సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. తెలంగాణ శాసనసభలో మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 2019 మున్సిపల్ చట్టంలో కీలక మార్పు చేస్తూ బిల్లుకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఓటర్ల జాబితా సవరణకు 60 రోజుల ముందే సమాచారం ఇవ్వాలన్న నిబంధన తొలగించారు.
దీంతో భారత ఎన్నికల సంఘానికి ముందస్తు సమాచారం అవసరం ఇక లేదు. ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ప్రారంభం కాగా, ఈ నెల 10న తుది ఓటర్ల జాబితా విడుదల కానుంది. చట్ట సవరణతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగవంతం కానుంది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి పూర్తి వెసులుబాటు వచ్చింది.
కాగా, మున్సిపల్ ఎన్నికల దిశలో అడుగులు వడివడిగా పడుతున్నాయి. ఈ నెలలోనే ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలని, ఫిబ్రవరిలో ఈ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంక్రాంతికి ముందు లేదంటే ఆ తర్వాత కచ్చితంగా షెడ్యూల్ ప్రకటించి ఆ వెనువెంటనే నోటిఫికేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ నెల 11న లేదంటే 20న షెడ్యూల్ ప్రకటించే అవకాశా లున్నాయి. ఫిబ్రవరి రెండు లేదా మూడో వారంలోగా ఎన్నికల తతంగాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించింది.


