టికెట్‌ రద్దు.. జేబుకు చిల్లు! | Preparation of Vande Bharat chart 8 hours in advance | Sakshi
Sakshi News home page

టికెట్‌ రద్దు.. జేబుకు చిల్లు!

Jan 24 2026 5:52 AM | Updated on Jan 24 2026 5:53 AM

Preparation of Vande Bharat chart 8 hours in advance

8 గంటల ముందే వందేభారత్‌ చార్ట్‌ తయారీ

ఆ తర్వాత టికెట్‌ రద్దు చేస్తే నయా పైసా రాదు 

72 గంటల ముందే క్యాన్సిల్‌ చేసినా 25 శాతం కోతలు 

సాధారణ రైళ్లలో చార్ట్‌ తయారీకి 4 గంటల ముందు వరకు రీఫండ్‌  

కొత్త నిబంధనలపై మండిపడుతున్న ప్రయాణికుల్డు

భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘వందే భారత్‌ స్లీపర్‌’ రైళ్లలో ప్రయాణం ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో.. టికెట్‌ రద్దు నిబంధనలు అంత కఠినంగా మారాయి. సాధారణ రైళ్లతో పోలిస్తే ఈ ప్రీమియం రైళ్లలో క్యాన్సిలేషన్‌ చార్జీలను రైల్వే శాఖ భారీగా పెంచేసింది. చివరి నిమిషంలో టికెట్లు రద్దు చేసే ధోరణిని అరికట్టడానికి, సీట్ల వినియోగాన్ని మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 

రైలుబయలుదేరడానికి 8 గంటల ముందే చార్ట్‌ సిద్ధం చేస్తామని, ఆ తర్వాత టికెట్‌ రద్దు చేసుకుంటే ఒక్క పైసా కూడా తిరిగి ఇవ్వబోమంటూ రైల్వే బోర్డు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త నిబంధనల కారణంగా.. వందేభారత్‌ రైలంటేనే ప్రయాణికులు హడలిపోవాల్సిన పరిస్థితి దాపురించింది.  – సాక్షి, విశాఖపట్నం  

ప్రీమియం ప్రయాణంగా మారిన వందేభారత్‌ రైలులో కొత్త నిబంధనలను రైల్వే శాఖ అమల్లోకి తెచ్చింది. టికెట్‌ ధర మాదిరిగానే.. బుక్‌ చేసుకున్న టికెట్‌ను రద్దు చేసుకోవడం కూడా అంతే భారంగా మారిపోయింది. ఇకపై వందేభారత్‌ రైలుకు బుక్‌ చేసుకున్న టికెట్‌ను చివరి నిమిషంలో రద్దు చేయాలనుకుంటే నిబంధనలు కఠినంగా వర్తిస్తాయి. 

సాధారణ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు వరకు రీఫండ్‌ పొందే అవకాశం ఉండగా, వందే భారత్‌ స్లీపర్‌లో ఆ గడువును 8 గంటలకు పెంచారు. ఫలితంగా.. వందేభారత్‌ టికెట్‌ను రద్దు చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 

8 గంటల ముందే చార్ట్‌ సిద్ధం  
సాధారణంగా ప్రతి రైలు చార్ట్‌ను, రైలు బయలుదేరే సమయానికి 4 గంటల ముందు సిద్ధం చేస్తారు. మొన్నటి వరకు వందేభారత్‌లో కూడా ప్రయాణికుల వివరాల చార్ట్‌ తయారీకి ఇదే సమయం వర్తించేది. కానీ, కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం.. రైలు బయలుదేరే సమయానికి 8 గంటల ముందుగానే ఫైనల్‌ చార్ట్‌ను విడుదల చేయనున్నారు. ఈ కారణంగానే.. రిజర్వేషన్‌ క్యాన్సిలేషన్‌ చార్జీల్లో కూడా గణనీయంగా మార్పులు చేశారు. 

ప్రయాణానికి 72 గంటల కంటే ముందే రద్దు చేసుకుంటే టికెట్‌ ధరలో 25 శాతం కోత విధిస్తారు. 72 గంటల నుంచి 8 గంటల లోపు(చార్ట్‌ తయారయ్యే నిమిషం ముందు వరకూ) రద్దు చేసుకుంటే 50 శాతం కోత విధిస్తారు. ఇక 8 గంటల కంటే తక్కువ సమయంలో రద్దు చేసుకుంటే ఒక్క పైసా కూడా రాదు. 100 శాతం కోత విధిస్తారు. 

ప్రధాన రూట్లలో ప్రభావం 
వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లలో కనీస చార్జీ 400 కి.మీ.లకు వర్తిస్తుంది. ఉదాహరణకు, విశాఖపట్నం నుంచి విజయవాడకు వందేభారత్‌ ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ టికెట్‌ ధర పన్నులతో కలిపి రూ.1,868 ఉంటుంది. దీనిని 3 రోజుల ముందే రద్దు చేస్తే రూ.467 వరకూ నష్టపోవాల్సి ఉంటుంది. 

రైలు బయలుదేరడానికి 10 గంటల ముందు రద్దు చేస్తే రూ.934 కట్‌ అవుతుంది. చివరి 8 గంటల్లోపు రద్దు చేస్తే రూ.1,868 కూడా నష్టపోవాల్సిందే. ఇక హైదరాబాద్‌కు టికెట్‌ బుక్‌ చేసుకొని 3 రోజుల ముందే రద్దు చేసుకున్నా.. వెయ్యికి పైగానే జేబుకు చిల్లుపడే అవకాశం ఉంది.

ఎందుకీ కఠిన నిర్ణయం? 
ప్రయాణికుల ముక్కు పిండి మరీ వసూలు చేసేలా రైల్వే బోర్డు ఇటీవల కాలంలో కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే వందేభారత్‌ ప్రయాణికులపైనా వాతలు ప్రారంభించింది. అయితే, తమ క్యాన్సిలేషన్‌ షరతుల్లో మార్పులు చేయడాన్ని రైల్వే శాఖ సమర్థించుకుంటోంది. వందే భారత్‌ స్లీపర్‌లో కేవలం కన్ఫర్మ్‌ అయిన బెర్తులను మాత్రమే కేటాయిస్తారు. 

ఆర్‌ఏసీ(రిజర్వేషన్‌ ఎగైనిస్ట్‌ క్యాన్సిలేషన్‌) సౌకర్యం ఉండదు. చివరి నిమిషంలో రద్దు చేయడం వల్ల ఖరీదైన బెర్తులు ఖాళీగా మిగిలిపోతున్నాయని, అందుకే ఈ తరహా భారీ జరిమానాలు విధించాల్సి వస్తోందని రైల్వే చెబుతోంది. కారణమేదైనా.. జేబులకు చిల్లులు పెట్టేందుకు రైల్వే బోర్డు నడుం బిగించినట్లేనని, ఈ తరహా క్యాన్సిలేషన్‌ చార్జీలు అదనపు భారమేనంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

భారీ కోతలతో నష్టమే.. 
వందేభారత్‌ ప్రయాణమంటేనే భారం. ఇప్పుడు చార్ట్‌ ప్రిపరేషన్, క్యాన్సిలేషన్‌ చార్జీల విధింపులో మార్పులు చాలా వరకూ ప్రయాణికులను నష్టపరిచేలా ఉన్నాయి. ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదు. ప్రయాణానికి మూడు రోజుల ముందే టికెట్‌ రద్దు చేసుకున్నా, కనీసం నాలుగో వంతు డబ్బును వదులుకోవాలంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. దీనిపై అధికారులు పునరాలోచించుకుంటే మంచిది.  – ఎస్‌.ఈశ్వర్, ప్రైవేట్‌ ఉద్యోగి

వందేభారత్‌ అంటేనే భయమేస్తోంది 
సమయం ఆదా అవుతుందని వందేభారత్‌ను మధ్యతరగతి ప్రజలు కూడా ఉపయోగిస్తున్నారు. టికెట్‌ ధరలు దాదాపు విమానయానాన్ని పోలి ఉంటున్నాయి. అయినా సమయం కోసం వందేభారత్‌ ఎక్కుతున్నాం. ఇప్పుడు కొత్త నిబంధనలతో వందేభారత్‌ రైలు అంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్యాన్సిలేషన్‌ చార్జీలు, చార్ట్‌ ప్రిపరేషన్‌ టైమ్‌ మిగిలిన రైళ్ల మాదిరిగా ఉంచితేనే మంచిది.  – బి. కోటేశ్వరరావు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement