బుద్ధుడికి జన్మనిచ్చిన లుంబినివనం.. సిద్ధార్థుడికి జ్ఞానోదయమైన బోద్‌గయ. తొలి అష్టాంగమార్గాన్ని విన్న సారనాథ్.. సారనాథ్‌లో శ్రీలంక చైత్యం మూలగంధకుటి. బౌద్ధానికి రాజ గౌరవాన్నిచ్చిన రాజగృహ.. బుద్ధుడి ప్రకృతి విహారకేంద్రం వేణువనం. సమ్యక్ జీవనసాఫల్య క్షేత్రం శ్రావస్థి.. చివరి ప్రబోధాన్ని విన్న మాతాకుటీర్. బుద్ధుని అవశిష్ఠ నిర్మాణం రామభార్ స్థూప.. బుద్ధుడి తుదిశ్వాసకు మౌనసాక్షి కుశినగర. ఒకే పర్యటనలో వీటన్నింటినీ చూడాలంటే... ఐఆర్‌సీటీసీ బుద్ధిస్ట్ సర్క్యూట్ టూరిస్ట్ ట్రైనెక్కాలి.
1వ రోజు..
ఢిల్లీ నుంచి గయకు ప్రయాణం. మధ్యాహ్నం ఒంటిగంటకు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వేస్టేషన్‌కి చేరాలి. చిన్న వెల్‌కమ్ తర్వాత ‘బుద్ధిస్ట్ సర్క్యూట్ టూరిస్ట్ ట్రైన్’ ఎక్కాలి. ట్రైన్ రెండున్నరకు బయలుదేరుతుంది. రాత్రి ఎనిమిది గంటలకు భోజనం రైల్లోనే అందిస్తారు. ప్రయాణం కొనసాగుతుంది.
2వ రోజు
రైలు ప్రయాణం కొనసాగుతుంటుంది. రైల్లో ఉదయం టీ, రిఫ్రెష్‌మెంట్ తర్వాత బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. గయకు చేరిన తర్వాత రైలు దిగి బోద్‌గయకు ప్రయాణం. బోద్‌గయలో హోటల్ గదిలో చెక్ ఇన్. కొంత సేపు విశ్రాంతి తర్వాత బోధగయ విహారం, మహాబోధి వృక్షం, మహాబోధి ఆలయ దర్శనం, నిరంజన నది తీరాన విహారం. బోద్‌గయలోని థాయ్ టెంపుల్, జపనీస్ టెంపుల్, బుద్ధ విగ్రహ వీక్షణం. రాత్రి భోజనం, బస హోటల్లో.
నిరాడంబరం సుసంపన్నంగా
బోధగయలో చూడాల్సిన ప్రదేశాల్లో ప్రధానమైనది బోధివృక్షం. దాన్ని మహాబోధి అంటారు. బుద్ధుడికి జ్ఞానోదయమైన ప్రదేశం ఇది. ఇక్కడ మహా ఆలయ నిర్మాణం జరిగింది. అదే మహాబోధి ఆలయం. ఈ ఆలయానికి ఓ అరకిలోమీటరు దూరాన మాయా సరోవర్ తీరాన ఉంది వాట్‌థాయ్ టెంపుల్. బోద్‌గయలోని వివిధ బౌద్ధాలయాన్నీ దేనికదే ప్రత్యేకమైన నిర్మాణశైలితో ఆకర్షణీయంగా ఉంటాయి.
నిరాడంబరతను ఇంత సుసంపన్నంగా వ్యక్తం చేయవచ్చా అని ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఇది 1956లో ధాయ్‌లాండ్ ప్రభుత్వం నిర్మించిన ఆలయం. భారత్– థాయ్‌లాండ్ దేశాల మధ్య మంచి సంబంధాలు నెలకొల్పాలనే ఉద్దేశంతో ప్రధాని నెహ్రూ కోరిన మీదట థాయ్ ప్రభుత్వం ఈ నిర్మాణాన్ని చేపట్టింది. బంగారు పూత పై కప్పు నిర్మాణంలోని సునిశితత్వం అబ్బురపరుస్తుంది. ఈ ఆలయానికి సమీపంలో ఎనభై అడుగుల గ్రేట్ బుద్ధ స్టాట్యూ ఉంది. ధ్యాన ముద్రలో ఉన్న బుద్ధుని విగ్రహంలో శిల్పనైపుణ్యం అద్భుతం. ఇక జపనీస్ టెంపుల్ ఇండోసాన్ నిప్పన్ జపనీస్ టెంపుల్ ప్రశాంతతకు ప్రతీకలా ఉంటుంది.
