నూతన ఆవిష్కర్తలు, వ్యవస్థాపకలకు తోడ్పాటును అందిస్తూ
మహబూబ్‌నగర్,సాక్షి:రాష్ట్ర అంకుర వ్యవస్థను జిల్లాల్లోని ఔత్సాహిక ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులకు మరింత అందుబాటులోకి తీసుకువెళ్లే పనిలో భాగంగా తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ (TGIC) శనివారం (20 డిసెంబరు, 2025) మహబూబ్‌నగర్‌లోని ఐటీ టవర్ వేదికగా ‘ఇన్నోవేషన్ పంచాయత్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. వనపర్తి, గద్వాల్, నారాయణపేట్, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల నుండి 250 మందికి పైగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు మరియు గ్రామీణ ఆవిష్కర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, TGIC సీఈఓ మెరాజ్ ఫహీమ్, వారి బృందం కూడా పాల్గొన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు ఈ సదస్సులో పాల్గొన్నారు. నిధుల సేకరణ (Funding), వ్యాపార విస్తరణ మరియు మార్కెటింగ్ మెళకువలకు సంబంధించి తమకున్న సందేహాలను నిపుణులతో చర్చించి నివృత్తి చేసుకున్నారు.

ఒక సాధారణ 'వాక్-ఇన్' (Walk-in) ప్లాట్‌ఫామ్‌గా రూపొందించబడిన ఈ వేదికపై, ఆవిష్కర్తలు తమ ప్రోటోటైప్‌లను ప్రదర్శించారు. తెలంగాణ అంకుర వ్యవస్థ నుండి 12 మంది మెంటార్లతో వ్యవసాయ, ఆరోగ్య, లైవ్లీహుడ్ రంగాల్లో వారి ఆలోచనలను పరిశీలించి, తగిన సూచనలు మరియు సలహాలను అందించారు. మంచి ఆలోచనలు ఉన్నవారు హైదరాబాద్‌కు దూరంగా ఉన్నామనే కారణంతో వెనుకబడకూడదన్నదే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. క్షేత్రస్థాయిలో మార్గదర్శకత్వం అందించడం మరియు ప్రభుత్వ సహకారాన్ని నేరుగా అందించడం ద్వారా రాష్ట్రంలోని ప్రతి మూలకు స్టార్టప్ సంస్కృతిని తీసుకెళ్లాలని TGIC లక్ష్యంగా పెట్టుకుంది.

"ప్రోటోటైపింగ్, మార్కెట్ యాక్సెస్ మరియు ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులకు... ఇబ్బందులను తొలగించి మీ విజయానికి కావాల్సిన సాంకేతిక మరియు వ్యూహాత్మక సహకారాన్ని అందించడానికి TGIC సిద్ధంగా ఉందని మహబూబ్‌నగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, IAS తెలిపారు. ఇక్కడ ఉన్న వారందరికీ ఇది ఒక గొప్ప అవకాశమని, ఈ వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఆయన సూచించారు. మీకున్న సందేహాలన్నింటినీ అడిగి తెలుసుకుని, తదుపరి కార్యాచరణపై స్పష్టత తెచ్చుకోమని సూచించారు.

తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ సీఈఓ మెరాజ్ ఫహీమ్ మాట్లాడుతూ'ఇన్నోవేషన్ పంచాయత్' ద్వారా మేము జిల్లాల్లోకి వెళ్లి, మంచి ఆలోచనలు, ఆవిష్కరణలు ఉన్న ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు లభించేలా చూస్తున్నామన్నారు.. వ్యవసాయ రంగంలో కొత్త పరికరాల నుండి పర్యావరణహిత ఇంధన వనరుల వరకు విభిన్నమైన ఆలోచనలను ఆవిష్కర్తలు ప్రదర్శించారు.


