
మొదటి 15 నిమిషాలు.. ఆధార్ ధ్రువీకరణ ఉన్నవారికే
రైలు ప్రయాణికులకు అలర్ట్. ఆన్‌లైన్‌లో టిక్కెట్ బుక్ చేసుకునే వారికి రైల్వే శాఖ కొత్త నిబంధన అమల్లోకి తెస్తుంది.
న్యూఢిల్లీ: జనరల్ టిక్కెట్ల రిజర్వేషన్‌కు బుక్కింగ్స్ మొదలైన మొదటి 15 నిమిషాలను ఆధార్ ధ్రువీకరణ ఉన్న యూజర్లను మాత్రమే అనుమతిస్తామని రైల్వే శాఖ తెలిపింది. రైలు ఏదైనా బుక్కింగ్స్ ప్రారంభమైన మొదటి 15 నిమిషాల్లో ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా రిజర్వేషన్ చేయించుకునే టిక్కెట్లకు ఇది వర్తిస్తుందని స్పష్టత నిచ్చింది. పదిహేను నిమిషాల తర్వాత మాత్రమే అధీకృత ఏజెంట్లు టిక్కెట్లు రిజర్వేషన్ తీసుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది.
‘ఉదాహరణకు ఒక రైలు ఒకటో తేదీ ఉదయం 10 గంటలకు బయలుదేరనుంది. ఆ రైలుకు రిజర్వేషన్లు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైతే, మొదటి 15 నిమిషాలు ఆధార్ ధ్రువీకరణ ఉన్న వారికే రిజర్వేషన్ చేసుకునే అవకాశముంటుంది’అని వివరించింది. ఇప్పటి వరకు తత్కాల్ (Tatkal) రిజర్వేషన్లకు మాత్రమే ఈ నిబంధన ఉండేది.
రిజర్వేషన్ విధానం ప్రయోజనాలు సాధారణ వినియోగదారునికి కూడా అందేందుకు, దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కొత్త విధానాన్ని తీసుకువచ్చినట్లు రైల్వే శాఖ సోమవారం ఒక సర్క్యులర్‌లో వివరించింది. కౌంటర్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునే ఏజెంట్లకు ప్రస్తుతమున్న మొదటి 10 నిమిషాల నియంత్రణ కొనసాగుతుందని కూడా స్పష్టం చేసింది.