3వరోజు
బోద్‌గయ నుంచి నలంద, రాజ్‌గిర్, గయ, వారణాసికి ప్రయాణం. ఉదయం బో«ద్‌గయలోని హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ తర్వాత చెక్ అవుట్ చేసి రాజ్‌గిర్ వైపు సాగిపోవాలి. రాజ్‌గిర్‌లో బింబిసార జైల్, గ్రద్ధకూట పర్వతం, వేణువన్ పర్యటన తర్వాత లంచ్‌కి హోటల్‌కి రావాలి. భోజనం తర్వాత నలందకు ప్రయాణం. నలందలో యూనివర్సిటీ శిథిలాల వీక్షణం, నలంద మ్యూజియం సందర్శనం తర్వాత గయకు ప్రయాణం. గయ రైల్వేస్టేషన్‌కు చేరి ‘బుద్ధిస్ట్ సర్క్యూట్ టూరిస్ట్ ట్రైన్’ రైలెక్కాలి. రైలు వారణాసికి వైపు సాగి΄ోతుంది. రాత్రి భోజనం రైల్లోనే.
భీమ – జరాసంధుల యుద్ధక్షేత్రం
రాజ్‌గిర్ అసలు పేరు రాజగృహ. ప్రాచీనకాలం నాటి నివాస ప్రదేశం. మహాభారత కాలంలో జరాసంధుని రాజ్యం గిరివ్రజ ఇదే. భీముడితో జరాసంధుడు యుద్ధం చేసిన ప్రదేశం. మగధ రాజ్యానికి కొంతకాలం రాజధాని కూడా. రాజు నివసించే నగరం కావడంతో రాజగృహ అనే పేరు వచ్చింది. బుద్ధుడు తొలి బోధన సారనాథ్‌లో చేశాడు. రాజగృహలో రాజుల సమావేశంలో బోధన చేయడంతో బౌద్ధానికి విశేషమైన ప్రచారం వచ్చింది.
సామాన్యులతో పాటు మగధ సామ్రాజ్య స్థాపకుడు బింబిసారుడికి కూడా బుద్ధుడు ఇక్కడే బోధనలు చేశాడు. రాజ్‌గిర్ విశ్వశాంతి స్తూపం నుంచి కనిపించే గ్రద్ధకూట పర్వతం మీద బుద్ధుడు కొంతకాలం ధ్యానం చేసుకున్నాడు. జైన 24వ తీర్థంకరుడు మహావీరుడు కూడా కొంతకాలం ఇక్కడ నివసించాడు. బింబిసారుడిని అతడి కొడుకు అజాతశత్రు జైలులో బంధించాడు. ఆ జైలు ఇక్కడికి దగ్గరలోనే ఉంది. బుద్ధుడు రాజ్‌గిర్‌లో నివసించిన కాలంలో పగలంతా బోధనలు చేస్తూ సాంత్వన కోసం సమీపంలోని వేణువన్‌లో సమయం గడిపేవాడు.
నాటి సరస్వతి నిలయం
నలంద ప్రపంచంలోనే తొలి రెసిడెన్సియల్ యూనివర్సిటీ. బౌద్ధ మహావిహార పేరుతో విలసిల్లింది. క్రీ.శ ఐదవ శతాబ్దం నుంచి పన్నెండవ శతాబ్దం వరకు విద్యార్థులతో కళకళలాడింది. ఈ నిర్మాణాన్ని పరిశీలిస్తే నిర్మాణంలో అనుసరించిన ఇంజనీరింగ్ స్కిల్ అబ్బురపరుస్తుంది. విద్యార్థులకు ఒక్కో గది, పుస్తకాలు దుస్తులకు అరలు ఉన్నాయి. నీరు వెలుపలకు వెళ్లడానికి నిర్మాణంలోనే పైపుల ఏర్పాటు ఉంది. జానపద కథల్లో చంద్రుడి వెలుతురు పడి ప్రకాశించే చంద్రశిలలను ఇక్కడ చూడవచ్చు.
