కర్ణాటక టూర్ కన్నడ దేశంలో ఏమేమి ఉన్నాయి?విస్తారమైన అరేబియా సముద్ర తీరం ఉంది.నిశ్శబ్దంగా ధ్వనించే మెత్తటి అలలున్నాయి.సముద్రతీరాన శివుడి సిగ్నేచర్ స్టాచ్యూ ఉంది.సముద్రంలో తేలిన సెయింట్ మేరీ దీవులున్నాయి.ఉడుపి శ్రీకృష్ణుడున్నాడు... గోకర్ణ ఈశ్వరుడున్నాడు. వ్యాసుడు ప్రతిష్ఠించిన అన్నపూర్ణేశ్వరి ఉంది. ఆది శంకరుడు స్థాపించిన శారదపీఠం ఉంది. పక్షిధామం పిలికుల బయలాజికల్ పార్క్ ఉంది. ఐఆర్‌సీటీసీ ఒకే టూర్‌లో వీటన్నింటినీ చూపిస్తోంది.
1వ రోజు..
హైదరాబాద్ నుంచి బయలుదేరి మంగళూరులో దిగిన తర్వాత ఎయిర్΄ోర్ట్‌లో టూర్ నిర్వహకులు రిసీవ్ చేసుకుంటారు. బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ప్రయాణం ఉడుపికి సాగుతుంది. ఉడుపిలో హోటల్ గదిలో చెక్ ఇన్ అయిన తర్వాత సెయింట్ మేరీస్ ఐలాండ్స్ విహారం. సాయంత్రం శ్రీకృష్ణ ఆలయ దర్శనం తర్వాత రాత్రి భోజనం బస ఉడుపిలో.
ఇది జియో టూర్
ఎకో టూర్, స్పిరుచువల్ టూర్‌లు మనకు పరిచయమే. ఇది జియో టూర్. ప్రకృతి సహజమైన అద్భుతాలను చూశాం, చారిత్రక అద్భుతాలను చూస్తుంటాం. ఇది భౌగోళిక అద్భుతం. పర్వతం పేలిన తరవాత పెల్లుబికిన లావా సముద్రం పైకి తేలి బలపాలను వరుసగా పేర్చినట్లు అచ్చులు అచ్చులుగా ఘనీభవించడంతో ఏర్పడిన దీవులివి. వీటికి సెయింట్ మేరీస్ ఐలాండ్స్ అనే పేరు పెట్టింది వాస్కోడి గామా.
మనదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన ΄ోర్చుగీసు నావికుడు. కేరళలో క΄్పాడ్ బీచ్ దగ్గర మనదేశంలో నేల మీద అడుగు పెట్టాడు. అంతకు ముందు ఈ దీవుల మీద సేదదీరాడు. అరేబియా సముంద్రలో ఉడిపి దగ్గర ఉన్న నాలుగు దీవుల సమూహం. మేరీ మాత గౌరవార్థం ఈ దీవులకు సెయింట్ మేరీస్ ఐలాండ్స్‌గా నామకరణం చేశాడు. స్థానికులు థోన్సేపార్ అని పిలుస్తారు.
అరేబియా తీరాన ఓ సాయంత్రం
ఉడుపిలో శ్రీకృష్ణుడి దర్శనం ప్రధాన ఆకర్షణ. శ్రీకృష్ణుని దర్శనం తర్వాత కృష్ణుని బంగారు రథాన్ని చూడడం మర్చి΄ోవద్దు. ఉడుపి కృష్ణుని ఆలయ నిర్మాణం దానికదే ప్రత్యేకం. ఇలాంటి ఆలయం దేశంలో మరొకటి లేదు. కృష్ణుడిని దర్శించుకున్న తరువాత సాయంత్రాన్ని మాల్పే బీచ్‌లో ఆహ్లాదంగా గడపవచ్చు. సూర్యోదయానికి బంగాళాఖాతం, సూర్యాస్తమయానికి అరేబియా సముద్రాలు ప్రకృతి మనదేశానికి ఇచ్చిన వరాలు. ఉడుపి, మాల్పే బీచ్‌లోని అడ్వెంచర్ పార్క్‌లో ఆటలు పిల్లలకు మధురానుభూతి. భోజన ప్రియులకు ఉడుపి అనగానే రుచికరమైన ఉపాహారాలు గుర్తుకు వచ్చి నోరూరిస్తాయి. కన్నడిగుల చేతి రుచిని బీచ్‌లో ఉన్న స్టాల్స్‌లో టేస్ట్ చేయవచ్చు.
