సాక్షి, ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) సమావేశం జరిగింది. పార్టీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో జరుగుతున్న ఈ భేటీకి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్, ఇతర సీనియర్‌లు.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.
జాతీయ ఉపాధి హామీ పథకం పేరును వీబీ జీ రామ్ జీ మార్చడంపై కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మహాత్మా గాంధీ పేరును బీజేపీ ప్రభుత్వం తుడిచి వేసే ప్రయత్నం చేస్తుందని మండిపడుతోంది. ఈ నేపథ్యంలో.. ఈ అంశంపైనే దేశవ్యాప్త పోరాటాలు చేయాలని నిర్ణయించింది.
ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడుతూ.. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ రద్దుతో కోట్లాది పేదలకు ఉపాధి కరువు. పథకాన్ని రద్దు చేయడం(పేరు మార్చడం)మహాత్మా గాంధీకి అవమానమే. యూపీఏ హయాంలో.. దళితులు, ఆదివాసీలు, మహిళలకు భరోసా ఇచ్చిన పథకం. అలాంటి పథకాన్ని ఎలాంటి అధ్యయనం లేకుండా రద్దు చేశారు. హయాంలో అమలైన హక్కులను కావాలనే కూల్చేస్తున్నారు.
పని హక్కు మీద మోదీ సర్కార్ చేస్తున్న క్రూర దాడి ఇది. పేదల కంటే కార్పొరేట్ల లాభాలే కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యం. మూడు నల్ల వ్యవసాయ చట్టాల తరహాలోనే. .. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ MGNREGAపై దేశవ్యాప్త పోరాటం అవసరం. కాంగ్రెస్ ప్రజా ఉద్యమానికి సిద్ధం. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం’’ అని ప్రకటించారాయన. అలాగే..
ఈడీ, ఐటీ, సీబీఐలాంటి దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. ఎస్‌ఐఆర్ పేరుతో ఓటర్ల హక్కులపై కుట్ర జరుగుతోంది. దళితులు, ఆదివాసీలు, మైనారిటీల పేర్లు తొలగించొద్దు. నేషనల్ హెరాల్డ్ కేసులో న్యాయ పోరాటం కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోంది. అలాగే.. దేశంలో సామరస్యం దెబ్బతీసే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాం అని ఖర్గే పేర్కొన్నారు.
కాంగ్రెస్ ‘సంస్థా శ్రీజన్ అభియాన్’ కొనసాగుతోంది. ఇప్పటికే 500 జిల్లాల్లో జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తి అయ్యింది. బూత్ స్థాయి వరకూ పార్టీ బలోపేతం చేస్తాం. 2026లో జరగబోయే ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది అని ఖర్గే అన్నారు.
థరూర్ పరుగు.. నమస్తే
చాలాకాలంగా కాంగ్రెస్ కీలక సమావేశాలకు సైతం దూరంగా ఉంటూ.. హట్ టాపిక్‌గా మారిన తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఎట్టకేలకు ఇవాళ సీడబ్ల్యూసీ భేటీకి హాజరయ్యారు. ఆ సమయంలో మీడియా కెమెరాలు ఆయన వైపే తిప్పాయి. దీంతో ఆయన వేగంగా పరిగెత్తుకుంటూ డోర్ దాకా వెళ్లారు. అక్కడ నుంచి అందరి చూస్తూ నమస్కారం చేసి లోపలకు వెళ్లిపోయారు. అంతకు ముందు.. ఇందిరా భవన్ ప్రాంగణంలో కనిపించిన ప్రతీ ఒక్కరికీ షేక్‌హ్యాండ్ ఇస్తూ చిరునవ్వుతో పలకరించారాయన.
Delhi: Congress MP Shashi Tharoor reaches the Congress headquarters for the CWC meeting pic.twitter.com/AT3XlczxIG
— IANS (@ians_india) December 27, 2025
గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక లైన్ అంశాలపై మాట్లాడుతున్న ఆయన.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన కీలక భేటీ సహా మూడు సమావేశాలకు డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ గౌరవార్థం కేంద్రం రాష్ట్రపతి భవన్‌లో ఇచ్చిన విందులో థరూర్ పాల్గొని కాంగ్రెస్ సీనియర్లతోనే విమర్శలు ఎదుర్కొన్నారు.
సోనియా, రాహుల్‌తో రేవంత్ భేటీ
ఇటు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ, అటు ఏపీ నుంచి సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజులు హాజరయ్యారు. సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో రేవంత్ కాసేపు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.


