సాక్షి, ఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. మాజీ మంత్రి హరీష్‌రావు పాత్రను విచారించేందుకు అనుమతించాలన్న అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
బీఆర్‌ఎస్ హయాంలో హరీష్ రావు ఆదేశాలతో పోలీసు ఉన్నతాధికారి రాధా కిషన్ రావు తన ఫోన్ టాప్ చేశారని రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ గతంలో పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా.. దానిని కొట్టేయాలని హరీష్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. ఆ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పూ ఇచ్చింది. ఆ వెంటనే..
హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేయగా.. సుప్రీం పిటిషన్ ఆ పిటిషన్‌ను కొట్టేసింది. అయితే హరీష్‌రావుపై ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయడం సరికాదంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో మరోసారి స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌రావు పాత్రపై తమకు ఆధారాలు లభించాయని, ఆయన బెదిరింపులకు పాల్పడ్డారని తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. అయితే.. సుప్రీం కోర్టు ఇదివరకే ఇచ్చిన తీర్పులో జోక్యానికి జస్టిస్ బీవీ నాగరత్న నిరాకరించారు. సోమవారం తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌ను ఆమె కొట్టేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ బృందం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌రావును సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. సుమారు 9 గంటల పాటు సాగిన విచారణలో గతంలో బీఆర్‌ఎస్ పార్టీకి సమకూరిన ఎలక్టోరల్ బాండ్ల అంశం, ఆ పార్టీ నేతలతో ఉన్న ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నవీన్‌రావు వాంగ్మూలం ఆధారంగా కీలక వ్యక్తులను విచారించే అవకాశమున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇవాళ నవీన్‌రావుతో హరీష్‌రావు భేటీ అవుతారని, విచారణ వివరాలను అడిగి తెలుసుకుంటారని తెలుస్తోంది.