అతి పెద్ద లైబ్రరీలోని గ్రంథాలను రాశిపోసి భక్తియార్ ఖిల్జీ తగుల పెట్టాడని చెబుతారు. గ్రంథాలు తగలబడిన చోట ఇటుకలు నల్లగా మాడిపోయి ఉన్నాయి. నలందలో మహావిహార తర్వాత ఆర్కియలాజికల్ మ్యూజియం. సూర్యమందిర్, చైనా యాత్రికుడు హ్యూయాన్ త్సాంగ్ మందిరాలను చూడవచ్చు.
4వ రోజు
వారణాసి నుంచి సారనాథ్, నౌతన్వాకు ప్రయాణం. గయ నుంచి వారణాసికి వస్తున్న రైల్లో ఉదయాన్నే టీ, బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. రిఫ్రెష్‌మెంట్ పూర్తి చేసుకుని వారణాసిలో రైలు దిగిన తర్వాత సారనాథ్‌కు ప్రయాణం.
సారనాథ్‌లో ధమేక్ స్థూప, సారనాథ్ మ్యూజియం, అశోక పిల్లర్, మూలగంధకుటి విహార్‌కు ప్రయాణం. హోటల్‌లో చెక్ ఇన్, లంచ్ తర్వాత గంగానది తీరాన హారతి వీక్షణం. రాత్రికి రైల్వేస్టేషన్‌కు చేరి రైలెక్కాలి. రాత్రి భోజనం రైల్లోనే. రైలు నౌతన్వా వైపు సాగి΄ోతుంది. నౌతన్వా మనదేశంలో చివరి రైల్వేస్టేషన్.
సారనాథ్ బుద్ధుడు
బోధగయలో జ్ఞానోదయం అయిన తర్వాత బుద్ధుడు తొలి ప్రవచనాన్ని వెలువరించిన ప్రదేశం సారనాథ్. బౌద్ధానికి సంబంధించిన నమూనా చిత్రాల్లో బోధిచెట్టు కింద కూర్చున్న బుద్ధుడు, ఎదురుగా ఐదుగురు శిష్యులు ఉంటారు. అది సారనాథ్‌లో ఇచ్చిన ప్రవచనానికి ప్రతీకాత్మక చిత్రం.
సారనాథ్‌లోని బౌద్ధ స్థూపం పేరు ధమేక్ స్థూపం. దానిని అధ్యయనం చేస్తే బౌద్ధ పరమార్థం అవగతమవుతుంది. భారత ప్రభుత్వం అధికారిక ముద్రగా స్వీకరించిన నాలుగు సింహాల పిల్లర్ ఇక్కడిదే. ఇక్కడి మ్యూజియం ఒక బౌద్ధ అధ్యయన కేంద్రం. నిర్వహణ కూడా బాగుంటుంది. మూలగంధ కుటీర్ నిర్మాణకౌశలంలో మహోన్నతమైనదనే చెప్పాలి.
ఓ వందేళ్ల కిందట బుద్ధుడి అవశిష్ఠాన్ని ప్రతిష్ఠించి నిర్మించిన ఆలయం. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే ఇప్పుడు మనం చూసే బోధివృక్షం శ్రీలంలోని అనూరాధపురా నుంచి సేకరించిన ఒక బోధి మొక్క. బుద్ధుడికి జ్ఞానోదయం అయిన బోధగయ బోధివృక్షం నుంచి ఒక మొక్కను అశోకుడి కూతురు సంఘమిత్ర... అనూరాధపురాకు తీసుకువెళ్లింది. బో«ద్‌గయలోని చెట్టు విధ్వంసం అయినప్పుడు అనూరాధపుర వృక్షం నుంచి సేకరించి తెచ్చిన మొక్కల్లో ఒకటి బో«ద్‌గయలో మరొక దానిని సారనాథ్‌లో నాటారు.
5వ రోజు
ఉదయాన్నే టీ, బ్రేక్‌ఫాస్ట్ రైల్లోనే. నౌతన్వా రైల్వేస్టేషన్‌కు చేరిన తర్వాత రైలు దిగి నేపాల్‌లో ప్రవేశించి లుంబినికి చేరాలి. పర్యాటకులు పాస్‌సోర్ట్, వీసా దగ్గర ఉంచుకోవాలి. నేపాల్ వీసా లేని వాళ్లు ఆన్ అరైవల్ వీసా కోసం (అక్కడికి చేరిన తర్వాత జారీ చేసే వీసా) ఫీజు తోపాటు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు ఉండాలి. లుంబినిలో హోటల్‌లో చెక్‌ఇన్, మధ్యాహ్న భోజనం తర్వాత లుంబిని సైట్ సీయింగ్. రాత్రి భోజనం, బస లుంబినిలో.
