సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక వేత్తల భూములను.. ప్రభుత్వ భూములని ప్రచారం చేస్తున్నారని.. అవి ప్రభుత్వ భూములు కావు.. పరిశ్రమలకు అమ్మిన భూములు అంటూ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టత నిచ్చారు. తెలంగాణ అసెంబ్లీలో హిల్ట్ పాలసీపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన వాతావరణం ఇవ్వాలన్నదే తమ ఆలోచన అని.. పర్యావరణం బాగుచేయాలనే ఆలోచనతోనే హిల్ట్ పాలసీ తీసుకువచ్చినట్లు తెలిపారు.
‘‘హిల్ట్ పాలసీ కింద ఆరు నెలల గడువు ఇస్తాం. స్వచ్ఛందంగా ముందుకొస్తేనే భూములు కన్వర్ట్ చేస్తాం. పాలసీ గురించి అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. దశాబ్ధాల కిందటే గత ప్రభుత్వాలు వారికి భూములు అమ్మేశాయి. రాజకీయాల పక్కనపెట్టి ఆలోచించాలి’’ అని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. స్వచ్ఛమైన గాలి, నీరు ఇవ్వలేని నాగరికత అసమర్థ నాగరికతే.. అభివృద్ధి పేరిట పర్యావరణ విధ్వంసం జరుగుతోందని శ్రీధర్‌బాబు హెచ్చరించారు.
‘‘డెవలప్‌మెంట్ అంటే ప్రకృతిని నాశనం చేయడం కాదు. పిల్లలకు ఆస్తులు కాదు.. క్లీన్ ఎన్విరాన్‌మెంట్ నిజమైన వారసత్వం. బంగారు గిన్నెలో విషం పెట్టినట్లవుతోంది మన పరిస్థితి. ప్రకృతి నాశనమైతే తిరిగి రాదు. మనమంతా భూమి యజమానులు కాదు. కేవలం ట్రస్టీలమే. ఫ్యూచర్ జనరేషన్లకు క్లీన్ ఎన్విరాన్‌మెంట్ ఇవ్వడం మన బాధ్యత. ఇది కేవలం ల్యాండ్ యూజ్ మార్పు కాదు. ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో చారిత్రక నిర్ణయం తీసుకున్నాం. పిల్లల భవిష్యత్తు కోసం హిల్ట్ పాలసీ తీసుకొచ్చాం.
..ఓఆర్ఆర్ లోపల పరిశ్రమలు.. ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం. ఫ్యాక్టరీ గోడ పక్కనే ఇళ్లు.. ఇది సైంటిఫిక్ డిజాస్టర్. 1970లలో నగరం బయట పరిశ్రమలు.. నేడు నడిబొడ్డు ప్రాంతాలు బాలానగర్, సనత్‌నగర్, ఉప్పల్ ఇప్పుడు రెసిడెన్షియల్ జోన్లు. పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలికి తరలించడమే లక్ష్యం. పిల్లలకు స్వచ్ఛమైన గాలి, నీరు ఇవ్వడమే ప్రభుత్వ సంకల్పం. హిల్ట్‌పై కావాలనే తప్పుడు ప్రచారం జరుగుతోంది. మతలబు ఉందంటూ విమర్శలు బాధాకరం. తెలంగాణ నుంచే పర్యావరణ రక్షణకు చారిత్రక అడుగు.. మార్పు ఎప్పుడో కాదు.. ఇప్పుడే’’ అంటూ శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు.