2వరోజు
బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోరనాడుకు ప్రయాణం. అన్నపూర్ణేశ్వరి ఆలయ దర్శనం తర్వాత శృంగేరికి ప్రయాణం. శృంగేరి ఆలయ దర్శనం తర్వాత సాయంత్రం తిరిగి ఉడుపికి ప్రయాణం. ఈ రాత్రి బస కూడా ఉడుపిలోనే.
అన్నం పెట్టే తల్లి
హోరనాడు అన్నపూర్ణేశ్వరి ఆలయం భద్ర నది తీరాన ఉంది. మనం తుంగ– భద్ర నదిగా పిలిచే రెండు నదుల్లో భద్ర నది అన్నమాట. హోరనాడు ప్రదేశం స్వచ్ఛంగా అచ్చమైన ప్రకృతి ఒడి. పచ్చటి పంటచేలు, మంద్రంగా ప్రవహించే భద్ర నది, ధీరగంభీరగా ఆకాశాన్ని తాకడానికే ఎదిగినట్లున్న పశ్చిమ కనుమల సౌందర్యం... వీటన్నింటినీ ఆస్వాదిస్తూ ఆధ్యాత్మికతను మది నిండా నింపుకోగలిగిన ప్రదేశం ఇది.
ఆదిశక్త్యాత్మక శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆలయాన్ని అగస్త్య మహాముని ప్రతిష్ఠించాడని చెబుతారు. ఇక్కడి సస్యశ్యామలమైన పొలాలను చూసిన వ్యాసుడు సమృద్ధిగా ఆహారాన్ని అందిస్తున్న పంటలకు ప్రతీకగా అన్నపూర్ణేశ్వరిని ప్రతిష్ఠించాడేమో అనిపిస్తుంది.
అక్షరమిచ్చే బంగారు తల్లి
శృంగగిరి మఠాన్ని ఆది శంకరాచార్యులు సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం స్థాపించాడు. వ్యవహారంలో అది శృంగేరిగా మారిపోయింది. శృంగేరి శారదాపీఠం అనుబంధ మఠాలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ఆ గురు పరంపరలో తెలుగు వ్యక్తి విధుశేఖర భారతి ఉన్నారు. ఇక్కడ చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశం చదువుల తల్లి సరస్వతీ మాత కొలువై ఉన్న శ్రీశారదాంబ ఆలయం.
ఆలయ శిల్పసౌందర్య వీక్షణం, సరస్వతీదేవి దర్శనం జీవితకాలం గుర్తుండే మధురానుభూతి. ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించిన సరస్వతీ మాత విగ్రహం చందన శిల్పం. ఆ తర్వాత విజయనగర రాజులు బంగారు విగ్రహం చేయించారు.
3వ రోజు
బ్రేక్‌ఫాస్ట్ తర్వాత గోకర్ణకు ప్రయాణం. గోకర్ణం బీచ్, మురుదేశ్వర్ ఆలయ దర్శనం తర్వాత కొల్లూరుకు ప్రయాణం. అక్కడ ఆలయ దర్శనం తర్వాత తిరిగి ఉడుపికి ప్రయాణం. మూడవ రోజు రాత్రి బస కూడా ఉడుపిలోనే.
