రైలు ప్రయాణం సర్వసాధారణం అయిపోయింది. అయితే ట్రైన్ జర్నీ కోసం టికెట్స్ బుక్ చేసుకోవడం మాత్రం చాలామందికి కష్టమే. అయితే కొంతమంది మాత్రం కొన్ని రెంటర్ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించి.. టికెట్స్ బుక్ చేస్తున్నట్లు ఒక జాతీయ వార్తాపత్రిక కథనం వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ సాఫ్ట్‌వేర్‌లు ఏవి?, వాటిని ఐఆర్‌సీటీసీ అరికట్టడం సాధ్యం కాదా?
రైల్వే టికెట్స్ బుక్ చేసుకోవాలంటే.. ఐఆర్‌సీటీసీ లేదా బుక్‌మైట్రిప్ వంటి కొన్ని నిర్దిష్ట యాప్స్ లేదా రైల్వే కౌంటర్స్ ఉపయోగించుకుంటారు. కానీ కొంతమంది ఏజెంట్స్ రెంటర్ సాఫ్ట్‌వేర్‌ల ద్వారా 50 సెకన్లలో తత్కాల్ టిక్కెట్లను బుక్ చేస్తున్నారు. అంటే ప్రయాణికుడు IRCTC యాప్‌లోకి లాగిన్ అయ్యే సమయానికి, వాళ్లు(ఏజెంట్స్) టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నారన్నమాట..!
సాఫ్ట్‌వేర్ డెవలపర్లు.. టికెట్స్ బుక్ చేసుకోవడానికి వీలుగా కొన్ని సాఫ్ట్‌వేర్‌లను క్రియేట్ చేస్తున్నారు. వాటి అద్దె నెలకు రూ.1200 నుంచి రూ.3200 వరకు ఉంటుంది. వీరు ఎప్పటికప్పుడు ఐపీ అడ్రస్‌లను కూడా మార్చేస్తూ ఉంటారు. ఐపీ అడ్రస్‌ల మార్పు కోసం మరికొంత మొత్తంలో డబ్బు చెల్లిస్తారు. ఎక్కువ మంది టెస్లా, గదర్, బ్రహ్మోస్, సూపర్ తత్కాల్, అవెంజర్ వంటి రెంటర్ సాఫ్ట్‌వేర్లను వాడుతున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్‌లో ప్రయాణికుడు మాన్యువల్‌గా టికెట్ బుక్ చేసుకున్నప్పుడు.. లాగిన్, రైలు ఎంపిక, ప్రయాణికుల వివరాలు, క్యాప్చా, చెల్లింపు వంటి ప్రక్రియలను స్వయంగా పూర్తిచేయాలి. ఈ సమయంలో, వేలాది మంది వినియోగదారులు సిస్టమ్‌లో ఏకకాలంలో యాక్టివ్‌గా ఉంటారు, ముఖ్యంగా తత్కాల్ బుకింగ్ సమయాల్లో చాలా మంది ప్రయాణికులు ఈ ప్రక్రియలో టిక్కెట్లు పొందలేకపోతున్నారు.
అయితే ఏజెంట్లు మాత్రమే ఇందుకు భిన్నంగా.. ఆటోమేషన్/AI సాఫ్ట్‌వేర్ ఉపయోగించి పని కానిచ్చేస్తున్నారు. ఈ సాఫ్ట్‌వేర్ సాధారణ వినియోగదారులతో పోలిస్తే చాలా రెట్లు వేగంగా సర్వర్‌కు అభ్యర్థనలను పంపుతుంది. ఈ కారణంగా సాధారణ ప్రయాణికులు టికెట్స్ వేగంగా పొందలేరు. అయితే టికెట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎక్కువ డబ్బు చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్న ప్రయాణికులు.. ఈ తరహా అక్రమ సాఫ్ట్‌వేర్లను వినియోగించే ఏజెంట్స్ సాయం తీసుకుంటున్నారు.
ఐఆర్‌సీటీసీ అరికట్టడం సాధ్యం కాదా?
ఐఆర్‌సీటీసీ ఏజెంట్స్ ఉపయోగించే రెంటల్ సాఫ్ట్‌వేర్‌లను ఆరికట్టకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది, చట్టపరమైన లొసుగులు. ఆటోమేషన్ అండ్ ఏఐ బేస్డ్ టికెట్ బుకింగ్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి పూర్తిగా నిషేధించే కఠినమైన చట్టాలు లేవు. ప్రస్తుత సమాచార సాంకేతిక చట్టం, రైల్వే చట్టాలు, నిబంధనలు దీనిని పాక్షికంగా మాత్రమే నియంత్రిస్తున్నాయి. అందుకే.. కఠిన చర్యలు తీసుకునే వీలు లేకుండా పోతోంది.
దీంతోపాటు.. టెక్నాలజీ మరో కారణంగా చెప్పవచ్చు. వేగంగా టిక్కెట్లు బుక్ చేసుకునే ఐపీ అడ్రస్‌లను భారతీయ రైల్వేలు బ్లాక్ చేస్తాయి. కానీ ఏజెంట్లు ఎప్పటికప్పుడు ఐపీలను మారుస్తారు. వీపీన్‌ను వినియోగిస్తారు. అంతేకాకుండా.. ఎప్పటికప్పుడు కొత్త యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తున్నారు. దీంతో.. ఈ సాఫ్ట్‌వేర్లను అరికట్టడం ఐఆర్‌సీటీసీకి సాధ్యం కావడం లేదు.
ఇదీ చదవండి: మరింత ధనవంతులు కావడం ఎలా?: కియోసాకి ట్వీట్


