్రాణభయంతో జీవిస్తుంటే దోషికి బెయిల్ మంజూరు చేయడం అత్యంత దారుణం. బెయిల్ రావడం చాలా నిరాశపరిచింది. ఇది సిగ్గుచేటు. అత్యాచారం చేసిన వారికి బెయిల్ ఇవ్వడం, బాధితులను నేరస్థుల్లా చూడడం ఇదేం న్యాయం?. కేవలం ఒక మృత ఆర్థిక వ్యవస్థే కాదు ఇలాంటి అమానవీయ సంఘటనలతో మనం ఒక నిర్జీవ సమాజంగా విపరిణామం చెందుతున్నాం. ప్రజాస్వామ్యంలో అసమ్మతి గళం వినిపించడం హక్కు. దానిని అణచివేయడం నేరం. బాధితురాలు గౌరవం, భద్రత, న్యాయం పొందాలి. కానీ నిస్సహాయత, భయం, అన్యాయం కాదు’’ అని రాహుల్ ఆగ్రహం వ్యక్తంచేశారు.


