కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
విద్యాభివృద్ధి రుణాలకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి నుంచి మినహాయింపు ఇవ్వండి
విద్యారంగం సమగ్రాభివృద్ధికి రూ. 30 వేల కోట్లు వెచ్చిస్తున్నట్టు వెల్లడి
విద్యపై చేస్తున్న వ్యయాన్ని అభివృద్ధికి చేస్తున్న పెట్టుబడిగా భావించాలని వినతి
రేవంత్ విద్యారంగంపై పెడుతున్న శ్రద్ధకు కేంద్ర మంత్రి ప్రశంసలు
రాష్ట్రానికి ఐఐఎం మంజూరు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రిని కోరిన సీఎం
నవోదయ, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుపై నివేదన
సోనియాతోనూ భేటీ..
రైజింగ్ విజన్ డాక్యుమెంట్ అందజేత
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ విద్యారంగ అభివృద్ధికి తాము తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో విద్యారంగం సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం రూ.30 వేల కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు.
ఈ నిధుల సమీకరణకు తాము ప్రత్యేక ప్రయోజన సంస్థ (ఎస్‌పీసీ)ను ఏర్పాటు చేయనున్నామని, దాని ద్వారా సేకరించే రుణాలకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు.
నిర్మలా సీతారామన్‌తో పార్లమెంట్ ఆవరణలోని ఆమె చాంబర్‌లో రేవంత్‌రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 105 శాసనసభ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ప్రాధాన్యతను రేవంత్ వివరించారు. ‘5 నుంచి 12 తరగతుల వరకు ఉండే ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్లో 2,560 మంది విద్యార్థులు ఉంటారు.
మొత్తం 105 పాఠశాలల్లో 2.70 లక్షల మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా నాణ్యమైన విద్యాబోధన లభిస్తుంది. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు సమీప ప్రభుత్వ పాఠశాలలకు విద్యాహబ్‌లుగా ఉండటంతో పరోక్షంగా లక్షలాది మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది.
అత్యాధునిక వసతులు, లే»ొరేటరీలు, స్టేడియాలతో నిర్మించే ఈ 105 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రూ.21 వేల కోట్ల వ్యయమవుతుంది. అలాగే, రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ, సాంకేతిక కళాశాలలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో ఆధునిక ల్యాబ్‌లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు మరో రూ.9 వేల కోట్లు వెచి్చంచనున్నాం’అని రేవంత్ కేంద్రమంత్రికి వివరించారు.
విద్యారంగంపై తమ ప్రభుత్వం చేస్తున్న వ్యయాన్ని మానవ వనరుల అభివృద్ధికి చేస్తున్న పెట్టుబడిగా భావించాలని విజ్ఞప్తి చేశారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు, విద్యారంగం అభివృద్ధిపై ముఖ్యమంత్రి చూపుతున్న చొరవను నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా ప్రశంసించారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల మోడల్ బాగుందన్న కేంద్ర మంత్రి.. ఎస్‌పీసీకి సంబంధించిన వివరాలను అందజేయాలని సూచించారు.
ఐఐఎం మంజూరు చేయండి
తెలంగాణకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) విద్యాసంస్థను మంజూరు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఏరో స్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్స్, అడ్వాన్స్Šడ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో ముందున్న హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు.
ధర్మేంద్ర ప్రధాన్‌తో పార్లమెంట్ ఆవరణలోని ఆయన చాంబర్‌లో రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. దేశంలో 19 రాష్ట్రాల్లో, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కలిపి 21 ఐఐఎంలు ఉన్నాయని, తెలంగాణ లోనూ ఐఐఎం ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. ‘ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రాంగణంలో గుర్తించాం.
ఐఐఎం తరగతులు వెంటనే ప్రారంభించేందుకు ట్రాన్సిట్ క్యాంపస్ కూడా సిద్ధంగా ఉంది. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన అనుమతులు వెంటనే మంజూరు చేస్తే.. అవసరమైన వసతుల కల్పనకు మేం సిద్ధంగా ఉన్నాం. దేశంలోని అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు వీలుగా హైదరాబాద్‌కు ఎయిర్, రైల్, రోడ్ కనెక్టివిటీతోపాటు అనుకూల వాతావరణం ఉంది’అని ధర్మేంద్ర ప్రధాన్‌కు వివరించారు. పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా నూతనంగా 9 కేంద్రీయ విద్యాలయాలు, 16 జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని రేవంత్ కోరారు.
కొమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, వికారాబాద్, నిర్మల్ జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలు; హనుమకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, ములుగు, నారాయణపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ విద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలాలు, ఇతర వసతులు కలి్పంచడానికి తాము సిద్ధంగా ఉన్నామని సీఎం చెప్పారు. సమావేశంలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మందాడి అనిల్ కుమార్, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.
సోనియాతో భేటీ
ఏఐసీసీ అగ్రనేత సోనియాగాం«దీతోనూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల ఆవిష్కరించిన తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్‌ను సోనియాకు అందజేశారు. ప్రజాపాలనలో రెండేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృధ్ధికి తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృధ్ధి పథంలో తీసుకెళ్లాలని ఈ సందర్భంగా సోనియా ఆకాంక్షించారు.