అరేబియా తీరాన మహేశ్వరులు
శివుడు... మురుదేశ్వరుడి పేరుతో పూజలందుకుంటున్న ప్రదేశం పేరే మురుదేశ్వర్. అరేబియా తీరాన ధ్యానముద్రలో శివుడి విగ్రహం మురుదేశ్వర్‌కి సిగ్నేచర్ పిక్చర్. ప్రపంచంలో ఉన్న అత్యంత పెద్ద శివుడి విగ్రహాలలో మురుదేశ్వర్ విగ్రహానిది మూడవ స్థానం. ఈ ఆలయంలో 20 అంతస్థుల రాజగోపురం స్పెషల్ అట్రాక్షన్. బంగారు గోపురం సంధ్యా కిరణాలకు మిరుమిట్లు గొలుపుతూ ఉంటుంది. కైలాసనాథ మహాదేవుడి ప్రతిరూపంగా కొలుస్తారు.
ఇక్కడి శివలింగం భూమి మీద ప్రతిష్ఠించింది కాదనీ, భూగర్భం నుంచి ఉద్భవించినదని, కైలాసం నుంచి రావణాసురుడు తెచ్చిన ఆత్మలింగం అని చెబుతారు. ఇక్కడికి సుమారు 80 కిలోమీటర్ల దూరన గోకర్ణ తీర్థం ఉంది. అందులోని శివుడు మహాబలేశ్వరుడు. ఇక్కడి లింగాన్ని కూడా ఆత్మలింగం అనే చెబుతారు. ఈ ఆలయాలకు వెళ్లేటప్పుడు డ్రెస్‌కోడ్ తప్పనిసరి. హిందూ సంప్రదాయ దుస్తులనే ధరించాలి. భుజాలు, మోకాళ్లను కవర్ చేస్తున్న దుస్తులతోనే అనుమతిస్తారు. జీన్స్, స్లీవ్‌లెస్, షార్ట్స్ వంటి వస్త్రధారణ నిషిద్ధం. కాబట్టి జర్నీ ప్లానింగ్‌లో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
చందమామ కథల నేల
కన్నడిగులకు కొల్లూరుతో గొప్ప అనుబంధం ఉంది. మనం చందమామ కథల్లో చదివిన మూకాంబిక అమ్మవారు కొలువై ఉన్న ప్రదేశం కొల్లూరు. మహాశక్తివంతమైన దేవతగా విశ్వసిస్తారు. స్థానిక కథనాల ప్రకారం ఆదిశంకరాచార్యులు కేరళలోని కుదజాద్రి కొండల్లో ధ్యానం చేసుకుంటున్న సమయంలో మూకాంబిక దేవి ప్రత్యక్షమైంది. ఆది శంకరుని కోరిక మేరకు ఆమె అతడిని అనుసరిస్తూ వెనుకే నడిచింది. ఆది శంకరుడు వెనక్కి చూసిన క్షణంలో అక్కడే ఆగి΄ోతానని షరతు కూడా పెట్టింది. అలా చేర రాజ్యం నుంచి వారి ప్రయాణం మొదలైంది.
కొల్లూరు పరిసరాలకు వచ్చేటప్పటికి ఆది శంకరాచార్యునికి ఆమె పాదమంజీరాల సవ్వడి వినిపించలేదు. అప్పుడతడు వెనక్కి చూశాడని, మూకాంబిక తన షరతు ప్రకారం అక్కడే ఆగిపోయిందని, అక్కడే గుడి కట్టి పూజిస్తున్నారని చెబుతారు. చేర రాజ్యం నుంచి వచ్చిన దేవత కాబట్టి ఉత్తర కేరళ వాళ్లు తమ ఇంటి ఆడపడుచుగా భావించి మూకాంబిక దర్శనానికి వస్తారు. అందుకే ఇక్కడ కన్నడ వాళ్లతోపాటు మలయాళీలు కూడా పెద్ద సంఖ్యలో కనిపిస్తారు.
4వ రోజు..
బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్, ధర్మస్థలకు ప్రయాణం. మంజునాథ ఆలయ దర్శనం తర్వాత కుక్కెకి ప్రయాణం. రాత్రి భోజనం చేసిన తర్వాత కుక్కెలో బస.
శివుడు– గోమఠేశ్వరుడు
ధర్మస్థల ఇటీవల వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. వివాదాలను పక్కన పెడితే కన్నడ సంస్కృతి– జైన సంప్రదాయాల మేళవింపుకు ప్రతీక అయిన ఈ ఆలయం చూడాల్సిన ప్రదేశమే. ఎనిమిది వందల ఏళ్ల నాటి నిర్మాణం. శివుడు ఇక్కడ మంజునాథుడిగా పూజలందుకుంటున్నాడు. మహాశివరాత్రికి శివుడికి ఉత్సవాలు, జైన సంప్రదాయంలో భాగంగా ఇక్కడ కొలువై ఉన్న గోమఠేశ్వరుడికి మహామస్తకాభిషేకం వైభవంగా జరుగుతాయి.
5వరోజు
బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కుక్కె సుబ్రహ్మణ్యం దర్శనం చేసుకుని తిరిగి హోటల్‌కు వచ్చి హోటల్ గది చెక్ అవుట్ చేయాలి. ప్రయాణం మంగళూరుకు సాగుతుంది. మంగళూరులో హోటల్ గదిలో చెక్ ఇన్ అయిన తర్వాత సాయంత్రం తన్నేరు బావి బీచ్ విహారం. కద్రోలి గోకర్ణనాథ ఆలయ దర్శనం. రాత్రి బస మంగళూరులో.
ఊరిపేరే దేవుడి పేరు
మనదేశంలో శైవం, వైష్ణవం పోటాపోటీగా విస్తరిస్తున్న రోజుల్లో రూపుదిద్దుకున్న ఆలయాలకు లెక్కేలేదు. కర్నాటకలో వీరశైవం ప్రభావంతో శివుడు, శివుడి కుటుంబ సభ్యుల ఆలయాలు ఎక్కువ కనిపిస్తాయి. శివపార్వతుల కుమారులిద్దరూ గణేశుడు, కార్తికేయుడిగా పూజలందుకుంటుంటారు.
కార్తికేయుడిని సుబ్రహ్మణ్యంగా కొలుస్తారిక్కడ. స్థలపురాణం కూడా శైవం– వైష్ణవాల ఆధారంగానే ఉంటుంది. విష్ణుమూర్తి వాహనమైన గరుట్మంతుడి బారి నుంచి తనను తాను రక్షించుకోవడానికి వాసుకి ఇక్కడ ఆశ్రయం పొందినట్లు చెబుతారు. ఈ గ్రామం పేరు సుబ్రహ్మణ్య. అందుకే ఇక్కడి దేవుడు సుబ్రహ్మణ్యస్వామిగా వ్యవహారంలోకి వచ్చాడు.
బంగారు తీరం తన్నేరు బావి
అరేబియా తీరంలో అలలు మంద్రంగా చిరుసవ్వడితో ఆలరిస్తుంటాయి. తన్నేరు బావి దగ్గర అరేబియా సముద్రజలంలో కలుషితాలు లేకుండా స్వచ్ఛంగా ఉంటుంది. ఇక్కడి బీచ్‌లో ఇసుక పసుపురంగులో బంగారం రాశి΄ోసినట్లుంటుంది. సూర్యాస్తమయాన్ని వీక్షించడానికి ఇది మంచి ప్రదేశం. పర్యాటక రంగం ఏర్పాటు చేసిన సౌకర్యాలతో ఈ బీచ్‌లో టూరిస్ట్ ఫ్రెండ్లీ ఎన్విరాన్‌మెంట్ ఉంటుంది. గుర్రం మీద విహరించనూవచ్చు.
