అప్పుల బాధ భరించలేక రైతుల బలవన్మరణాలు
ఒక్కరోజు వ్యవధిలోనే గుంటూరు జిల్లాలో ఇద్దరు ఆత్మహత్య
మిర్చి, పత్తి పంట సాగులో నష్టాలతో అన్నదాతలు కుదేలు
చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక దక్కని గిట్టుబాటు ధర
అప్పుల ఊబిలో చిక్కుకొని రైతుల విలవిల
గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కొనసాగుతున్న ఆత్మహత్యలు
ఆరుగాలం కష్టపడిన రైతన్నలు పండించిన పంటకు తగిన గిట్టుబాటు ధర రాక అప్పుల పాలు కావడంతో మృత్యువును ఆశ్రయిస్తున్నారు. కొందరు పొలాల్లో ఉరికొయ్యలకు వేలాడుతుండగా, మరికొందరు సాగు చేసిన భూమిలోనే పురుగుమందు తాగి తనువు చాలిస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఒక్క రోజు వ్యవధిలోనే ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది.
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఫిరంగిపురం మండలం గొల్లపాలెంకు చెందిన ఎం.బొల్లయ్య రెండు ఎకరాల్లో మిర్చి, తొమ్మిది ఎకరాల్లో పత్తి సాగు చేశారు. పంటలు సరిగ్గా పండక, పండిన కొద్ది పంటకు కూడా గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పుల పాలయ్యాడు. పొలానికి వెళ్లి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అదే మండలం మెరికపూడి గ్రామానికి చెందిన ఎస్‌కే మస్తాన్ వలి ఐదు ఎకరాలలో పత్తి పంట వేశాడు. పంట పండక అప్పులు కావడంతో బుధవారం పొలానికి వెళ్లాడు. చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. రాత్రంతా వెతికిన కుటుంబసభ్యులు మరునాడు ఉదయం ఈ దారుణాన్ని గమనించారు.
రోజురోజుకూ..
ఉమ్మడి గుంటూరు జిల్లాలో రోజురోజుకూ రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. వ్యవసాయ ఖర్చులు అధికం కావడం, అరకొర దిగుబడులు, పంట చేతికొచ్చే సమయానికి తుపాన్లు, భారీ వర్షాలు ఇబ్బంది పెట్టాయి. అన్నీ గట్టెక్కినా చివరికి గిట్టుబాటు ధర లేకపోవడం, వడ్డీలకు తెచ్చిన అప్పులు రెట్టింపు అవుతుండటం, వాటిని తీర్చలేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కిన తరువాత ఇప్పటి వరకు ఒక్క ప్రత్తిపాడు నియోజకవర్గంలోనే పది మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఫిరంగిపురం మండలంలో ఇద్దరు, చిలకలూరిపేట నియోజకవర్గంలో ముగ్గురు, వినుకొండలో ఒకరు, పెదకూరపాడు నియోజకవర్గంలో మరొకరు ఈ ఏడాది కాలంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు.
గత ప్రభుత్వంలో వెంటనే సాయం..
గత వైఎస్సార్‌సీపీ సర్కారు హయాంలో రైతులకు అన్నివిధాలా లాభం చేకూర్చేలా వ్యవసాయ రంగంలో పరిస్థితులు ఉండేవి. రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయం దగ్గర్నుంచి ఎరువులు సకాలంలో అందించడం, గిట్టుబాటు ధర లభించేలా చూడటం వరకు సజావుగా సాగేవి. విధి లేని పరిస్థితిలో ఎవరైనా రైతు బలవన్మరణానికి పాల్పడితే సాయం అందించేవారు.
కానీ ఇప్పుడు కనీసం వారిపై ఆధారపడిన కుటుంబాన్ని ఆదుకునే విషయంలోనూ చంద్రబాబు ప్రభుత్వానికి మనసు రావడం లేదు. గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మండల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా నేరుగా జిల్లా కలెక్టర్ సదరు రైతు కుటుంబానికి ఏకంగా రూ. ఏడు లక్షల పరిహారాన్ని నెల, రెండు నెలల వ్యవధిలోనే అందించారు. ఇప్పుడు కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించే పరిస్థితి కూడా లేకుండాపోయింది.
ముంచేసిన పత్తి, మిర్చి, పొగాకు..
ఉమ్మడి గుంటూరు జిల్లాలో పత్తి, మిర్చి పంటలనే ఎక్కువ సాగు చేస్తున్నారు. గత ఏడాది గులాబీ రంగు పురుగు అధికంగా ఉండటంతో పత్తి రైతులు నిలువునా నష్టపోయారు. మిర్చిని నల్లి తామర ముంచెత్తడంతో పంటను పీకేయాల్సి వచ్చింది. పత్తికి, మిర్చికి ఎకరాకు సుమారు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు పెట్టబడులు పెట్టారు. ఆరుగాలం శ్రమించి పండించుకున్న పంటలకు కనీస గిట్టుబాటు ధర కూడా లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
మిర్చి సాగు చేసి నట్టేట మునిగిపోయిన రైతులు పంటను పీకివేసి, నల్లబర్లీ పొగాకు సాగు చేశారు. తీరా పంట దిగుబడులు చేతికొచ్చే సమయానికి ధర లేకపోవడంతో రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. గతంలో క్వింటా రూ.పదిహేను వేల వరకు అమ్మిన నల్లబరీని ఈ సారి రూ. మూడు వేలు నుంచి రూ. నాలుగు వేలకు కూడా కొనలేదు.
ఈ ఏడాది నల్లబర్లీ పొగాకు సాగు చేయవద్దని చంద్రబాబు ప్రభుత్వం నిషేధం విధించింది. పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా తేమ ఎక్కువ ఉందనే సాకుతో వెనక్కి పంపుతున్నారు. దీనివల్ల పత్తి రైతులు తీవ్ర నష్టాల్లోకి వెళ్లిపోయారు. మరోవైపు పొగమంచు కారణంగా పత్తిలో తేమశాతం తగ్గడం లేదు.


