ఉన్న స్టార్టప్ మూసేస్తున్నారు లేదా అమ్మేస్తున్నారు
రెట్టించిన ఉత్సాహంతో కొత్త స్టార్టప్ పెట్టేస్తున్నారు
‘ఫ్లిప్‌కార్ట్ మాఫియా’లో 236 అంకుర సంస్థలు
చిన్నచిన్న పట్టణాల్లోనూ కొత్త సంస్థలు, ఫండింగ్
ఒకప్పుడు తాము పెట్టిన అంకుర సంస్థను ఏ కారణంతోనైనా మూసేయాల్సి వచ్చినా.. అమ్మాల్సివచ్చినా సిగ్గుపడేవారు. నలుగురూ ఏమనుకుంటారో అని భయపడేవాళ్లు. కానీ, కాలం మారింది. గౌరవప్రదంగానే మూసేస్తున్నారు లేదా రికార్డు ధరకు అమ్మేస్తున్నారు. కొద్ది రోజుల్లోనే కొత్త స్టార్టప్ పెట్టేస్తున్నారు. ‘మాఫియా’ సామ్రాజ్యం సృష్టిస్తున్నారు. ఏమిటీ ‘మాఫియా’.. వీటికి పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. మనదేశంలో ఈ ట్రెండ్ ఏమిటి? – సాక్షి, స్పెషల్ డెస్క్
క్రెడ్.. చాలామందికి సుపరిచితమైన ఫిన్‌టెక్ యాప్. దీని వ్యవస్థాపకుడు కునాల్ షా. ముంబైకి చెందిన కునాల్ మొదట ఫ్రీచార్జ్ అనే ఫిన్‌టెక్ స్టార్టప్ పెట్టాడు. 2015లో దాన్ని 400 మిలియన్ డాలర్లకు అమ్మేసి.. కొన్నేళ్ల తరవాత క్రెడ్ ఏర్పాటుచేశాడు.
ఫ్లిప్‌కార్ట్... దీనికి పరిచయం కూడా అవసరం లేదు. ఈ ఆలోచన ఐఐటీ గ్రాడ్యుయేట్లు సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్‌ది. ఫ్లిప్‌కార్ట్ సూపర్‌హిట్ అయిన తరవాత.. 2018లో ఇందులోని 77 శాతం వాటాను అమెరికాకు చెందిన వాల్‌మార్ట్‌కు రికార్డు స్థాయిలో 16 బిలియన్ డాలర్లకు అమ్మేశాడు సచిన్. తరవాత ‘నవి’ అనే ఆర్థిక సేవల సంస్థను ప్రారంభించాడు.
ఇలా దేశంలో సుమారు 40కిపైగా స్టార్టప్‌ల వ్యవస్థాపకులు.. ఉన్నవి అమ్మేసి లేదా మూసేసి కొత్తవి పెట్టి కూడా విజయవంతమయ్యారు.
2024లో 12.7 బిలియన్ డాలర్లు
దేశంలో ప్రస్తుతం 5 లక్షలకుపైగా స్టార్టప్‌లు ఉన్నాయి. 2016లో వీటి సంఖ్య కేవలం 500. మార్కెట్ విశ్లేషణ సంస్థ ట్రాక్సన్ డేటా ప్రకారం.. 2016లో వీటికి వార్షికంగా సమకూరిన నిధులు 5.2 బిలియన్ డాలర్లే. కానీ, 2024లో అందిన పెట్టుబడులు ఏకంగా 12.7 బిలియన్ డాలర్లు. కేంద్ర ప్రభుత్వ విధానాల్లో మార్పు, స్టార్టప్‌లకు ప్రోత్సాహం, అటల్ ఇన్నోవేషన్ మిషన్.. వంటివి కూడా ఔత్సాహికులకు వరంలా మారాయి.
షేర్లు కొని శ్రీమంతులై..
ఇటీవలి కాలంలో కొన్ని కంపెనీలు.. తమ ఉద్యోగులకు సంస్థ షేర్లను తక్కువ ధరకే కొనుక్కునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఆ తరవాత వారు అమ్ముకోవచ్చు లేదా ఉంచుకోవచ్చు, అది వారిష్టం. డేటా ప్లాట్‌ఫామ్ ‘దక్రెడిబుల్’ గణాంకాల ప్రకారం.. 2020–25 మధ్య సుమారు 100 స్టార్టప్‌లు తమ ఉద్యోగులకు ఈ అవకాశం కల్పించాయి. ఇలా కొనుగోలు చేసిన స్టాకుల విలువ 1.7 బిలియన్ డాలర్లని అంచనా. ఆ సంస్థ షేర్ల ధర పెరిగితే కొన్నవాళ్లకు పండుగే అన్నమాట. అలా అమాంతంగా డబ్బు వచ్చినప్పుడు.. చాలామంది ఉద్యోగం మానేసి ‘కొత్త స్టార్టప్’ ఆలోచనలు చేస్తున్నారు.
అదో ‘మాఫియా’మాఫియా.. అండర్‌వరల్డ్‌లతో లింకులున్న స్టార్టప్‌లు అనుకునేరు.. కాదు కాదు! ఒక స్టార్టప్‌ను ప్రారంభించి.. అది సూపర్ సక్సెస్ అయిన తరవాత అందులోని వాళ్లు బయటికి వచ్చి కొత్త స్టార్టప్‌లు పెడుతుంటారు కదా. అలాంటప్పుడు సదరు మాతృ సంస్థ మాఫియాగా ఈ కంపెనీలన్నింటినీ పిలుస్తున్నారు. ఈ ట్రెండ్ అమెరికాలోని సుప్రసిద్ధ ఫిన్‌టెక్ కంపెనీ పేపాల్‌తో మొదలైంది. పేపాల్‌లో పనిచేస్తూ బయటికి వచ్చిన వాళ్లలో ఎలాన్ మస్క్ ఒకరు. ఆయనే టెస్లా, ఎక్స్ వంటి అనేక సుప్రసిద్ధ కంపెనీల అధిపతి.
చాడ్ హర్లీ, స్టీవ్ చెన్ వంటి వాళ్లు.. యూట్యూబ్ వ్యవస్థాపక బృంద సభ్యులు. వీళ్లందరినీ ‘పేపాల్ మాఫియా’ అని పిలవడం మొదలుపెట్టారు. అలాగే మనదేశంలోనూ ఫ్లిప్‌కార్ట్ మాఫియా, జోహో మాఫియా, జొమాటో మాఫియా, స్విగ్గీ మాఫియా, పేటీఎం మాఫియా వంటివి ఉన్నాయి. అత్యధికంగా ‘ఫ్లిప్‌కార్ట్ మాఫియా’ ద్వారా 236 స్టార్టప్‌లు ఏర్పాటయ్యాయి.
మెట్రోల్లోనే కాదు..
స్టార్టప్‌లు, ఫండింగ్ అంటే మెట్రో నగరాల్లోనే అనుకుంటాం. కానీ, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ స్టార్టప్‌లు పెరుగుతున్నాయి. వాటిలో పెట్టుబడులు పెట్టేవాళ్లు కూడా పెరుగుతున్నారు.



