బెంగాల్‌లో మిన్నంటిన నిరసనలు | Peak Protests in West Bengal Over Bangladesh Issue | Sakshi
Sakshi News home page

బెంగాల్‌లో మిన్నంటిన నిరసనలు

Dec 25 2025 7:46 AM | Updated on Dec 25 2025 7:46 AM

Peak Protests in West Bengal Over Bangladesh Issue

కోల్‌కతా: బంగ్లాదేశ్‌లో హిందూ కార్మికుడి హత్యతోపాటు మైనార్టీలపై జరుగుతున్న∙దాడుల పట్ల పశ్చిమ బెంగాల్‌లో హిందూ సంఘాల సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. భారత్, సరిహద్దులోని ఓడరేవుల వద్ద బుధవారం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బీజేపీ కార్యకర్తలు సైతం పాల్గొన్నారు. నిరసనకారులను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

దీంతో, కోల్‌కతాలో హౌరా బ్రిడ్జి వైపు ర్యాలీగా వస్తున్న జనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. బారీకేడ్లను పక్కకు నెట్టేసి ముందుకు దూసుకెళ్లడానికి నిరసనకారులు ప్రయత్నించారు. బంగ్లాదేశ్‌లో మైనార్టీలైన హిందువులపై దాడులను తక్షణమే ఆపాలని డిమాండ్‌ చేస్తూ సనాతన ఐక్య పరిషత్‌ ఆధ్వర్యంలో 24 పరగణాల జిల్లా, మాల్డా, కూచ్‌ బెహార్‌ జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఈ నెల 18న బంగ్లాదేశ్‌లోని మైమెన్‌సింగ్‌ సిటీలో దీపూ చంద్రదాస్‌ అనే హిందూ కార్మికుడిని అల్లరిమూకలు కొట్టి చంపిన సంగతి తెలిసిందే. ఈ రాక్షసకాండ పట్ల ఇండియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హిందూ సంఘాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. అల్లరిమూక దాడిలో ప్రాణాలు కోల్పోయిన దీపూ చంద్రదాస్‌ కుటుంబ బాధ్యతను బంగ్లాదేశ్‌ ప్రభుత్వం స్వీకరిస్తుందని మధ్యంతర ప్రభుత్వ సీనియర్‌ సలహాదారు సీఆర్‌ అబ్రార్‌ చెప్పారు. ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. దీపూ చంద్రదాస్‌ భార్య, పిల్లలు, తల్లిదండ్రుల బాగోగులను ప్రభుత్వం చూస్తుందని హామీ ఇచ్చారు. అమాయకుడిని హత్య చేయడం దారుణమని అన్నారు. ఈ హత్యకు పాల్పడినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. మరోవైపు తమ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేకూర్చాలని దీపూ చంద్రదాస్‌ తండ్రి రవి చంద్రదాస్‌ డిమాండ్‌ చేశారు. తన కుమారుడిని పొట్టనపెట్టుకున్న ముష్కరులను కఠినంగా శిక్షించాలని అన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement