గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టండి అని చెప్పే రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి.. తాజాగా ఇల్లు కొనుగోలు చేయాలంటే ఏం చేయాలి?, ఎలా కొనుగోలు చేయాలంటే ఏం చేయాలి?, అనే విషయాలను వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో చూసేద్దాం.
రియల్ ఎస్టేట్ ధరలు పెరగడం వల్ల.. ఇళ్ల ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. ధరలు భారీగా పెరిగిపోవడంతో ఇల్లు కొనడం అనేది ఒక సవాలుగా మారిపోయింది. ఈ సమయంలో ఇల్లు కొనాలంటే అప్పు చేసి (బ్యాంక్ లోన్) కొనమంటున్నారు కియోసాకి. పర్సనల్ ఫైనాన్స్ యూట్యూబర్ శరణ్ హెగ్డేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇల్లు కొనడంలో తప్పు లేదు. కానీ జీతంతో, లేదా మీరు చేసిన పొదుపుతో ఇల్లు కొనాలని చూస్తే మాత్రం అప్పులపాలైపోతారని కియోసాకి పేర్కొన్నారు. లోన్ తీసుకుని ఇల్లు కొనుగోలు చేసి.. దానిని అద్దెకు ఇవ్వడం ద్వారా డబ్బు సంపాదించాలి. ఆలా వచ్చిన డబ్బు ద్వారా లోన్ చెల్లించాలి. ఇలా చేస్తూ ఉంటే.. చివరికి ఇల్లు మీ సొంతం అవుతుందని ఆయన చెబుతారు. ఇక్కడ మీ చేతి నుంచి చెల్లించిన డబ్బు ఏమీ ఉండదు. అయితే చివరికి ఆస్తి మీదవుతుంది. ఈ విషయంలో తెలివిగా వ్యవహరించాలని కియోసాకి చెబుతారు.
తనకు చాలా ఇల్లు ఉన్నట్లు కియోసాకి ఇంటర్వ్యూలో కియోసాకి పేర్కొన్నారు. ఆ ఇళ్లను అద్దెకు ఇచ్చి డబ్బు సంపాదిస్తాను అని కూడా ఆయన వెల్లడించారు. 2025 రెండవ త్రైమాసికంలో USలో సగటు ఇంటి ధర 4,10,800 డాలర్లు అని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ సెయింట్ లూయిస్ తెలిపిందని కియోసాకి వివరించారు.
డబ్బు మీ కోసం పనిచేయాలి
రాబర్ట్ కియోసాకి తన ఆర్ధిక సూత్రాలలో కూడా డబ్బు కోసం మీరు పనిచేయకండి, డబ్బు మీ కోసం పనిచేసేలా చేయండి అని చెబుతారు. ఉదాహరణకు ఒక ఉద్యోగం చేస్తారు, జీతం వస్తుంది, నెలవారీ బిల్లులు చెల్లిస్తారు. మిగిలిన డబ్బు ఖర్చు చేస్తారు. ఇదే జీవితాంతం కొనసాగుతుంది. ఇదే డబ్బు కోసం పనిచేయడం అన్నమాట.
ఇదీ చదవండి: ఇప్పుడు కొనండి, అప్పుడు అమ్మండి: కియోసాకి
డబ్బు మీ కోసం పనిచేయడం అంటే.. ఒక ఇల్లు కొంటారు, దాన్ని అద్దెకు ఇస్తారు. మీకు ప్రతి నెలా డబ్బు వస్తుంది. మీరు షేర్లలో పెట్టుబడి పెడితే, కంపెనీ లాభాల్లో భాగంగా డివిడెండ్ వస్తుంది. ఏదైనా వ్యాపారం ఉంటే.. మీరు పని చేయకపోయినా వ్యాపారమే మీకు డబ్బు సంపాదిస్తుంది. ఇంకా చెప్పాలంటే.. మీరు ఒక బుక్ రాశినా, సాఫ్ట్‌వేర్ రూపొందించినా, మ్యూజిక్ క్రియేట్ చేసినా అవి అమ్ముడవుతాయి. తద్వారా మీకు డబ్బు వస్తుంది.


