నంద్యాల, అనంతపురం జిల్లాల్లో విషాదం
శెట్టూరు/కొత్తపల్లి: ఎంతో కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం.. చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవసాయానికి భరోసా కరువవ్వడం.. రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో మానసిక వేదనకు గురైన ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం ఎదురుపాడుకు చెందిన బందెపు వెంకటేశ్వర్లు(36) సొంత పొలం 3.50 ఎకరాలతో పాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగు చేశాడు. పెట్టుబడి కింద రూ.5 లక్షలు ఖర్చు చేశాడు. కానీ అధిక వర్షాలతో పంట పూర్తిగా దెబ్బతింది.
ప్రభుత్వం నుంచి సాయం కూడా లేకపోవడం.. పెట్టిన పెట్టుబడి కూడా రాదని అర్థమవ్వడంతో వెంకటేశ్వర్లు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు పెరగడంతో ఈ నెల 18న పొలం వద్ద పురుగు మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై రామ్‌నాయక్ చెప్పారు.
బోర్లు, సాగు కోసం అప్పులపాలు..
అనంతపురం జిల్లా కరిడిపల్లికి చెందిన రైతు కమ్మ చౌదరి(40)కి భార్య అనిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చౌదరి తనకున్న మూడెకరాల పొలంలో బోర్లు వేయడానికి, పంటల సాగు కోసం దాదాపు రూ.10 లక్షల వరకు అప్పు చేశాడు. వాటిని ఎలా తీర్చాలోనని నిత్యం ఆవేదన చెందేవాడు. శనివారం రాత్రి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో పురుగు మందు తాగాడు. కాసేపటికి ఇంటికి వచ్చిన కుటుంబసభ్యులు అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ని గమనించి కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఆయన
మృతి చెందాడు.


