బెంగళూరు: ఎడతెగని టీవీ సీరియల్ మాదిరిగా కర్ణాటక ముఖ్యమంత్రి మార్పిడి తతంగం కొనసాగుతోంది. హైకమాండ్ నేతలు ఒకమాట, సీఎం సిద్దరామయ్య మరో మాట చెబుతూ ఉంటే, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఒంటరి పోరాటం సాగిస్తున్నారనే చెప్పాలి. ఈ క్రమంలో డీకే శివకుమార్ (Shivakumar) కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం, పదవుల కంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉండటమే తనకు ఇష్టమని వ్యాఖ్యానించారు. దీంతో, సీఎం మార్పు అనే వ్యవహారానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.
డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీ పర్యటన తర్వాత మీడియాతో మాట్లాడుతూ..‘సీఎం సిద్ధరామయ్య, నా మధ్య ఏం జరిగిందో నేను వెల్లడించలేను. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కలిసి పనిచేశాం. పార్టీ కోసం ప్రతిఒక్క కార్యకర్త ఎంతో కష్టపడ్డాడు. 1980 నుంచి పార్టీ కోసం అవిశ్రాంతంగా పనిచేశాను. ఇప్పటికీ పార్టీ వర్కర్‌గా ఉండేందుకే ఇష్టపడతాను. హైకమాండ్ మాకు స్వేచ్ఛనిచ్చింది. కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. పార్టీ అధికారంలోకి రావడానికి డీకే, సిద్ధూతో పాటు ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు కూడా ఎంతో కృషి చేశారు’ అని అన్నారు.
ఈ సందర్భంగా సంక్రాంతి తర్వాత నాయకత్వ మార్పునకు సంబంధించిన చర్చల గురించి విలేకరులు ప్రశ్నించారు. అలాంటి చర్చలు మీడియాలో మాత్రమే జరుగుతున్నాయని.. ప్రభుత్వం, పార్టీలో కాదని డీకే స్పష్టం చేశారు. ఇక, ప్రస్తుతం పార్టీ హైకమాండ్‌ను కలవడం లేదని, విదేశాల నుంచి వచ్చిన రాహుల్‌గాంధీని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదని పేర్కొన్నారు. మంత్రివర్గ విస్తరణపై సీఎం మాత్రమే సమాధానం చెప్పగలరని వ్యాఖ్యానించారు.
27వ తేదీపైనే ఆశలు
ఇదిలా ఉండగా.. సీఎం సిద్దరామయ్యకు మద్దతుగా మాజీ మంత్రి కే.ఎన్.రాజణ్ణ రాహుల్‌గాంధీకి లేఖ రాసి వేడి పుట్టించారు. ఈ నెల 27న కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ కమిటీ సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. అందులో పాల్గొనేందుకు డీకే శివకుమార్ వెళ్తారు. తాను వెళ్లనని సిద్దరామయ్య మొన్ననే చెప్పారు. ఆ సమావేశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలని డీకే పట్టుదలతో ఉన్నారు. ఇందులో ఫైనల్ రౌండ్ చర్చలకు శ్రీకారం చుట్టనున్నారు.


