కుటుంబ పర్యటనల్లో మహిళే కీలకం
పదింటిలో ఏడు ఫ్యామిలీ ట్రిప్‌లు ప్లాన్ చేసేది ఆమే..
జర్నీ ప్లాన్.. హోటళ్లు, టికెట్లు బుక్ చేయడం..
చివరకు ఎక్కడికి వెళ్లాలో ఖరారు చేసేదీ యజమానురాలే..
బోటిక్ బసలు,వెల్నెస్ నడకలతో కూడిన యాత్రలకు మొగ్గు
చెల్లింపులు చేసేది మాత్రం ఇప్పటికీ ఎక్కువగా పురుషులే
‘థ్రిల్లోఫిలియా’తాజా నివేదిక
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో కుటుంబమంతా కలిసి విహారయాత్రలకు వెళ్లడం, ఇందుకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ శాతం నిర్ణయాధికారం మహిళలదే అని తేలింది. పదింటిలో ఏడు ఫ్యామిలీ ట్రిప్‌లను మహిళలే ప్లాన్ చేస్తున్నారంటేనే ఈ విషయం అర్థమవుతోంది. అందుబాటులో ఉన్న ప్రయాణ ప్రణాళికలను సమీక్షించడం, ఖర్చులు అంచనా వేయడం, ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించడం, అవసరమైన తనిఖీలు క్షుణ్ణంగా చేయడం, కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులతో ఆయా అంశాలపై చర్చించడం, చివరకు పర్యాటక గమ్యస్థానాలను ఖరా రు చేయడం వరకు ఇంటి యజమానురాలిదే కీలకపాత్ర అని స్పష్టమవుతోంది.
మహిళలు ప్లాన్ చేసిన ట్రిప్‌లలో ప్రీమియం అప్‌గ్రేడ్‌లు (మెరుగైన సేవలు కోరుకోవడం) పురుషుల కంటే 28% ఎక్కువ ఉంటోంది. కానీ అదేసమయంలో మొత్తం ఖర్చును చూస్తే మాత్రం 6శాతమే అధికమని తేలింది. మహిళలు..పురుషుల కంటే సగటున 9రోజుల ముందుగానే ప్రయాణ టికెట్లు, హోటళ్లను బుక్ చేయడంతో పాటు చివరి నిమిషంలోట్రిప్‌లు, హోటళ్ల రిజర్వేషన్ల రద్దు, ఇతర ధరల పెరుగుదల వంటి వాటిని నివారిస్తున్నట్టుగా తేలింది.
ఏఐ–ఆధారిత ట్రావెల్ ప్లాట్‌ఫామ్ థ్రిల్లో ఫిలియా ‘మహిళలు–ప్రయాణ నిర్ణయాలు 2025’నివేదిక’లో ఇలాంటి అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. 2,12,000 ప్రయాణ ప్రణాళికలను, ఏకంగా 89 లక్షల ప్రయాణ ప్రణాళికలకు సంబంధించిన విచారణ (ఎంక్వైరీ)లను థ్రిల్లోఫిలియా విశ్లేషించింది. మహిళలు ఇప్పుడు భారతదేశంలోని 72% విశ్రాంతి ప్రయాణాలను ప్రభావితం చేస్తున్నారని లేదా నేరుగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారని ఈ నివేదిక తేల్చింది. బడ్జెట్, భద్రత మొదలు అన్ని విషయాల్లో నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలిపింది.
మూడు రెట్లు ఎక్కువ భద్రత
⇒ మహిళలు అన్నీ ముందస్తు బుకింగ్‌లు చేయడంతో పాటు భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.
⇒ బడ్జెట్ పెద్దగా పెరగకుండా అర్థవంతమైన అప్‌గ్రేడ్‌లను ఎంచుకుంటున్నారు.
⇒ సౌకర్యవంతమైన, సంతోషకరమైన ప్రయాణాన్ని ఇష్టపడతారు.
⇒ ప్రయాణ ప్రణాళికలలో తరచుగా బోటిక్ బసలు, స్పా సెషన్‌లు, వెల్నెస్ నడకలు, తీరికగా చేసే విహార యాత్రల వైపు మొగ్గు చూపుతున్నారు.
⇒ మహిళలు ప్లాన్ చేసే ప్రయాణాలకు మూడు రెట్లు ఎక్కువ భద్రతా ఫిల్టర్లు ఉంటాయి. ఫలితంగా టూర్లకు సంబంధించి చేసే అత్యవసర కాల్స్ 23 శాతం తక్కువగా ఉంటున్నాయి.
⇒ మహిళలే ప్రయాణ ప్రణాళికలు వేసినప్పటికీ, 62 శాతం చెల్లింపులు ఇప్పటికీ పురుషులే చేస్తుండటం గమనార్హం.
రాజస్థాన్, కేరళ, గోవాలపై మక్కువ
⇒ మహిళలు దేశీయంగా ఇష్టపడే ప్రదేశాల్లో రాజస్థాన్, కేరళ, గోవా ఉన్నాయి
⇒ అంతర్జాతీయంగా చూస్తే బాలి, దుబాయ్–అబుదాబి, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం వైపు ఆకర్షితులవుతున్నారు.
⇒ పర్యటనల విషయంలో మహిళల ప్రభావం మెట్రోపాలిటన్ కేంద్రాలకు మించి విస్తరిస్తోందని నివేదిక పేర్కొంది. ద్వితీయ శ్రేణి నగరాలు కీలక కేంద్రాలుగా మారుతున్నాయి.


