బెంగళూరు: గత కొన్ని రోజులుగా కర్ణాటకలో కొనసాగుతున్న సీఎం మార్పు సంక్షోభానికి తెరపడినట్లే కనబడుతోంది. సిద్ధరామయ్యనే మిగతా రెండున్నరేళ్లు కొనసాగాలని హైకమాండ్ చెప్పిందని ఆయన తనయుడు, ఎమ్మెల్సీ యతీంద్ర సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఈరోజు(గురువారం, డిసెంబర్ 11వ తేదీ) యతీంద్ర మాట్లాడుతూ.. ‘ ఇది క్లియర్. మిగతా రెండున్నరేళ్లు మా నాన్నే సీఎంగా కొనసాగుతార. కాంగ్రెస్ అధిష్టానం ఇదే విషయాన్ని చెప్పింది.
ఇక నాయకత్వ మార్పు ప్రశ్నే ఉండదు. ఫలితంగా సీఎం మార్పు వివాదానికి తెరపడింది’ అని పేర్కొన్నారు. ఇక గత సోమవారం సీఎం సిద్ధరామయ్య ఇదే అంశంపై మాట్లాడుతూ.. హైకమాండ్ ఎలా చెబితే అలా అని వ్యాఖ్యానించారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. ఇదే విషయంపై తనతో పాటు డీకే శివకుమార్ కూడా అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తారన్నారు.
కర్ణాటక సీఎం మార్పు అంశానికి సంబంధించి ట్విస్ట్‌లు మీద ట్విస్ట్‌లు చోట చేసుకున్నాయి. సిద్ధరామయ్య-డీకే శివకుమార్‌ల మధ్య మాటల వివాదం మొదలుకొని రెండు బ్రేక్ ఫాస్ట్‌ల ఎపిసోడ్‌ల వరకూ వెళ్లింది. కర్ణాటక సీఎం పదవిని సిద్ధరామయ్య గతంలో చేపట్టే క్రమంలో ఒప్పందం జరిగిన నేపథ్యంలో డీకే శివకుమార్ తనకు సీఎం పదవి ఇవ్వాలని పట్టుబట్టారు., అయితే సిద్ధరామయ్య ఈ రెండున్నరేళ్లు తనకే ఉంచాలని డీకేతో పాటు అధిష్టానాన్ని కూడా కోరారు. ఇలా వారి మధ్య పంచాయతీ నడుస్తూ వచ్చింది. ఆ సమయంలో కూడా ఇరువురి అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు. అయితే యతీంద్ర వ్యాఖ్యలతో ఒక క్లారిటీ వచ్చినట్లుంది కానీ, సిద్ధరామయ్య, డీకేలే దీనిపై సృష్టత ఇస్తే దీనికి తెరపడినట్లు అవుతుంది.