లుంబినిలో పుట్టాడు
నౌత్వానా రైల్వే స్టేషన్ చాలా చిన్న స్టేషన్. నిజానికి ప్రత్యేకంగా చెప్పు కోవాల్సిన ప్రదేశం కాదు. కానీ భారత్– నేపాల్ సరిహద్దులో మనదేశం నిర్వహిస్తున్న చివరి స్టేషన్. నేపాల్‌కి వెళ్లాలంటే ఇక్కడ దిగి రోడ్డుమార్గాన సరిహద్దు ప్రదేశం సునౌలి దగ్గర పాస్‌పోర్ట్ మీద స్టాంప్ వేయించుకోవాలి. ఇక్కడి నుంచి పది కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే క్రీ.పూ 544లో బుద్ధుడు పుట్టిన లుంబినిలో ఉంటాం. లుంబిని బుద్ధుడు పుట్టిన ప్రదేశంలో మాయాదేవి ఆలయాన్ని నిర్మించారు.
ధవళం మీద ప్రసరించిన కాంతి వెలుగులతో ప్రశాంతతకు చిహ్నంగా ఉంటుందీ ఆలయం. లుంబినిలో నిర్మించిన మహాస్థూ΄ాన్ని వరల్డ్ పీస్ పగోడాగా గుర్తిస్తారు. లుంబిని మొత్తాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది యునెస్కో.
6వ రోజు
లుంబిని హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్. కుశినగరకు ప్రయాణం. కుశినగరలో లంచ్ తర్వాత మహాపరినిర్వాణ టెంపుల్, రామ్‌భర్ స్థూప, మాతా కుటీర్ టెంపుల్‌తోపాటు ఇతర దర్శనీయ స్థలాల వీక్షణం. అక్కడి నుంచి గోరఖ్‌పూర్‌కు ప్రయాణం. గోరఖ్‌పూర్ రైల్వేస్టేషన్‌లో ‘బుద్ధిస్ట్ సర్క్యూట్ టూరిస్ట్ ట్రైన్’ ఎక్కి బలరామ్‌పూర్‌కు సాగి΄ోవాలి. డిన్నర్ ట్రైన్‌లోనే. (శ్రావస్థికి వెళ్లడానికి)
బుద్ధుడి నిర్యాణం
నే΄ాల్‌లో పుట్టిన సిద్ధార్థుడు భారతదేశంలో బుద్ధుడయ్యాడు. ఎనభై ఏళ్లు జీవించిన తర్వాత భారతదేశంలోనే చివరి నిద్రకుపక్రమించాడు. ఉత్తరప్రదేశ్‌లోని కుశినగరలో బుద్ధుడు తుది శ్వాస వదిలిన చోట మహాపరి నిర్యాణ ఆలయాన్ని నిర్మించారు.
దాని వెనుక నిర్వాణ చైత్య (పరినిర్వాణ స్థూప) ఉంది. ఇక్కడికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరాన బుద్ధుడి అవశిష్ఠంతో నిర్మించిన రామభార్ స్థూప కూడా గొప్ప ప్రాశస్త్యం కలిగిన బౌద్ధ నిర్మాణం. ఇక ఇక్కడ చూడాల్సిన వాటిలో మాతా కుటీర్ టెంపుల్ ముఖ్యమైనది. బుద్ధుడు తొలి ప్రవచనం ఇచ్చిన ప్రదేశం సారనాథ్ అయితే చివరి ప్రవచనం ఇచ్చిన ప్రదేశం మాతా కుటీర్ టెంపుల్.
7వరోజు
ఉదయం టీ తాగిన తర్వాత బలరామ్‌పూర్ రైల్వేస్టేషన్‌లో రైలు దిగి శ్రావస్థికి ప్రయాణం. 15 కిమీల దూరం. శ్రావస్థిలో హోటల్ గదిలో చెక్ ఇన్. రిఫ్రెష్‌మెంట్ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత సైట్ సీయింగ్‌కి బయలుదేరాలి. జేతవన విహార, పక్కి సెహాత్ మహేత్ వీక్షణం. మధ్యాహ్న భోజనం తర్వాత కొంత సేపు విశ్రాంతి. ఆ తర్వాత బలరామ్‌పూర్ రైల్వేస్టేషన్‌కు ప్రయాణం. రైలెక్కిన తర్వాత రైలు ఆగ్రాకు సాగి΄ోతుంది. రాత్రి భోజనం రైల్లో.
