13 మంది దుర్మరణం
43 మందికి గాయాలు
రహదారిపై ఒకదాని వెంట మరొకటి ఢీకొన్న పలు వాహనాలు
మంటలు చెలరేగి దగ్ధమైన పలు వాహనాలు
కాలిపోయిన వాహనాల శిథిలాల కుప్పగా మారిన యమునా ఎక్స్‌ప్రెస్‌వే రహదారి
ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాలో దారుణ రోడ్డు ప్రమాదం
మథుర: చిమ్మచీకట్లో శీతాకాలపు పొగమంచు ఉత్తరాదిన పలువురికి యమపాశంగా మారింది. యమునా ఎక్స్‌ప్రెస్‌వే రహదారిపై దట్టంగా అలుముకున్న పొగమంచు 13 మంది ప్రయాణికుల ప్రాణాలను అనంతలోకాల్లో కలిపేసింది. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ముందుఏముందో కనపడనంతగా విపరీతంగా ఉన్న పొగమంచు కారణంగా ఆగ్రా–నోయిడా పరిధిలో రహదారిపై ఎనిమిది బస్సులు, మూడు చిన్న వాహనాలు ఒకదానికి వెంట మరోటి ఢీకొని ధ్వంసమయ్యాయి. వీటిల్లో చిక్కుకుపోయి రక్తమోడుతూ 13 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
43 మంది క్షతగాత్రులను హుటాహుటిన ఆగ్రాలోని ఎస్‌ఎన్ వైద్య బోధనాస్పత్రి, బృందావన్, ఢిల్లీ ఆస్పత్రుల్లో చేర్పించామని మథుర సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్లోక్ కుమార్ చెప్పారు. అయితే 60 మందికిపైగా గాయపడినట్లు జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. స్వల్ప గాయాలైన ప్రయాణికులను యూపీ ప్రభుత్వ వాహనాల్లో తమతమ గమ్యస్థానాలకు చేర్చారు. ఉత్తరప్రదేశ్‌లోని బల్‌దేవ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రహదారిపై 127 నంబర్ మైలురాయి వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
వరుసబెట్టి ఢీ.. వెనువెంటనే చెలరేగిన మంటలు
క్షతగాత్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం పూట తొలుత ఒక బస్సును మరో వాహనం మాత్రమే ఒకదానివెనుక మరోటి ఢీకొన్నాయి. వాటిలోని ప్రయాణికులు గాయపడ్డారు. వాళ్లు ప్రమాదం షాక్ నుంచి తేరుకుని కిందకు దిగి తర్వాత అటుగా వచ్చే వాహనాలను అప్రమత్తం చేసేలోపే వెనకనుంచి మరికొన్ని వాహనాలు అతివేగంతో ఢీకొట్టాయి. ‘‘కొన్ని వాహనాల డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తూ పక్కకు పోనిద్దామని చూసినా అప్పటికే గాయపడిన ఇతరవాహన ప్రయాణికులు రోడ్డుకు అడ్డంగా నిలబడటంతో మరోదారిలేక వీటినే గుద్దేశారు.
ఘటనాస్థలికి నేను వెళ్లిచూసేసరికి అక్కడ దృగ్గోచరత(విజిబిలిటీ) కేవలం మీటర్ మాత్రమే. అంతకుమించి దూరంలో ఏముందో కనిపించనంతా పొగమంచు అలుముకుంది’’అని ఎస్పీ శ్లోక్ కుమార్ వెల్లడించారు. ఇలా మొత్తం ఎనిమిది బస్సులు, కార్లు, వాహనాలు ఢీకొని తుక్కుతుక్కయ్యాయి. దీంతో ఇంధన ట్యాంక్‌లు బద్దలై మంటలు చెలరేగాయి. నుజ్జునుజ్జయిన వాహనాల్లో కొందరు, అగ్నికీలల కారణంగా తీవ్రంగా కాలిన గాయాలతో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.
