సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం ఖర్చు చేసే రూపాయిలో.. ప్రజలకు చేరేది కేవలం 15 పైసలు మాత్రమే. మధ్యలో అవినీతి, పరిపాలనా ఖర్చులే అందుకు కారణాలుగా ఉన్నాయ్.. ఈ మాట ఒకప్పడు ప్రధాని హోదాలో రాజీవ్ గాంధీ చేసింది. తరువాతి దశాబ్దాల్లో, సంక్షేమ పథకాలలో లీకేజీలను తగ్గించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. అయితే ఇన్నేళ్లు గడిచాక డిజిటల్ విప్లవం కారణంలో ఆ పరిస్థితిలో క్రమక్రమంగా మార్పు కనిపిస్తోంది.
తప్పుడు క్లెయిమ్స్, ప్రజా సంక్షేమ పథకాలలో అవినీతి.. అర్హత లేని లబ్ధిదారులు అనేవి ఇందులో ప్రదానంగా సమస్యలు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1–3 ట్రిలియన్ డాలర్ల వరకు ఆ నష్టం జరుగుతోంది. అయితే.. దీనిని తగ్గించడానికి భారత్ సహా అనే దేశాలు ఏఐ, డిజిటల్ ఐడెంటిటీ, ప్రాసెస్ రీడిజైన్ వంటి పద్ధతులను పాటిస్తూ మెరుగైన ఫలితాలు రాబట్టుకోలుగుతున్నాయి.
ఆయా దేశాల్లో..
ఈ ఏడాది బీసీజీ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. యూఎస్ మెడికెయిడ్(అమెరికా ఫెడరల్ ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం) ఏఐని ఉపయోగించి తప్పుడు క్లెయిమ్స్‌ను తప్పించుకుని 1 శాతం ఖర్చు.. అంటే దాదాపు 9 బిలియన్ డాలర్ల దాకా ఆదా చేసుకోగలిగింది. ఆసియా-ఫసిఫిక్ రీజియన్లలో డాక్టర్లు పేషెంట్లకు అత్యధికంగా యాంటీబయటిక్స్‌ను సూచించిన విషయాన్ని డాటా బేస్ ఆధారంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం గుర్తించింది. ఆ వెంటనే వైద్యులను కంపేరిజన్ లేఖల ద్వారా అప్రమత్తం చేసింది. దీంతో ఒక ఏడాదిలోనే అలాంటి ప్రిస్క్రిప్షన్‌లలో 12 శాతం తగ్గుదల కనిపించింది.
సింగపూర్‌లో ప్రజా సంక్షేమ పథకాల కోసం ఏఐ ఆధారిత వర్చువల్ అసిస్టెంట్ (చాట్‌బాట్/డిజిటల్ సహాయకుడు) ప్రవేశపెట్టారు. దీంతో కాల్ సెంటర్లకు కాకుండా.. ప్రజలు ఏఐ అసిస్టెంట్ ద్వారా నేరుగా సమాధానాలు పొందగలిగారు. ఈ ప్రభావంతో ఫోన్ కాల్స్ సంఖ్య 50 శాతానికి తగ్గింది. ప్రభుత్వానికి ఖర్చు తగ్గడంతో పాటు ప్రజలకు సమాచారం అందడం సులభతరం అయింది.
కెనడా రెవెన్యూ ఏజెన్సీ.. ఏఐను ఉపయోగిస్తూ ట్యాక్స్ మోసాలకు చెక్ పెడుతోంది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో డిపార్ట్‌మెంట్ ఫర్ వర్క్ అండ్ పెన్షన్స్(DWP) డేటా ఆధారిత ప్లాట్‌ఫారమ్‌ను అందుబాటులోకి తెచ్చుకుంది. ఈ డాటా ద్వారా తప్పుగా జరిగే చెల్లింపులను (overpayments) తగ్గించుకుని.. ఈ ఒక్క ఏడాదిలోనే 500 మిలియన్ పౌండ్ల (సుమారు రూ.5,000 కోట్లకు పైగా) నష్టం జరగకుండా చూసుకుంది.
మరి భారత్ విషయానికొస్తే..
భారత్‌లో సంక్షేమ పథకాల లభ్ధిదారుల సంఖ్యలో తగ్గుదల కనిపించడం లేదు. అయితే వీటిల్లో లీకేజీలని తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నాలు మాత్రం సత్పలితాలనే ఇస్తున్నాయి. భారత్‌లో బయోమెట్రిక్, ఆధార్ తరహా డిజిటల్ ఫస్ట్ ఐడీ.. వాటి అనుసంధానాలతో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఈ డిజిటల్ చెల్లింపుల సంస్కరణలతో ఈ ఏడాది సంక్షేమ పథకాల కోసం వెచ్చిస్తున్న ధనంలో దాదాపు 13% లీకేజీలు తగ్గాయని బీసీజీ నివేదిక ఇచ్చింది. అంటే.. అప్పటిదాకా వెళ్ళిన నిధుల్లో కొంత అర్హత లేని/నకిలీ లబ్ధిదారులకు వెళ్ళిందని సూచించినట్లే కదా.
జగన్ మోడల్ కలిస్తే..
ప్రజా సంక్షేమంలో భారత్ పూర్తిస్తాయి లీకేజీలను అరికట్టాలంటే .. గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటించిన డీబీటీ వ్యవస్థ(Direct Benefit Transfer) కచ్చితంగా అవసరమనే చర్చ నడుస్తోంది. అందుకు సహేతుకమైన కారణాలను వివరిస్తున్నారు. డీబీటీ మన దేశానికి కొత్తది కాదు. ఇది 2013లోనే ప్రారంభమైంది. అయితే ఇన్నేళ్ల కాలంలో సంపూర్ణంగా.. అదీ సమర్థవంతంగా అమలు చేసింది మాత్రం ఒక్క జగన్ ప్రభుత్వమే!.
2019లో వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని సంక్షేమ పథకాలను (అమ్మ ఒడి, రైతు భరోసా.. ఇలా పథకాలెన్నో) వంద శాతం డీబీటీ ఆధారంగా మార్చింది. ఆధార్ అనుసంధానం(తప్పనిసరి), బయోమెట్రిక్ ధృవీకరణలకు బ్యాంక్ ఖాతా లింక్ తప్పనిసరి చేసింది. తద్వారా నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరేలా చేసింది. అలా.. జగన్ స్వయంగా బటన్ నొక్కడం ద్వారా ఐదేళ్ల కాలంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేసిన నగదు.. అక్షరాల రూ.2.70 లక్షల కోట్లు.
వైఎస్సార్‌సీపీ హయాంలో మధ్యవర్తుల అవసరం లేకుండా పోయింది. లంచాల రూపంలో అవినీతికి ఆస్కారం కనిపించలేదు. నేరుగా అర్హత ఉన్నవాళ్ల ఖాతాల్లోకే వెళ్తున్నందునా.. ఒక్క పైసా కోత పడేది కాదు. ఆఖరికి కరోనా టైంలోనూ డీబీటీ ద్వారానే సంక్షేమం అందించడం ఇక్కడ మరో రికార్డు. కాబట్టి.. జగన్ డీబీటీ మోడల్‌ను అనుసరిస్తూనే ఏఐ, బయోమెట్రిక్ ఆధారిత వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తే ప్రజా సంక్షేమంలో లీకేజీలను తగ్గించి ప్రతీ రూపాయి కూడా అర్హులైన వారికి చేరగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


