విద్య, నైపుణ్యం, ఉపాధికి పెద్ద పీట
ఈ దిశగానే తెలంగాణ విద్యా విధానం
జేఎన్‌టీయూహెచ్ సమస్యలను పరిష్కరిస్తాం
యూనివర్సిటీ డైమండ్ జూబ్లీ సభలో డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి, హైదరాబాద్: సరికొత్త ఆవిష్కరణలతో తెలంగాణ తన సత్తా చాటాల్సిన సమయం వచ్చిందని, స్టార్టప్ కేంద్రంగా ప్రపంచ పటంలో నిలబడాల్సిన అవసరముందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర విద్యా విధానాన్ని సమూలంగా మారుస్తున్నామని, తెలంగాణ రైజింగ్–2047 డాక్యుమెంట్‌లో విద్య, నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.
జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయ డైమండ్ జూబ్లీ వేడుకలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన భట్టి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. యువతఉద్యోగాలు వెతుక్కునే వారుగా కాకుండా, వాటిని సృష్టించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యకు వెచి్చంచే మొత్తాన్ని ఖర్చుగా కాకుండా, భవిష్యత్‌పై పెట్టుబడిగా ప్రభుత్వం భావిస్తోందన్నారు.
జేఎన్‌టీయూ ప్రతిష్టను పెంచుతాం
పండిట్ జవహర్‌లాల్ పేరు మీదున్న జేఎన్‌టీయూహెచ్ దేశ పురోగతికి ఇంజన్ కావాలని భట్టి కోరారు. కాలేజీగా మొదలై, యూనివర్సిటీ స్థాయికి ఎదగడమే కాకుండా, దేశానికి ఎంతోమంది గొప్ప వ్యక్తులను అందించిందన్నారు. నిజాయితీతో ప్రవేశ పరీక్షలు, అనుబంధ కాలేజీలకు నైతిక మార్గనిర్దేశం, రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ హబ్‌గా మార్చే ప్రభుత్వ లక్ష్యానికి అపూర్వ సహకారం అందిస్తోందన్నారు.
యూనివర్సిటీ ప్రతిష్టను మరింత పెంచుతామని భరోసా ఇచ్చారు. వర్సిటీ భూమి లీజు సమస్య, లీజ్ అద్దె, ఆస్తి పన్ను మినహాయింపు వంటి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. మౌలిక వసతుల కల్పనకు రూ.800 కోట్లు ఇచ్చే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు.
విద్యారంగం పునర్‌నిర్మాణం
తెలంగాణ విద్యారంగాన్ని పునర్ నిర్మించే ప్రక్రియ మొదలైందని భట్టి తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో సాంకేతిక విద్యను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. ప్రపంచం వేగంగా మారుతోందని, పరిశ్రమకు నైపుణ్యవంతులైన యువత అవసరం పెరిగిందన్నారు.ఈ దిశగా ఇంజనీర్లను తయారు చేసేందుకు బోధన ప్రణాళికలో మార్పులు తెస్తున్నామని చెప్పారు. పరిశ్రమల భాగస్వామ్యంతో మల్టీ డిసిప్లేనరీ అభ్యాసాన్ని బలోపేతం చేస్తున్నామన్నారు.
విద్యార్థులు వ్యసనం బాట పట్టొద్దు
విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, పుస్తకాలు, ల్యాబ్‌లు, మెంటర్‌లు, అవకాశాలకు దగ్గరగా ఉండాలని భట్టి సూచించారు. చదివే సమయం కన్నా, మొబైల్ స్క్రీన్ చూసే సమయం ఎక్కువైతే డిగ్రీ ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇంజనీరింగ్‌లో సమయాన్ని సెమిస్టర్లలో కొలుస్తారని, ఒత్తిడిని బ్యాక్‌లాగ్‌లలో కొలుస్తారు అని ఆయన ఉదహరించారు.
2027 నాటికి భారతదేశంలో వెయ్యికిపైగా యూనికోర్న్ స్టార్టప్స్ రాబోతున్నాయని, తెలంగాణ ఇందులో ముందుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, జేఎనీ్టయూ వీసీ ప్రొఫెసర్ కిషన్‌కుమార్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ సావనీర్‌ను భట్టి ఆవిష్కరించారు.