6వ రోజు
బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేయాలి. మంగళాదేవి ఆలయం, మంజునాథ ఆలయ దర్శనం తర్వాత పిలికుల బయోలాజికల్ పార్క్ వీక్షణం. టూర్ నిర్వహకులు పర్యాటకులను సాయత్రం మంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేసి వీడ్కోలు చెబుతారు. విమానం ఎక్కి హైదరాబాద్ చేరడంతో టూర్ పూర్తవుతుంది.
మంగళాదేవి ఊరు
మంగళాదేవి ఆలయం ఉండడంతోనే ఆ ఊరికి మంగళూరుకు అనే పేరు వచ్చింది. మంగళాదేవి ఆలయం ఏటవాలు ఎర్ర పై కప్పుతో కేరళ వాస్తుశైలిలో ఉంటుంది. ఇందుకు కారణం దీనిని కట్టిన రాజు పేరు కుందవర్మన్. తుళునాడు, మలనాడు ్ర΄ాంతాల ΄ాలకుడు. ఈ సమ్మిళిత శైలి ఈ ఆలయం నిర్మాణంలో కనిపిస్తుంది.
అందమైన పక్షిధామం
పిలికుల బయలాజికల్ పార్క్ మల్టీ డైమన్షన్‌లు కలిగిన టూరిస్ట్ ప్లేస్. ఎకో టూరిజమ్, ఎడ్యుకేషనల్ టూరిజమ్, ఆహ్లాదకరమైన విహార ప్రదేశం కూడా. కన్నడంలో దీని పేరు పిలికుల నిసర్గ ధామ. నాలుగు వందల ఎకరాల పార్కులో కోర్ ఏరియా 150 ఎకరాలుంటుంది. ఇక్కడి పక్షులు మాత్రం రెక్కల్లోని వైవిధ్యత అంతా ఒక చోటకు చేర్చి ప్రదర్శనకు పెట్టినట్లు కనువిందు చేస్తాయి. ఆస్ట్రిచ్, ఈము కోళ్లు, రియా కొంగలు, చిలుకలు, బ్లాక్ స్వాన్, పెలికాన్, గినియా ఫౌల్ (గిన్ని కోళ్లు), నైట్ హోరన్, గుడ్లగూబలు, లవ్ బర్డ్స్... ఇలా రకరకాల పక్షులను చూడవచ్చు.
రకరకాల జాతుల కొంగలు సున్నితంగా అడుగులు వేస్తూ ఆహ్లాదపరుస్తాయి. భూమ్మీద ఉన్న పక్షి జాతులన్నీ ఇక్కడ ఉన్నాయా అనిపిస్తుంది. టీనేజ్ పిల్లలకు ఈ పార్క్ ఒక ఎడ్యుకేషన్ అనే చెప్పాలి. ఇక్కడ నిబంధనలు కఠినంగా ఉంటాయి, వాటిని కచ్చితంగా అమలు పరుస్తారు కూడా. కాబట్టి పర్యాటకులు విధిగా పాటించి తీరాలి. జంతువులకు చిరాకు కలిగించే పనులు చేయరాదు.
వాటికి తినుబండారాలు పెట్టకూడదు. అడవుల్లో పర్యటించేటప్పుడు జంతువులను ఏదో చూశామంటే చూసేశాం అన్నట్లు చూడకూడదు. ప్రతి జంతువునీ దానికంటూ ఉండే ప్రత్యేకత కదలికలను గమనించాలి. కొన్నింటికి తోక ఊపడంలో వైవిధ్యత, కొన్నింటికి కొమ్ములను విదిలించడం, కొన్ని అడుగులు వేసేటప్పుడు మట్టిలో పాదముద్రలు పడనంత సున్నితంగా నడుస్తుంటాయి. ఈ టూర్‌లో ఎంట్రీ టికెట్‌తో పాటు కెమెరా టికెట్ కూడా తీసుకుంటే కొమ్మల మీద కూర్చుని కువకువలాలడే పక్షలను, గురుపుర నదిలో నీరు తాగుతున్న జింకలను, నేల మీద జరజరపాకే సరీసృపాలను రికార్డ్ చేసుకోవచ్చు.