వరుసబెట్టి బస్సులు, కార్లు తగలబడుతున్న వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కాలిపోయిన వాహనాలు కుప్పగా రహదారిపై అడ్డుగా ఉండటంతో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. విషయం తెల్సుకున్న అగ్నిమాపక సిబ్బంది, మథుర జిల్లా పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనాలను క్రేన్లతో పక్కకు తీసుకొచ్చారు. మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు.
అంతటా భీతావహస్థితి..
చిమ్మచీకటి, చలిలో వాహనాల్లో తమతమ సీట్లలో మఫ్లర్లు ధరించి, బెడ్‌షీట్లు కప్పుకుని ముసుగుతన్ని నిద్రపోతున్న పలువురు అగ్నికీలల్లో కాలి బూడిదయ్యారు. కొందరు శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయి మాంసపుముద్దలుగా మారిపోయారు. వాహనాల నుంచి ఎగసిపడుతున్న అగ్నికీలలు, దట్టమైన పొగ, బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా భీతావహకంగా మారింది. వేగంగా వాహనాలు ఢీకొన్న శబ్దం సుదూరంలోని తమకూ వినిపించిందని సమీప గ్రామాల ప్రజలు చెప్పారు. మృతదేహాల నుంచి డీఎన్‌ఏ శాంపిళ్లను సేకరించి కుటుంబసభ్యులు, బంధువుల డీఎన్‌ఏతో పోల్చిచూశాక పార్థివదేహాలను పోలీసులు అప్పగించనున్నారు.
ఇప్పటికే 17 మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం తరలించారు. డీఎన్‌ఏ ప్రక్రియ కోసం రెండు వైద్య బృందాలను నియమించామని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాధా వల్లభ్ చెప్పారు. కొందరు మృతుల జాడ గుర్తించారు. వాళ్ల అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మథుర జిల్లా మేజి్రస్టేట్ చంద్ర ప్రకాశ్ సింగ్ చెప్పారు. దుర్ఘటనపై అదనపు జిల్లా మేజిస్ట్రేట్ సారథ్యంలో నలుగురు సభ్యులతో మేజి్రస్టియల్ విచారణకు ఆదేశించారు. రెండ్రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఘటనపై ఒక అనామక డ్రైవర్‌పై తొలుత ఒక కేసు నమోదుచేసి నేరదర్యాప్తు ఆరంభించారు.
పిల్లలను బయటకు విసిరేసి..
బలంగా ఢీకొనడంతో నుజ్జునుజ్జయిన వాహనాలకు హఠాత్తుగా మంటలంటుకోవడంతో అందులోని ప్రయాణికులు తమ చిన్నారులను కాపాడేందుకు శతథా ప్రయత్నించారు. పార్వతి అనే 42 ఏళ్ల మహిళ తన ఇద్దరు చిన్నారులు ప్రాచీ, సన్నీలను వెంటనే బస్సు నుంచి బయటకు విసిరేశారు. కానీ బద్దలైన బస్సు కిటికీ అద్దాలు ఆమె మెడకు గుచ్చుకోవడంతో రక్తమోడుతూ లోపలికి పడిపోయారు. ‘‘పిల్లల్ని విసిరేశాక ఆమెను నేను చూడలేదు. ఆమెకు ఏమైందో ఎక్కడుందో అర్ధంకావట్లేదు’’అని ఆమె సమీప బంధువు గుల్జారీ ఏడుస్తూ చెప్పారు. ‘‘క్షతగాత్రులను చేర్పించిన ఆస్పత్రుల చుట్టూ ఆమె జాడ కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా. ఆమె ఎక్కడా కన్పించట్లేదు’’అని గుల్జారీ రోదిస్తూ చెప్పారు.
దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ప్రధాని
ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షలను ప్రధానమంత్రి అత్యవసర నిధి నుంచి కేటాయించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ‘‘ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరం. మృతులు, గాయపడిన వారి కుటుంబాలకు అండగా ఉంటాం’’అని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షల ఎక్స్‌గ్రేíÙయా, క్షతగాత్రులకు తలో రూ.50,000 ఆర్థికసాయం ప్రకటించారు.