శ్రావస్థి... ప్రపంచ శాంతిరవం
శ్రావస్థి ప్రాచీన, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశం, జనపదాల కాలంలో కోసల రాజ్యానికి రాజధాని నగరం. రాముడి కుమారుడు లవుడు పాలించిన నగరమని చెబుతారు. జ్ఞానోదయమైన తరవాత బుద్ధుడు చాలా కాలం ఈ ప్రదేశంలో నివసించాడు. బుద్ధుడి జీవితంలో అనేక అద్భుతాలు ఇక్కడే జరిగాయని చెబుతారు. వందలాది బోధనలు వెలువరించడంతోపాటు అనేక మందిని సమ్యక్ జీవనం వైపు ప్రభావితం చేసిన ప్రదేశం.
నాటి చౌద్ధ జ్ఞాపకాల పునర్నిర్మాణాలను చూడవచ్చు. ఇక్కడ పర్యటించిన బౌద్ధులు శ్రావస్థి సమీపంలోని ఆనందబోధి వృక్షం కింద కొంత సేపు ధ్యానంలో గడుపుతారు. బౌద్ధం ఆకాంక్ష అయిన ప్రపంచ శాంతికి ప్రతీకగా ఇక్కడ ప్రపంచ శాంతి గంట ఉంది. ఈ ప్రదేశం బౌద్ధంతో΄ాటు జైనానికి కూడా ప్రత్యేకమైనదే.
జేతవన వీక్షణం
బుద్ధుడు ప్రవచనాలను బోధిస్తూ పర్యటిస్తున్న క్రమంలో వేణువనంలో కొంతకాలం నివసించిన తర్వాత జేతవనంలో నివసించాడు. ఇక్కడ పెద్ద విహారం ఉండేది. ఇప్పుడు మనం చూడగలిగింది ఆ విహారానికి ఆనవాలుగా మిగిలిన శిథిలాలను మాత్రమే. బుద్ధుడి కోసం ఈ విహారాన్ని నిర్మించింది శ్రావస్థి నగరంలోని సంపన్నుడైన వ్యాపారి ఆనంద పిండిక. బౌద్ధాన్ని స్వీకరించిన తర్వాత జీవితాన్ని సమాజసేవ కోసం అంకితం చేసిన ఆనంద పిండిక విశాలమైన స్థలాన్ని కొని విహారాన్ని నిర్మించాడు. ఈ ప్రదేశాన్ని శ్రావస్థి యువరాజు జేత పేరుతో జేతవనంగా పిలిచేవారు. అదే జేతవన విహారంగా వాడుకలోకి వచ్చింది.
8వ రోజు
ఉదయం టీ తర్వాత రైలు ఆగ్రాకు చేరుతుంది. రిఫ్రెష్‌మెంట్ తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసి రైలు దిగి సైట్‌సీయింగ్‌కి వెళ్లాలి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాజ్‌మహల్ వీక్షణం తర్వాత ఆగ్రా రైల్వేస్టేషన్‌కు వెళ్లి రైలెక్కాలి. మధ్యాహ్న భోజనం రైల్లోనే. ‘బుద్ధిస్ట్ సర్క్యూట్ టూరిస్ట్ ట్రైన్’ సాయంత్రం టీ తర్వాత ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వేస్టేషన్‌కు చేరుతుంది. టూర్ నిర్వహకులు పర్యాటకులకు వీడ్కోలు చెబుతారు.
బియాండ్ ద తాజ్!
తాజ్‌మహల్ రకరకాల వాస్తుశైలిల సమ్మిళితం. ఇండో– ఇస్లామిక్ నిర్మాణ శైలికి మొఘల్ ఆర్కిటెక్చర్‌ని జోడిస్తే వచ్చిన రూపం. ముంతాజ్ మరణం తర్వాత మొఘల్ పాలకుడు షాజహాన్‌ని తీవ్రమైన దుంఖం నుంచి సాంత్వన కలిగించిన నిర్మాణం కూడా.