ప్యాకేజ్ పేరు..
డివైన్ కర్ణాటక, ప్యాకేజ్ కోడ్: ఎస్‌హెచ్‌ఏ 08. ఈ ఆరు రోజుల టూర్ హైదరాబాద్ ఎయిర్΄ోర్ట్ నుంచి బయలుదేరి హైదరాబాద్‌కే చేరడంతో పూర్తవుతుంది. ఈ టూర్‌లో హోరనాడు అన్నపూర్ణేశ్వరి, శృంగేరి, గోకర్ణ, మురుదేశ్వర్, కొల్లూరు, ధర్మస్థల, మంజునాథ్ ఆలయం, తన్నేరు బావి బీచ్, కుద్రోలి గోకర్ణాథ టెంపుల్, మంగళాదేవి, కద్రి మంజునాథ, పిలికుల బయోలాజికల్ ΄ార్క్ కవర్ అవుతాయి.
టారిఫ్ ఇలా..
సింగిల్ ఆక్యుపెన్సీ 45,950 రూపాయలు,
డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 36,100,
ట్రిపుల్ ఆక్యుపెన్సీలో 34,850 రూపాయలు.
ప్రయాణం ఎప్పుడు? 21.01.2026, ఉదయం 05.50 గంటలకు 6ఈ 7549 నంబరు విమానం హైదరాబాద్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్΄ోర్టు నుంచి బయలుదేరి ఉదయం 07.35 గంటలకు మంగళూరుకు చేరుతుంది. తిరుగు ప్రయాణం 26.01.2026. రాత్రి 21.55 గంటలకు 6ఈ 7241 విమానం మంగళూరు నుంచి బయలుదేరి 23.50 గంటలకు హైదరాబాద్‌కు చేరుతుంది.
ప్యాకేజ్‌లో...
విమానం టికెట్‌లు, హోటల్ బస, ఆరు బ్రేక్‌ఫాస్ట్‌లు, నాలుగు డిన్నర్‌లు, ఐటెనరీలో సూచించిన ప్రదేశాలకు ప్రయాణానికి ఏసీ వాహనం, ట్రావెల్ ఇన్సూరెన్స్, టూర్ ఎస్కార్ట్ సౌకర్యాలుంటాయి.
లంచ్, ఇంటి నుంచి ఎయిర్‌పోర్ట్‌కి– ఎయిర్΄ోర్ట్ నుంచి ఇంటికి రవాణా, పర్యాటక ప్రదేశాల్లో దర్శనాల టికెట్‌లు, డ్రైవర్‌లకిచ్చే టిప్పులు, ఇతర పానీయాలు, లాండ్రీ, మెనూలో లేన పదార్థాలను ఆర్డర్ చేసుకుంటే ఆ బిల్లులు, పర్యాటక ప్రదేశాల్లో గైడ్ సర్వీస్‌లు ప్యాకేజ్‌లో వర్తించవు.
బుకింగ్ కోసం..
జోనల్ ఆఫీస్,
ఐఆర్‌సీటీసీ, సౌత్ సెంట్రల్ జోన్
9–1–129/1/302, థర్డ్ ఫ్లోర్, ఆక్స్‌ఫోర్డ్ ΄్లాజా,
ఎస్‌డీ రోడ్, సికింద్రాబాద్, తెలంగాణ.
ఫోన్ నంబరు: 040–27702407, 82879 32229
ఐఆర్‌సీటీసీ – టూరిజమ్ ఇన్‌ఫర్మేషన్ అండ్
ఫెసిలిటేషన్ సెంటర్,
విజయవాడ రైల్వే స్టేషన్
ఫోన్ నంబరు: 92810 30714, 82879 32312
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి


