సిద్దిపేటఅర్బన్: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన జూనియర్ డాక్టర్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందింది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన బి.లావణ్య సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో హౌస్ సర్జన్ పూర్తి చేసి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. శుక్రవారం ఉదయం లేబర్ రూంలో డ్యూటీలో ఉండగా అనారోగ్యంగా ఉండటంతో క్యాజువల్ డిపార్ట్‌మెంట్‌లో చికిత్స తీసుకొని కాలేజీ హాస్టల్‌కు వెళ్లారు.
శనివారం ఉదయం ప్రభుత్వ కళాశాల హాస్టల్‌లో గడ్డి మందును ఇంజెక్ట్ చేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇది గమనించిన తోటి జూనియర్ డాక్టర్లు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందారు. ఇంటర్న్‌షిప్ డ్యూటీలు, నీట్ పీజీ ప్రిపరేషన్ ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడినట్టు మెడికల్ కాలేజీ సిబ్బంది చెబుతున్నారు. జూనియర్ డాక్టర్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిద్దిపేట త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులో ఆత్మహత్యకు గల కారణాలు తెలిపేందుకు పోలీసులు నిరాకరించారు.


