సచివాలయాలకు ఆదేశాలు జారీ చేసిన మున్సిపల్ కమిషనర్లు
సాక్షి, అమరావతి: సంక్రాంతి పండుగ నేపథ్యంలో వరుసగా ఐదు రోజులు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు వచ్చినప్పటికీ.. సచివాలయాలు మాత్రం పనిచేయాల్సిందేనని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు పలు జిల్లాల్లో మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలోని వార్డు సచివాలయాల అడ్మిన్ సెక్రటరీలకు లిఖితపూర్వక, మౌఖిక ఆదేశాలిచ్చారు.
సంక్రాంతి పండుగ రోజులతో పాటు శని, ఆదివారాల్లో సచివాలయంలో ఎవరైనా ఒక ఉద్యోగి తప్పనిసరిగా ఉండేలా విధులు కేటాయించాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, సెలవు రోజుల్లో పనిచేసే ఉద్యోగులకు.. ఇతర పనిదినాల్లో తిరిగి సెలవు తీసుకునే వెసులుబాటు కలి్పంచకపోవడాన్ని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ సంఘాలు తప్పుపడుతున్నాయి.