ముంతాజ్ మరణం తర్వాత షాజహాన్ విచారంతో తనకిష్టమైన సంగీతం, ఆహారం, దుస్తుల పట్ల కూడా ఆసక్తి లేకుండా గడిపాడు. ఆగ్రా సమీపంలో రాజా మొదటి జయ్‌సింగ్ నిర్మించిన గొప్ప నిర్మాణం ఉందని తెలిసిన తర్వాత రాజుతో అంగీకారం కుదుర్చుకుని ముంతాజ్ సమాధి కోసం తీసుకున్నాడని చరిత్రకారులు నిర్ధారించారు. ముంతాజ్ మరణించినప్పుడు ఆమె శవపేటికను మధ్యప్రదేశ్, బుర్హాన్‌పూర్‌లో తపతి నది తీరాన అహుఖానా అనే భవనంలో సమాధి చేశారు.
జయ్‌సింగ్‌తో ఒప్పందం తర్వాత ఆ భవనానికి కొన్ని మార్పులు చేసి ముంతాజ్ శవపేటికను ఇక్కడికి తరలించారు. ఆ తర్వాత షాజహాన్‌ను కూడా ఇక్కడే ఖననం చేశారు. తాజ్‌మహల్‌లో ఆ రెండు సమాధులను చూడవచ్చు. తాజ్‌మహల్ వెనుక దాగిన వాస్తవాలను తెలుసుకునే కొద్దీ ప్రేమ చాలా గొప్పదని ఒప్పుకుని తీరాల్సిందే.
ప్యాకేజీల సంగతిదీ..
ఐఆర్‌సీటీసీ బుద్ధిస్ట్ సర్క్యూట్ టూరిస్ట్ ట్రైన్ ప్రస్తుతం కొత్త ఆఫర్లతో ΄్యాకేజ్ ప్రకటించింది. ఇది ఎనిమిది రోజుల యాత్ర. ఢిల్లీ నుంచి మొదలై ఢిల్లీకి చేరడంతో పూర్తవుతుంది. ఇవి విదేశీయులు, ఎన్‌ఆర్‌ఐల కోసం ఉద్దేశించిన ప్యాకేజ్‌లు, కాబట్టి ప్యాకేజ్ ధరలు యూఎస్ డాలర్లలో ఉంటాయి. మనదేశంలో నివసిస్తున్న భారతీయులు కూడా ఆసక్తి ఉంటే ఈ ప్యాకేజ్‌లో టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. ప్యాకేజ్‌లో సూచించిన డాలర్ల సరిపడిన రూపాయలు చెల్లించి టూర్ బుక్ చేసుకోవచ్చు.
టికెట్ ధరలు ఏసీ ఫస్ట్ క్లాస్‌లో టూర్ మొత్తానికి 1400 డాలర్టు. ఒక రోజుకు 175 డాలర్లు.
ఏసీ టూ టయర్‌లో టూర్ మొత్తానికి 1160 డాలర్లు, ఒక్క రోజుకు 145 డాలర్లు.
ఏసీ ఫస్ట్ క్లాస్ కూపేలో టూర్ మొత్తానికి 1550 డాలర్లు, ఒక్క రోజుకు 175 డాలర్లు.
టూర్ మొదలయ్యే తేదీలు డిసెంబర్ 20, జనవరి (2026) 3, ఫిబ్రవరి 21, మార్చి 21.
ఇవి వర్తించవు!
వీసా ఫీజులు ప్యాకేజ్‌లో వర్తించవు., లాండ్రీ, మందులు, మద్యం, ఇతర పానీయాలు ఉండవు. పర్యటన కోసం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వేస్టేషన్‌కు చేరుకోవడం, పర్యటన పూర్తయిన తర్వాత రైల్వేస్టేషన్ నుంచి వెళ్లే రవాణా సౌకర్యం ఇందులో ఉండదు. పర్యాటక ప్రదేశాల్లోకి కెమెరాలను అనుమతించడానికి ఫీజులు కూడా ప్యాకేజ్‌లో వర్తించవు.
ఇవి వర్తిస్తాయి!
రైలు ప్రయాణం, రైలు దిగిన తర్వాత పర్యాటక ప్రదేశాలకు ఏసీ వాహనంలో రోడ్డు రవాణా, పర్యాటక ప్రదేశాల ఎంట్రీ టికెట్‌లు, బస, భోజనం, ట్రావెల్ ఇన్సూరెన్స్. వీటితోపాటు ఇంగ్లిష్, హిందీ మాట్లాడే టూర్ ఎస్కార్ట్ కూడా పర్యటన ఆద్యంతం వెంట ఉంటారు.
– వాకా మంజులారెడ్డి, సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి
(చదవండి: కర్నాటక టూర్..పర్యాటక దివ్యధామం..!)


