
ఏసీ క్లాస్‌లలో రెండు పైసలు, నాన్–ఏసీ క్లాస్‌లలో ఒక పైసా పెంపు
సెకండ్ క్లాస్ ఆర్డినరీ చార్జీలను స్వల్పంగా పెంచిన రైల్వేశాఖ
సాక్షి, న్యూఢిల్లీ: భారత రైల్వే శాఖ రైళ్ల టికెట్ల ధరలను స్వల్పంగా పెంచింది. పెరిగిన ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. ఏసీ క్లాస్‌లలో కిలోమీటరుకు రెండు పైసలు, నాన్–ఏసీ క్లాస్‌లలో ఒక పైసా చొప్పున చార్జీలను పెంచారు. సెకండ్ క్లాస్ ఆర్డినరీ రైలు టికెట్ చార్జీలనూ స్వల్పంగా పెంచారు. జూలై ఒకటో తేదీ నుంచి ధరలు పెంచబోతున్నట్లు జూన్ 24వ తేదీనే రైల్వే శాఖ సూచనప్రాయంగా చెప్పడం తెల్సిందే. తరగతుల వారీగా పలు రకాల రైళ్లలో పెరిగిన టికెట్ చార్జీల వివరాలను సోమవారం రైల్వేశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
అయితే ప్రతిరోజూ రైళ్లలో రాకపోకలు చేసే ప్రయాణికులపై భారం మోపకుండా సబర్బన్ రైళ్లు, మంత్లీ సీజన్ టికెట్ల ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. 500 కిలోమీటర్లలోపు ప్రయాణాలకు ఆర్డినరీ సెకండ్ క్లాస్ టికెట్ ధరలోనూ ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ కేటగిరీలో పాత ధరలే కొనసాగుతాయి. అయితే ఆర్డినరీ సెకండ్ క్లాస్‌లో 500 కిలోమీటర్లు దాటితే మాత్రం టికెట్ ధర పెరుగుతుంది. 501 నుంచి 1500 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.5 ధర పెరిగింది. 1,501 నుంచి 2,500 కిలోమీటర్ల ప్రయాణానికి టికెట్ ధర రూ.10 పెంచారు. 2,501 నుంచి 3,000 కిలోమీటర్ల ప్రయాణానికి టికెట్ ధర రూ.15 పెంచారు.
అంటే ఆర్డినరీ సెకండ్ క్లాస్‌లో 500 కి.మీ.లు దాటి ప్రతి కిలోమీటర్‌కు అరపైసా ధర పెంచారు. ఆర్డినరీ స్లీపర్ క్లాస్, ఆర్డినరీ ఫస్ట్ క్లాస్‌లోనూ ప్రతి కిలోమీటర్‌కు అర పైసా ధర పెంచారు. ‘‘ ప్రీమియర్, స్పెషల్ రైలు సేవలైన రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, తేజ్, హమ్‌సఫర్, అమృత్‌భారత్, మహామన, గతిమాన్, అంత్యోదయ, జన్ శతాబ్ది, యువ ఎక్స్‌ప్రెస్, ఏసీ విస్టాడోమ్ కోచ్‌లు, అనుభూతి కోచ్‌లు, ఆర్డినరీ నాన్–సబర్బన్ సర్వీసులకూ ఈ పెరిగిన ధరలు వర్తిస్తాయని రైల్వే శాఖ పేర్కొంది.
నాన్–ఏసీ మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రతి కిలోమీటర్ ప్రయాణానికి ఒక పైసా ధర పెంచారు. ఏసీ క్లాస్‌లలో ప్రతికిలోమీటర్‌కు రెండు పైసలు ధర పెంచారు. అంటే మెయిల్/ఎక్స్‌ప్రెస్ సెకండ్ క్లాస్‌లో, మెయిల్/ఎక్స్‌ప్రెస్ స్లీపర్ కాస్‌లో, మెయిల్/ఎక్స్‌ప్రెస్ ఫస్ట్ క్లాస్‌లోనూ ధర ఒక పైసా పెరిగింది. ఏసీ తరగతులైన ఏసీ చైర్‌కార్, ఏసీ–3టయర్/3ఈ, ఏసీ –2 టయర్, ఏసీ ఫస్ట్ క్లాస్/ఈసీ/ఈఏ టికెట్లపైనా రెండు పైసలు ధర పెంచారు. జూలై ఒకటో తేదీన, ఆ తర్వాతి తేదీల కోసం బుక్ చేసిన టికెట్లకు ఈ సవరించిన ధరలు వర్తింపజేస్తారు. ఈ మేరకు పీఆర్‌ఎస్, యూటీఎస్, మాన్యువల్ టికెటింగ్ వ్యవస్థల్లోనూ సవరించిన కొత్త ధరలు కనిపించేలా సిస్టమ్స్‌ను అప్‌డేట్ చేశారు. అయితే రిజర్వేషన్ ఫీజు, సూపర్‌ఫాస్ట్ సర్‌చార్జీలు, ఇతర చార్జీల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. వస్తుసేవల పన్ను(జీఎస్‌టీ)లోనూ ఎలాంటి మార్పు లేదని రైల్వేశాఖ పేర్కొంది.