సభ్యురాలిగా సీతక్క
న్యూఢిల్లీ: ఈ నెల 10వ తేదీ నుంచి 45 రోజులపాటు కొనసాగే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) బచావో సంగ్రామ్ కమిటీ కన్వీనర్‌గా సీనియర్ నేత అజయ్ మాకెన్‌ను కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ బచావో సంగ్రామ్ ఆందోళన కార్యక్రమాల పర్యవేక్షణ, మార్గదర్శకత్వం, పరిశీలన కోసం సమన్వయ కమిటీని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఏర్పాటు చేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుంది’ అని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ సారథ్యంలోని కమిటీలో సీనియర్ నేతలు జైరాం రమేశ్, సందీప్ దీక్షిత్, ఉదిత్ రాజ్, ప్రియాంక్ ఖర్గే సభ్యులుగా ఉంటారు. ఇందులో తెలంగాణ నాయకురాలు డి. అనసూయ సీతక్క, దీపికా పాండే సింగ్, సునీల్ పన్వర్, మనీశ్ శర్మలను ఖర్గే నియమించారు. ఏఐసీసీలోని ఓబీసీ, ఎస్‌సీ, మైనారిటీ, ఆదివాసీ విభాగాల చైర్‌పర్సన్లు, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు కమిటీలో సభ్యులేనని వేణుగోపాల్ వివరించారు. ఉపాధి హామీని తిరిగి అమలు చేయడంతోపాటు కేంద్రం తీసుకువచ్చిన వీబీ జీ రామ్ జీ పథకాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ జనవరి 10 నుంచి ఫిబ్రవరి 25వ తేదీ వరకు దేశవ్యాప్త నిరసనలను చేపట్టనున్నట్లు ప్రకటించడం తెల్సిందే.


