రైల్వే బడ్జెట్‌లో ఈసారి కీలక మార్పులు
ఇప్పటివరకు భారతీయ రైల్వే మొత్తం ఓ యూనిట్‌గా బడ్జెట్ వివరాల సమర్పణ
ఇకపై ఏ జోన్‌కు ఆ జోన్ వివరాలు
సమగ్ర బడ్జెట్ డాక్యుమెంట్ల రూపంలో జోన్లకు అందజేత
బడ్జెట్ సమయంలో ప్రాజెక్టు వారీ కేటాయింపుల వివరాల ప్రకటనలో గోప్యత
నిధుల వ్యయంలో వికేంద్రీకరణకు కేంద్రం బాటలు
ప్రాజెక్టుల వారీగా కేటాయింపులో జోన్ల స్థాయిలోనే నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్: దేశ ఆర్థిక పురోగతిలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న రైల్వే శాఖకు, యూనియన్ బడ్జెట్‌లో నిధుల కేటాయింపునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక మార్పునకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు జోన్ల వారీగా నిధుల వ్యయం విషయంలో పూర్తిగా కేంద్రీకృత విధానం అమలులో ఉండగా, తాజాగా వికేంద్రీకరణకు బాటలు వేస్తోంది. కేటాయించిన బడ్జెట్ నుంచి ప్రాజెక్టుల వారీగా నిధుల కేటాయింపులో రైల్వే బోర్డు కాకుండా, ఇకనుంచి జోన్ల స్థాయిలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వీలు కల్పిస్తోంది.
దశాబ్దాలుగా భారతీయ రైల్వే మొత్తం ఓ యూనిట్‌గా బడ్జెట్ వివరాలను ముద్రించి పార్లమెంటుకు సమర్పిస్తున్న ‘పింక్ బుక్’విధానాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించింది. దాని స్థానంలో ఏ జోన్‌కు ఆ జోన్ వివరాలు సమగ్ర బడ్జెట్ డాక్యుమెంట్ల రూపంలో సంబంధిత జోన్లకు అందించనుంది. ఆ వివరాలను బడ్జెట్ సమయంలో ప్రజలకు బహిరంగపరచకుండా కొంత గోప్యతను పాటించనుంది. వెరసి ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే యూనియన్ బడ్జెట్‌లో రైల్వే కేటాయింపులకు సంబంధించిన పింక్‌బుక్‌ను ప్రవేశపెట్టబోరని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.
2025లోనే షురూ.. ఈసారి పూర్తిస్థాయిలో..
ఎన్డీఏ ప్రభుత్వం మూడో దఫా కొలువుదీరిన వేళ 2024 జూలైలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆ సందర్భంగా రైల్వే శాఖకు సంబంధించి పింక్ బుక్‌ను విడుదల చేసింది. కానీ 2025 ఫిబ్రవరిలో సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పుడు పాత కేటాయింపుల (మధ్యంతర బడ్జెట్ కాలం కొనసాగుతున్నందున)కు సంబంధించి కొన్ని సవరణలను ప్రతిపాదించింది.
వాటిని పింక్ బుక్ రూపంలో విడుదల చేయాల్సి ఉంది. కానీ దాన్ని పార్లమెంటుకు సమర్పించలేదు. ఆ సవరణలేంటో నేరుగా జోన్లకు సమగ్ర బడ్జెట్ డాక్యుమెంటు రూపంలో అందజేసింది. అయితే అప్పట్లో దానిపై పూర్తి స్పష్టత రాలేదు. కాగా ఈసారి పూర్తిస్థాయిలో కొత్త విధానాన్ని అవలంబించనున్నట్లు సమాచారం.
కేంద్రీకృత విధానానికి క్రమంగా సెలవు!
రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో బోర్డుదే కీలక పాత్ర అయినప్పటికీ, ఇంతకాలం కొనసాగిన పూర్తి కేంద్రీకృత విధానాన్ని క్రమంగా తగ్గించి వికేంద్రీకరణ విధానాన్ని అనుసరించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. గతంలో కొత్త ప్రాజెక్టుల మంజూరు, వాటికి నిధుల కేటాయింపు, కొనసాగుతున్న ప్రాజెక్టులకు నిధుల ఖరారు... తదితరాలు పూర్తిగా రైల్వే బోర్డు నిర్ణయం మేరకే ఉండేది. దీనివల్ల చాలా గందరగోళం నెలకొనేది.
రకరకాల ఒత్తిళ్లతో కొన్ని కొత్త ప్రాజెక్టులు మంజూరు చేసేవారు. వాటికి నిధులు కేటాయించాల్సి రావటంతో, ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు నిధుల లభ్యత తగ్గేది. దీంతో అటు కొత్త ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో పట్టాలెక్కక, కొనసాగుతున్న ప్రాజెక్టులు వేగంగా పూర్తి కాక గందరగోళం నెలకొనేది. దానికి బోర్డు స్వస్తి పలికింది.
ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల పురోగతి ఆధారంగా వాటికి కొరత లేకుండా నిధులు కేటాయించటం, ఈ విషయంలో జోన్ల స్థాయిలోనే నిర్ణయం తీసుకునేలా కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. బడ్జెట్‌లో ప్రాజెక్టులకు కేటాయించిన నిధులను జోన్ల స్థాయిలోనే నిర్ణయాలు తీసుకుని వేరే ప్రాజెక్టులకు మళ్లించే వెసులుబాటు కొత్త విధానం కల్పిస్తోంది.
అనవసర చికాకులు లేకుండా..
ఇప్పటివరకు బడ్జెట్ సమయంలో పింక్ బుక్‌ను అధికారిక వెబ్‌సైట్‌లలో పొందుపరిచేవారు. ఆ వివరాలను వెంటనే అధికారికంగా ప్రజలకు తెలిపేవారు. ఈ క్రమంలో తమ ప్రాంత ప్రాజెక్టులకు తక్కువ నిధులు కేటాయించినప్పుడు..ఆయా ప్రాంతాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు తమ ప్రాంత ప్రాజెక్టులకు తక్కువ నిధులు కేటాయించారంటూ నిరసనలకు దిగటం సాధారణంగా జరుగుతుంటుంది. తాజాగా ఇలాంటి చికాకులు రాకుండా ఆయా వివరాలను కొంత గోప్యంగా ఉంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది.


